కాడెడ్ల సహాయంతో కరెంటు
వ్యవసాయ విద్యుత్తుకు ‘మీమ్’..!
అన్నదాతల ఆసరాగా కొత్త పరికరం
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో {పదర్శన ప్రారంభం
హైదరాబాద్ : ప్రస్తుతం తెలంగాణ రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్తు బాధలను అధిగమించేందుకు మజల్ ఎనర్జీ మిషన్ (మీమ్) వినియోగపడుతుందని ప్రయోగాత్మకంగా రుజువైంది. కాడెడ్ల సాయంతో ఈ యంత్రాన్ని వినియోగించి విద్యుత్తును ఉత్పత్తి చేయొచ్చని దాని రూపకర్త ‘మాడెక్స్’ సంస్థ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించిన ప్రదర్శనలో ఆదివారం చూపింది. మార్కెట్లోకి విడుదలైన ఈ పరికరం ధర రూ.2లక్షలు. రైతులకు, ఔత్సాహికులకు మూడు రోజుల పాటు ఈ ప్రదన ద్వారా అవగాహన కల్పించనున్నారు.
ఆదివారం ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, భానుప్రసాద్, భూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఇంద్రసేనారెడ్డిలు ఈ ప్రదర్శనను లాంఛనంగా ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ప్రాంతానికి చెందిన ఆదర్శరైతు-2014 కొమ్మిరెడ్డి అంజిరెడ్డి ఈ పరికరానికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేవలం ఒక జత కాడెట్లు లేదా దున్నపోతుల జతతో ఈ యంత్రాన్ని నడిపి విద్యుత్ ఉత్పత్తి చేసే ‘మీమ్’ను మార్కెట్లోకి ప్రవేశపెట్టడం అభినందనీయమన్నారు.
రూ.2లక్షల వ్యయంకాగల ఈ పరికరం కొనుగోలు విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకె ళ్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ యంత్రం కొనుగోలుకు రైతులకు 50శాతం సబ్సిడీ మొత్తం ఇప్పించేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. చిన్న, సన్నకారు రైతులకు విద్యుత్ సంక్షోభం ఉన్న సమయంలో సకాలంలో పంట పొలాలకు సాగునీరు అందించేందుకు ఈ పరికరం ఎంతగానో దోహదపడుతుందన్నారు. సంస్థ సీఈఓ బత్తుల జగదీష్ మాట్లాడుతూ...ఇలాంటి చిన్న విద్యుత్ యూనిట్ల వల్ల చిన్న, సన్నకారు రైతులకు ఎంతో మేలు కలుతుందన్నారు. త్వరలో రైతులకు అవగాహన కల్పించేందుకు అన్ని జిల్లాలు, మండలాల్లో అవగాహన ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
‘మీమ్’ పవర్ ఇలా...
ఈ యంత్రాన్ని రోజులో 4గంటల పాటు నడిపితే 4గంటలపాటు 5హెచ్‌పీ సామర్థ్యం గల వ్యవసాయ మోటార్ నడపవచ్చు.
యంత్రాన్ని 100చ.గజాల స్థలం విస్తీర్ణంలో బిగించి ఒక జత కాడి ఎడ్లు లేక దున్నపోతులతో గానుగ తిప్పినట్లే తిప్పాలి. ఎలాంటి ఇంధనం అవసరం లేకుండానే విద్యుదుత్పత్తి జరుగుతుంది.
5హెచ్‌పీ మోటార్‌ను ఒక గంటపాటు నడిపేందుకు 3.73 యూనిట్ల విద్యుత్ వినియోగం అవుతుంది. కానీ ఒక గంటపాటు మీమ్ ను నడిపితే 9.33 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.
రైతు వ్యవసాయ అవసరాలకుపోను గంటకు 5.6 యూనిట్లు అదనంగా విద్యుత్ ఉత్పత్తి చేయడం విశేషం.
అదనపు విద్యుత్ యూనిట్లను నెట్ మీటర్ ద్వారా నగదుగా మారిస్తే రైతులకు ఆదాయం సమకూరుతుంది.
రూ. 2లక్షల విలువ చేసే ఈ యంత్రంపై ప్రభుత్వం 50శాతం రాయితీ కల్పిస్తే తెలంగాణాలో చిన్న,సన్నకారు రైతులకు కరెంట్ కష్టాలుండవు. పంటలు ఎండిపోయి ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి తప్పుతుంది.