రెడ్‌స్టార్‌ మాదాలకు అశ్రునివాళి | Fans and Communist Party Leaders tribute to Madala Ranga Rao | Sakshi
Sakshi News home page

రెడ్‌స్టార్‌ మాదాలకు అశ్రునివాళి

Published Tue, May 29 2018 1:08 AM | Last Updated on Tue, May 29 2018 1:08 AM

Fans and Communist Party Leaders tribute to Madala Ranga Rao - Sakshi

మాదాల రంగారావు చితికి నిప్పంటిస్తున్న కుమారుడు మాదాల రవి, గద్దర్, చాడ వెంకట్‌రెడ్డి, రాఘవులు, రామకృష్ణ, ప్రజానాట్యమండలి నాయకులు

హైదరాబాద్‌: అభ్యుదయ చిత్రాల కథానాయకుడు, రెడ్‌స్టార్‌ మాదాల రంగారావుకు బంధువులు, అభిమానులు, కమ్యూనిస్టు పార్టీల నేతలతోపాటు పలు పార్టీల కార్యకర్తలు, ప్రజానాట్యమండలి కళాకారులు కన్నీటి వీడ్కోలు పలికారు. మాదాల భౌతికకాయానికి రాయదుర్గంలోని వైకుంఠ మహాప్రస్థానంలో సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు.

అంతకుముందు నగరం నుంచి ప్రత్యేక వాహనంలో భౌతికకాయాన్ని మహాప్రస్థానానికి తీసుకొచ్చారు. మాదాల కుమారుడు రవి స్వయంగా పర్యవేక్షించి అంత్యక్రియలను పూర్తి చేశారు. ప్రజానాట్యమండలి కళాకారులు డప్పులు కొడుతూ, పాటలు పాడుతూ అంతిమయాత్ర నిర్వహించారు. ‘ఎర్రసూర్యుడా..’ అంటూ విప్లవగీతాలు ఆలపిస్తూ నివాళులర్పించారు. చితికి నిప్పంటించే ముందు ప్రజాయుద్ధనౌక గద్దర్, గాయకుడు వందేమాతరం శ్రీనివాస్‌ తమ గీతాలాపనలతో మాదాలకు ఘనంగా నివాళులు అర్పించారు. 

చితికి నిప్పంటించిన కుమారుడు, పలువురు ప్రముఖులు 
తండ్రి చనిపోతే కుమారుడు చితికి నిప్పంటించడం ఆనవాయితీ. కాగా, మాదాల రంగారావుకు మాత్రం కుమారుడు మాదాల రవితోపాటు సీపీఐ, సీపీఎం నేతలు నారాయణ, రామకృష్ణ, బీవీ రాఘవులు, వందేమాతరం, ప్రముఖ సినీనటులు జీవితా రాజశేఖర్‌ దంపతులు వేర్వేరుగా చితికి నిప్పంటించారు.

మాదాలకు ఇష్టమైన ఎర్రటి టీషర్ట్‌పైనే భౌతికకాయాన్ని చితిపైకి చేర్చి నిప్పటించడం విశేషం. కార్యక్రమంలో ప్రజాగాయకుడు గోరటి వెంకన్న, సీపీఐ ఏపీ, తెలంగాణ కార్యదర్శులు రామకృష్ణ, చాడ వెంకట్‌రెడ్డి, మాజీ ఎంపీ అజీజ్‌ బాషా, సినీ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజతోపాటు పలువురు సీపీఐ, సీపీఎం, ప్రజానాట్యమండలి ప్రతినిధులు, అభిమానులు, కుటుంబసభ్యులు పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement