మేడ్చల్: విద్యార్థి సందీప్ అంత్యక్రియలు బుధవారం అశ్రునయనాల మధ్య జరిగాయి. బియాస్ నదిలో గల్లంతై మృతిచెందిన విజ్ఞాన్ జ్యోతి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థి బస్వరాజ్ సందీప్‌యాదవ్ అంత్యక్రియలు స్వగ్రామం మేడ్చల్ మండలం గౌడవెల్లిలో నిర్వహించారు. సందీప్ ఆచూకీ మంగళవారం బియాస్ నదిలో లభ్యం కావడంతో మృతదేహాన్ని బుధవారం మధ్యాహ్నం అధికారులు గౌడవెల్ల్లికి తీసుకొచ్చారు.
తెలంగాణ ప్రభుత్వ అధికారులు సందీప్ మృతదేహాన్ని హిమాచల్‌ప్రదేశ్ నుంచి విమానంలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు.. అక్కడి నుంచి మేడ్చల్ తహశీల్దార్ శ్రీకాంత్‌రెడ్డి అంబులెన్స్‌లో గౌడవెల్ల్లికి తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. సందీప్ మృతదేహాన్ని గౌడవెల్లి సమీపంలోని సూతారిగూడ ఔటర్ రింగ్‌రోడ్డు జంక్ష న్ నుంచి విజ్ఞాన్ జ్యోతి కళాశాల విద్యార్థులు, స్థానిక విద్యార్థులు గౌడవెల్లి వరకు బైక్ ర్యాలీతో తీసుకొచ్చారు.
చివరి చూపు కరువైంది నాయనా..
సందీప్ మృతదేహం అంబులెన్స్‌లో గౌడవెల్లి రాగానే స్థానికులు బోరున విలపించారు. విద్యార్థి చివరిచూపు కూడా లేకుండా మృతదేహం పూర్తిగా కుళ్లి పోవడంతో చెక్కపెట్టెల బాక్సులో తీసుకొచ్చారు. ‘నాయనా నీ చివరి చూపు కూడా కరువైంది’ అంటూ మృతుడి బంధువులు, స్థానికులు రోదించారు.
కుప్పకూలిన తల్లిదండ్రులు..
సందీప్ మృతదేహం ఇంటికి చేరుకోగానే తల్లిదండ్రులు విజయ, వీరేష్‌లు కుప్పకూలిపోయారు. ‘మమ్మల్ని వదిలిపెట్టి పోయావా నాయనా..’ అంటూ వారు గుండెలుబాదుకుంటూ రోదించిన తీరు హృదయ విదారకం. వందలాది మంది విద్యార్థులు, స్ధానిక నాయకులు, ప్రజాసంఘాల నాయకులు, మేడ్చల్ న్యాయవాదులు సందీప్ అంత్యక్రియల్లో పాల్గొని నివాళులు అర్పించారు.
విజ్ఞాన్ జ్యోతి కళాశాలపై చర్యలు తీసుకోవాలి: గద్దర్
విజ్ఞాన్ జ్యోతి ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యంతోనే 23 మంది మృతిచెందారని ప్రజాగాయకుడు గద్దర్ మండిపడ్డారు.
బస్వరాజ్ సందీప్ అంత్యక్రియల్లో ఆయన అతడి తల్లితండ్రులను ఓదార్చారు. ఈ సందర్భంగా గద్దర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం విజ్ఞాన్ జ్యోతి కళాశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బియాస్ నదిలో మృతిచెందిన విద్యార్థుల జ్ఞాపకార ్థం విజ్ఞాన్ కళాశాలలో స్థూపం ఏర్పాటు చేయాలన్నారు.
శోకసంద్రమైన గౌడవెల్లి
Published Thu, Jul 3 2014 12:33 AM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM
Advertisement
Advertisement