
ఉసురు తీస్తున్న అప్పులు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఐదెకరాల భూ మి కౌలుకు తీసుకుని వ్య వసాయం చేస్తున్న మునగాల మండలం రేపాల గ్రామానికి చెందిన యువరైతు గుండెపురి విజయకృష్ణ (32)కు రూ.2.25లక్షల అప్పు అయ్యింది. ఈ సంవత్సరం పెట్టుబడులకు డబ్బు ఇచ్చే వారు లేరు. పాత అప్పులు కట్టమని ఆయనపై ఒత్తిడి ఎక్కువయ్యింది. చేసేదేమీ లేక పురుగుల మందును ఆశ్రయించి కుటుంబ సభ్యులను వదిలేసి వెళ్లిపోయాడు.... తనకున్న ఏడెకరాలకు తోడు మరో మూడు ఎకరాలను కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాడు అనుమలు శివ. అనుముల మండలం యాచారం గ్రామానికి చెందిన శివకు దిగుబడి రాక రూ.5లక్షల అప్పు అయ్యింది.
ఈ అప్పు గురించి తండ్రి మందలించాడనే మనస్తాపంతో పురుగుల మందు తాగి చనిపోయాడు... రామన్నపేట మండలం కొమ్మాయిగూడెం గ్రామానికి చెందిన వీరమల్ల నర్సింహ(42) అనేరైతు ఆగస్టు 6న తన వ్యవసాయబావివద్ద తల్లితండ్రుల సమాధిపైన కూర్చొని పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనకున్న మూడు ఎకరాలభూమితోపాటు మరికొంత భూమిని కౌలుకుతీసుకొని పత్తిసాగుచేశాడు.వర్షాభావ పరిస్థితులవల్ల పత్తిచేను పూర్తిగా ఎండిపోయింది.
పెట్టుబడికోసం చేసిన అప్పులు తీరవనే బెంగతో ఆత్మహత్యకు పాల్పడ్డా డు... ఈ ముగ్గురిదే కాదు.... జిల్లాలో ఇప్పుడు అన్నదాతల గుండెలు అప్పులతో బరువెక్కిపోతున్నాయి. గత ఏడాది ఆశించిన దిగుబడులు రాకపోవడంతో అప్పులు చేయాల్సి రావడం.. ఆ అప్పులు తీరకపోగా, ఈ ఏడాది సాగుకు కొత్త అప్పులు చేయాల్సి రావడం.. పాత అప్పుల వాళ్లు ఒత్తిడి చేయడం.. కొత్త అప్పులు, పాత అప్పులు తీర్చాల్సిన పంటలు ఎండిపోతుండడం... మళ్లీ అప్పుల బాధ ఎక్కువవుతుందేమోననే మనస్తాపం... వెరసి అన్నదాత ఆత్మహత్యల పాలవుతున్నాడు. అప్పుల కుప్పలు పేరుకుపోవడంతో ప్రాణాలను ఫణంగా పెడుతున్నాడు.
అప్పుల కుప్పలు
గత ఏడాది కరువు సంభవించడంతో పాటు ఈ ఏడాది కాలం కాకపోవడం జిల్లా రైతాంగం మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తోందని నిపుణులు, రైతు సంఘాల నేతలంటున్నారు. వాస్తవానికి గత ఏడాది జిల్లాలో రైతులు ఆశించిన దిగుబడి రాలేదు. మద్దతు ధర విషయం, మార్కెటింగ్ సౌకర్యాల కల్పనలో కూడా రైతులకు తగిన సాయం అందకపోవడంతో గత ఏడాదే రైతులకు అప్పులయ్యాయి. ఈ అప్పుల కోసం ప్రైవేటు వ్యాపారులతో పాటు బ్యాంకర్లు కూడా ఒత్తిడి చేయడం, కొన్ని చోట్ల కొత్త అప్పులు పుట్టే పరిస్థితి లేకపోవడం, కొత్తగా అప్పులిచ్చినా.. అవి తీరుతాయన్న ఆశ లేకపోవడం.. ఈ ఖరీఫ్‌లో కూడా కాలం కాకపోవడంతో రైతులు మానసికంగా ఆందోళనకు గురవుతున్నారు.
రైతు సంఘాలు జరిపిన పరిశీలనలో వెల్లడయిన ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... జిల్లాలోని రైతు కుటుంబాలకు చెందిన 70శాతం ఇళ్లలో ఉండాల్సిన బంగారం ఇప్పుడు బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల్లో తాకట్టు పెట్టారు. మరో విశేషమేమిటంటే.. జిల్లా కేంద్రమైన నల్లగొండలో ఓ ప్రైవేటు బ్యాంకు కేవలం బంగారు రుణాల కోసమే పనిచేస్తోంది. ఇంట్లో బంగారం పెట్టి తెచ్చినవి, బ యట నుంచి లాక్కొచ్చిన అప్పులు అన్నీ కలిపి కుప్పలు కావడంతోనే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారనేది ని పుణులు, రైతు సంఘాల అభిప్రాయం.
రుణాలివ్వని బ్యాంకులు
ఇక, రుణమాఫీ పథకం ప్రకటన రైతుల్లో ఊరట కలిగించింది కానీ, అమల్లోకి వచ్చేసరికి రైతులకు భరోసా ఇవ్వలే కపోయింది. ఒకేసారి రుణమంతా మాఫీ అవుతుందని రైతాంగం భావిస్తే ప్రభుత్వం దానిని దఫాల వారీగా ఇవ్వాలని నిర్ణయించడం.. అది కూడా బ్యాంకుల వద్దకు వచ్చేసరికి సీన్ రివర్స్ కావడంతో రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వచ్చింది. జిల్లాలో ఈ ఏడాది రూ.1400 కోట్లను రైతులకు రుణాలివ్వాలని బ్యాంకులు లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు ఇచ్చింది రూ.600 కోట్లే.
అయితే, ఆ 600 కోట్ల రూపాయలు కూడా రైతులకు చేరలేదు. ప్రభుత్వం ఓ వైపున పాత అప్పుల మాఫీకి దఫాలుగా నిధులిస్తుంటే.. బ్యాంకర్లు మొత్తం రైతులకు దఫాలుగా వచ్చిన మాఫీ నిధులతో పాటు కొత్తగా ఇవ్వాల్సిన రుణాన్ని పాత అప్పుల వడ్డీ కింద జమ చేసుకుంటున్నారు. రైతు సంఘాల అభిప్రాయం ప్రకారం ఇప్పటివరకు జిల్లాలో రూ.200 కోట్లు కూడా రుణాల కింద రైతుల చేతికి అందలేదు. దీంతో మూడు, నాలుగు రూపాయల వడ్డీకి కూడా రైతులు అప్పులు తీసుకుని ఖరీఫ్‌లో వ్యవసాయం చేయాల్సి వస్తోంది. ఈ అప్పులు తీరే పరిస్థితి కనిపించకపోవడంతో రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
రంగంలోనికి దిగాల్సిందే...
జిల్లాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అటు రాజకీయ పార్టీలు, ఇటు అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో చొరవ తీసుకుని రైతాంగానికి భరోసా కల్పిస్తేనే ఆత్మహత్యలు ఆగే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా రైతులు తీసుకున్న అప్పుల (బ్యాంకులు, ప్రైవేటు వ్యాపారుల వద్ద)పై తక్షణం మారటోరియం ప్రకటించాలనే డిమాండ్ ప్రధానంగా వినిపిస్తోంది. కనీసం కొంతకాలం పాటు మారటోరియం విధించి, అప్పులు కోసం రైతులను వేధించే వ్యాపారులు, బ్యాంకులపై చర్యలు తీసుకుంటేనే రైతుకు కొంత భరోసా కల్పిస్తుందనేది రైతు సంఘాల నేతల అభిప్రాయం.
దీంతో పాటు రుణమాఫీని పకడ్బందీగా అమలు చేయడం, కలెక్టరేట్‌లో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయడం, రైతు సమస్యలపై రెవెన్యూ యంత్రాంగం స్థానికంగా చొరవ తీసుకుని కౌన్సెలింగ్ ఇవ్వడం లాంటి కార్యక్రమాలు చేయాలని వారంటున్నారు. మరోవైపు రాజకీయ పార్టీలు కూడా తమ బాధ్యతగా రైతు ఆత్మహత్యల నివారణకు పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అధికార, ప్రతిపక్షాలు రైతుల్లో భరోసా చేపట్టే కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. ఈ దిశలో అధికార, రాజకీయ పక్షాలు ముందుకెళితేనే జిల్లాలో అన్నదాత మరణమృదంగం ఆగే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
రైతు సంఘాలు, నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం చేయాల్సింది ఇదీ..
రైతులు తీసుకున్న రుణాలపై తక్షణం మారటోరియం ప్రకటించాలి.
రెవెన్యూ యంత్రాంగం చొరవ తీసుకోవాలి. క లెక్టరేట్‌లో ఫిర్యాదుల సెల్ ఏర్పాటు చేయాలి. తమ సమస్యలపై ఆ సెల్‌కు వచ్చే రైతులను ఆర్డీఓ లేదా తహసీల్దార్ కార్యాలయాలకు పిలిపించి వారి సమస్యలపై కౌన్సెలింగ్ ఇవ్వాలి. అప్పుల బాధ ఎక్కువగా ఉంటే సదరు వ్యాపారులను పిలిపించి మాట్లాడాలి.
వెంటనే కరువుపై ప్రభుత్వానికి నివేదిక పంపడంతో పాటు కరువు నివారణ చర్యలకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను యుద్ధప్రాతిపదికన అమలు చేయాలి.
ఉత్పత్తి ధర తగ్గించే విధానాలను తీసుకురావడంతో పాటు దిగుబడి పెంపునకు పాటించాల్సిన పద్ధతులపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడం, మద్దతు ధర కల్పించాలి.
వ్యవసాయ యాంత్రీకరణ కింద సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు అందించాలి. రుణమాఫీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలి.