చేలోచెట్టే ఉరికంబమైంది | farmers dead due to debts | Sakshi
Sakshi News home page

చేలోచెట్టే ఉరికంబమైంది

Published Fri, Dec 12 2014 3:13 AM | Last Updated on Thu, Jul 11 2019 8:34 PM

చేలోచెట్టే ఉరికంబమైంది - Sakshi

చేలోచెట్టే ఉరికంబమైంది

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య     
తన చావుకు ప్రభుత్వానిదే బాధ్యతని సూసైడ్ నోట్

 
కొణిజర్ల గ్రామ రైతు స్వర్ణ వెంకటేశ్వర్లు (చిన వెంకటి-40)కి ఆరెకరాల పొలం ఉంది. నాలుగు ఎకరాలలో పత్తి, రెండెకరాలలో వరి సాగు చేశాడు. గత రెండేళ్లగా సాగు కలిసిరాలేదు. ఈ సంవత్సరం సాగు పెట్టుబడుల కోసం కొందరి నుంచి వడ్డీకి అప్పు తీసుకొచ్చాడు. అప్పటికే అతడు భూమి, నగలు తాకట్టు పెట్టి బ్యాంకు నుంచి తీసుకున్న అప్పులు దాదాపు 13లక్షల రూపాయల వరకు ఉన్నాయి. ఈ ఏడాది కూడా పత్తి దిగుబడి చాలా తక్కువగా ఉంది.

అది అమ్మగా వచ్చిన డబ్బు కూలీలకు ఇచ్చేందుకు కూడా సరిపోలేదు. దీంతో, తీవ్రంగ మనోవేదన చెందిన అతడు గురువారం తన పత్తి చే ను సమీపంలో చెట్టుకు వైర్లతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతనికి భార్య వెంకటలక్ష్మి, కుమారుడు విజయ్ (విజయవాడలో ఇంటర్ చదువుతున్నాడు).
 
స్నేహితులకు ఫోన్

ఆత్మహత్య చేసుకునేందుకు ముందుగా ఇతడు తన స్నేహితులు తన్నీరు శ్రీనివాసరావు, సైదులుకు ఫోన్ చేసి, ‘‘నేను తుమ్మలపల్లి వెళ్లి, అక్కడి నుంచి ఖమ్మం వెళతాను. నా బండి చేనులో ఉంది’’ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. వారు తిరిగి అతనికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు. దీంతో, వారికి అనుమోనమొచ్చింది. వెంటనే వెంకటేశ్వర్లు సోదరుడు పెద్ద వెంకటికి ఫోన్ చేసి చెప్పారు. ఆయన పొలానికి వెళ్లేసరికి అక్కడ.. చెట్టుకు వేలాడుతూ వెంకటేశ్వర్లు విగతుడిగా కనిపించాడు. బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు వెళ్లి మృత దేహాన్ని కిందకు దించారు.

సూసైడ్ నోట్
వెంకటేశ్వర్లు వద్దనున్న ఓ చిన్న కాగితాన్ని పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. అందులో- ‘‘నా చావుకు కారణాలు.. నా స్వంత పొలంలోని మోదుగు చెట్టు వద్ద లభిస్తారుు’’ అని ఉంది. ఆ మోదుగు చెట్టు వద్దనున్న సంచీలో సూసైడ్ నోట్ రాసిన పుస్తకం ఉంది. తనకున్న అప్పులు, రుణదాతలు, బ్యాంకు అప్పులు, నగల తాకట్టు  వివరాలు ఉన్నారుు.

బతకడం ఎలా...? అందుకే...
సూసైట్ నోటులో.. ‘‘రుణాలు మాఫీ చేస్తానని ప్రభుత్వం చెప్పింది. కేవలం 25 శాతం మాత్ర మే మాఫీ చేయడంతో.. ఆ వచ్చిన కొద్దిపాటి డబ్బు వడ్డీలు కట్టడానికి కూడా సరిపోలేదు. అమ్మిన పత్తికి గిట్టుబాటు ధర రాలేదు. వచ్చిన కొద్దిపాటిది కూలీలకే సరిపోయింది. కొడుక్కి రూ.30వేల ఫీజు కట్టాలి. ఈ పరిస్థితుల్లో బతకడం ఎలా..? నా చావుకి ఓ రకంగా ప్రభుత్వమే బాధ్యత వహించాలి’’ అని ఉంది. పంచనామా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి పోలీసులు తరలించారు. ఏఎస్‌ఐ ఖాసీమ్ సాహెబ్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

అధికారులు, ప్రజాప్రతినిధుల సందర్శన
వెంకటేశ్వర్లు మృతదేహాన్ని కొణిజర్ల తహశీల్దార్ ఘంటా శ్రీలత, ఆర్‌ఐ క్రాంతికుమార్ సందర్శించారు. మృతి కారణాలను కుటుంబీకుల నుంచి తెలుసుకున్నారు. ఈ రైతు కుటుంబీనికి ఐదులక్షల రూపాయలను ఎక్స్‌గ్రేషియూగా ఇవ్వాలని, తక్షణ సాయమందించాలని తహశీల్దారును సీపీఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు డిమండ్ చేశారు. మృతదేహాన్ని సత్తుపల్లి ఎమ్మెల్యేసండ్ర వెంకటవీరయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్, సీపీఐ జిల్లా నాయకుడు యర్రా బాబు, దొండపాటి రమేష్, పోటు ప్రసాద్, టీడీపీ వైరా నియోజకవర్గ  ఇన్‌చార్జి భూక్యా రాందాస్ తదితరులు సందర్శించారు. తక్షణమే ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఐదులక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియాకు ఆర్డీవో హామీ
వెంకటేశ్వర్లు కుటుంబానికి ఐదులక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియూ చెల్లించేందుకు ఖమ్మం ఆర్డీవో వినయ్ కృష్ణారెడ్డి హామీ ఇచ్చారు. మృతదేహాన్ని ఆయన సందర్శించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గ్రామస్తులు నినాదాలు చేశారు. ఆర్డీవోతో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు, కాంగ్రెస్, టీడీపీ వైరా నియోజకవర్గ ఇన్‌చార్జీలు సూరంపల్లి రామారావు, భూక్యా రాందాస్ నాయక్ చర్చలు జరిపారు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనట్టరుుతే మృతదేహంతో రాస్తారోకో, ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఆర్డీవో అక్కడి నుంచే కలెక్టర్ డాక్టర్ ఇలంబరితితో ఫోన్‌లో మాట్లాడారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఐదులక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా, ఆపద్బంధు పథకం కింద సాయమందించేందుకు కృషి చేస్తానని ఆర్డీవో హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement