రైతులు, డీసీఎంఎస్ అధికారుల మధ్య వాగ్వాదం
నారాయణపేట: కంది పంటను అమ్మేందుకు కేంద్రానికి వస్తే టోకెన్లు లేవని రైతులను తిప్పిపంపిస్తున్నారని, రైతులు రోడ్డెక్కారని పోలీసులు వస్తే టోకెన్లు ఇస్తున్నారని, మార్కెట్ ప్రతినిధులు, అధికారులు చెబితే ఎందుకివ్వలేదంటూ డీసీఎంఎస్ అధికారులను జిల్లా పరిషత్ వైస్ చైర్‌పర్సన్ సురేఖ ప్రశ్నించారు. నారాయణపేట వ్యవసాయ మార్కెట్‌యార్డులో మార్క్‌ఫెడ్, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కంది కొనుగోలు కేంద్రంలో టోకెన్లు ఇవ్వడంలేదని మరికల్, ధన్వాడ రైతులు జెడ్పీ వైస్ చైర్‌పర్సన్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆమె నేరుగా మార్కెట్‌యార్డుకు చేరుకుంది. మార్కెట్ కార్యాలయానికి కొనుగోలు కేంద్రం నిర్వాహకులను పిలిపించి చర్చించారు. ఇప్పటి వరకు తమ ఇచ్చిన కోటా అయిపోయిందని టోకెన్లు ఇవ్వడం కుదరదని తమ అధికారులతో మాట్లాడి ఇస్తామంటూ డీసీఎంఎస్ అధికారులు ఆమెకు వివరించారు. ఫిబ్రవరి 28వరకు కొనుగోలు చేస్తామని ఆపై గడువు పెరుగుతుందో లేదో తమకు తెలియదని సమాధానమిచ్చారు.
డీసీఎంఎస్ అధికారులపై సీరియస్..
ఇప్పటి వరకు రైతులకు ఇచ్చిన టోకెన్ల వరకు కొనుగోలు చేస్తారు సరే. కానీ ధన్వాడ, మరికల్ రైతుల పరిస్థితి ఏంటని డీసీఎంఎస్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ఎంతమంది ఆ రోజు వరకు కందులు తీసుకొస్తారో అందరివి కొనాల్సిందేనంటూ పట్టుబట్టారు. అవసరమనుకుంటే ఎమ్మెల్యేతో చెప్పిస్తామని నిర్వాహకులు భరోసానిచ్చారు. ఈ మేరకు గతేడాది ఈ మార్కెట్‌లో జరిగిన వ్యవహరంతో దాదాపు రూ. 20 లక్షల వరకు నష్టపోవాల్సి వచ్చిందని అందుకే టోకెన్లు ఇచ్చి నిదానంగా కొనుగోలు చేస్తున్నామని, నష్టపోతే ఏవరిస్తారు చెప్పండి అంటూ నిర్వాహకులు ఆవేదన వ్యక్తపరిచారు.
రైతులు, నిర్వాహకులమధ్య వాగ్వాదం
కొనుగోలు కేంద్రానికి చెరుకున్న డీసీఎంఎస్ అధికారులతో రైతులు వాగ్వివాదానికి దిగారు. ఈ విషయం తెలుసుకున్న జెడ్పీ వైస్ చైర్‌పర్సన్ వెంటనే మార్కెట్ కార్యాలయం నుంచి అక్కడికి చేరుకొని రైతులను సముదాయించారు. రైతులకు ఇప్పుడు టోకెన్లు ఇస్తే వాళ్లు వెళ్లిపోతారాని లేకపోతే ఇదే పరిస్థితి ఉంటుందని నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టోకెన్లు జారీచేయడంతో రైతులు శాంతించారు.
Comments
Please login to add a commentAdd a comment