వరంగల్ : అప్పుల బాధతో ఒక పత్తి రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన శనివారం వరంగల్ జిల్లా నర్మెట మండల కేంద్రంలో జరిగింది. వివరాలు.. మండల కేంద్రానికి చెందిన ఇమ్మడి శ్రీనివాసరెడ్డి(35) తన రెండు ఎకరాల పొలంలో 8 బోర్లు వేసినా చుక్కనీరు పడలేదు. దీంతో రూ. 9 లక్షల వరకు అప్పు చేశాడు. కాగా, వర్షాలు సరిగా లేకపోవడంతో సాగుచేసిన పత్తిపంట కూడా ఎండిపోయింది.
ఈ క్రమంలో అప్పు తీర్చే మార్గం కనిపించక పోవడంతో మనస్తాపం చెందిన రైతు పొలం దగ్గర పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నట్లు సమాచారం.