
కార్డిఫ్ : వేల్స్ దేశంలో ఓ మాజీ మంత్రి మరణం మిస్టరీగా మారింది. కేబినెట్ మాజీ కార్యదర్శి మంత్రిగా విధులు నిర్వహించిన కార్ల్ సర్గంట్, క్వే పట్టణంలోని తన ఇంట్లో శవమై కనిపించారు. ఆయన మృతి వెనకగల కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు.
49 ఏళ్ల సర్గంట్ పై కొన్నాళ్ల క్రితం లైంగిక ఆరోపణలు వినిపించాయి. వరుసపెట్టి పలువురు మహిళలు ఆయన తమను లైంగికంగా వేధించారంటూ మీడియా ముందుకు వచ్చారు. దీంతో ప్రభుత్వం ఆయన్ని పదవి నుంచి తప్పించి.. దర్యాప్తునకు ఆదేశించింది. అయితే తనకు ఏ పాపం తెలీదని.. కుట్రతో తనను ఇరికించారని.. అమాయకుడినంటూ మొదటి నుంచి కార్ల్ వాదిస్తూ వస్తున్నారు. అంతేకాదు అవసరమైతే ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని ఆయన ప్రకటించుకున్నారు.
కానీ, ప్రభుత్వం అందుకు నిరాకరించింది. దీంతో కొన్నాళ్లుగా ఆయన మానసికంగా కుంగిపోయారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. క్రమంలోనే ఆయన సూసైడ్ చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇక సర్గంట్ మృతి పట్ల లేబర్ పార్టీ సంతాపం వ్యక్తం చేసింది. ఆ పార్టీ మాజీ నేత జెర్మీ కార్బైన్ తన ట్విట్టర్‌లో సంతాపం తెలియజేశారు. కార్ల్ సర్గంట్ మృతికి సంతాపంగా వెల్స్ మంగళవారం జరగాల్సిన పార్లమెంట్ సమావేశాలు వాయిదా పడ్డాయి.