రామాయంపేట,న్యూస్‌లైన్: లోఓల్టేజీ కారణంగా ట్రాన్స్‌ఫార్మర్లు కాలి పంటలు ఎండిపోతున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోమటిపల్లి, రామాయంపేట గ్రామాలకు చెందిన సుమారు 50 మంది రైతులు మంగళవారం రామాయంపేట విద్యుత్ సబ్ స్టేషన్ గేటు మూసి, ధర్నా చేపట్టారు. కోమటి పల్లి శివారులోని 63హెచ్‌పీ విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్‌పై 23 మోటార్లు నడుస్తున్నాయన్నారు. ఇక్కడ వంద హెచ్‌పీల ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. 100 హెచ్‌పీ ట్రాన్స్‌ఫార్మర్ కోసం ఆరునెలల క్రితం ఆరుగురు రైతులు ఒక్కొక్కరు రూ.6 వేల చొప్పున బ్యాంకులో చెల్లించినట్లు రైతులు తెలిపారు. అయినా ఆరునెలలు దాటినా ట్రాన్స్ ఫార్మర్‌ను అధికారులు ఇవ్వడం లేదన్నారు.
బోర్లలో నీళ్లు ఉన్నప్పటికీ కరెంటు ఇవ్వకపోవడంతో పాటు వచ్చిన కరెంటు కూడా లోఒల్టేజీతో రావడంతో ట్రాన్స్‌ఫార్మర్లతో పాటు బోరు మోటార్లు కాలిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై రామాయంపేట ఏఈ బాబయ్యకు రైతులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లేపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఈ వచ్చేంత వరకు ఇక్కడే కూర్చుంటామని రైతులు సబ్ స్టేషన్ ఎదుట బైఠాయించారు అనంతరం ఏఈ బాబయ్య రాత్రి ఏడు గంటలకు సబ్ స్టేషన్ వద్దకు వచ్చి కొత్త ట్రాన్స్ ఫార్మర్ ఇస్తానని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. కార్యక్రమంలో రైతులు శీలం కిష్టారెడ్డి, జీవన్‌రెడ్డి, ఉప సర్పంచ్ నాగేశ్వర్‌రెడ్డి, వెల్ముల సిద్దరాంలు, వార్డు సభ్యుడు బాలు, సంపత్,వెంకట్, దేవానందం, లంబాడి బాబు, కుమ్మరి స్వామి, కిష్టయ్య, పోచయ్య, మర్కు రాజు, ఎర్రం రాములు, కిష్టారెడ్డి, మల్లేశం, దోమకొండ సిద్దరాంలు పాల్గొన్నారు.
పోతరాజుపల్లిలో అధికారుల దిష్టిబొమ్మ దహనం
తూప్రాన్:గత ఐదురోజులుగా అరకొరగా సరఫరా చేస్తున్న కరెంటు వల్ల పంటలు ఎండిపోతున్నాయని అగ్రహారం, దమ్మక్కపల్లి గ్రామాలకు చెందిన రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోతరాజుపల్లి సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా వారు తూప్రాన్-గజ్వేల్ రహదారిపై విద్యుత్ అధికారుల దిష్టిబొమ్మను దహనం చేశారు. దీంతో రోడ్డుకు ఇరువైపుల వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు రైతులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. అనంతరం రైతులు మాట్లాడుతూ విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం మూలంగా పంటలు ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మండలంలో చేట్లగౌరారం విద్యుత్ సబ్‌స్టేషన్ నుంచి రోజుకు కేవలం రెండు గంటల పాటే విద్యుత్ సరఫరా అవుతోందన్నారు. ఫలితంగా అగ్రహారం, దమ్మక్కపల్లి గ్రామాల రైతుల పంటలు ఎండుముఖం పట్టాయని ఆందోళన వ్యక్తం చేశారు. తమ గ్రామాలకు చెట్లగౌరం విద్యుత్ సబ్‌స్టేషన్ నుంచి సరఫరా చేయడంవల్లే సమస్య వస్తోందని, ఇమాంపూర్ సబ్‌స్టేషన్ నుంచి సరఫరా చేయాలని కోరారు. రైతులకు 7 గంటల కరెంటు సరఫరా చేస్తున్నామని చెబుతున్న అధికారులు రెండు గంటలు కూడా అందించడంలేదన్నారు. వెంటనే 7 గంటల కరెంటు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ విషయంపై ‘న్యూస్‌లైన్’ విద్యుత్ ఏడీఈ వినోద్‌రెడ్డిని వివరణ కోరగా ఇన్‌కమింగ్ సరఫరా లేకపోవడం వల్లే సమస్య తలెత్తిందన్నారు.
విద్యుత్ అధికారులపై రైతన్నల కన్నెర్ర
Published Wed, Apr 9 2014 12:11 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement