ఖమ్మంవ్యవసాయం: మంచి తరుణం మించినా రాదు..అన్నట్లు ఇప్పుడు మిర్చి రైతులకు కలిసొచ్చే కాలమొచ్చింది. గతేడాది పండించిన మిర్చికి అప్పుడు క్వింటాకు రూ.4వేలు ఓ దశలో రూ.2వేలు మాత్రమే పలకడంతో..అడ్డికి అమ్ముకోలేక కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేశారు. ఈక్రమంలో ఇప్పుడు రేటు అమాంతం పెరిగి క్వింటా రూ.10వేలకు చేరింది. ప్రస్తుతం ఈఏడాది సాగు చేసిన పంట ఇంకా చేతికి రాలేదు. అయినా..పాత మిర్చికి మాత్రం రేటు బాగా పలుకుతోంది. అంతర్జాతీయంగా మంచి డిమాండ్ పలుకుతుండడంతో..మిరప కొనుగోళ్లకు ఆదరణ పెరిగింది.
విదేశాల్లో డిమాండ్..
ఇక్కడ పండించే ‘తేజా’ రకం మిర్చికి చైనా, సింగపూర్, మలేషియా తదితర దేశాల్లో మంచి ధర పడుతోంది. అక్కడ ఈ మిర్చి నుంచి నూనె (ఆయిల్) తీసి ఆహారంగా, ఇతర అవసరాలకు, రసాయనాల్లో వినియోగిస్తుంటారని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయా దేశాల్లో తేజా మిర్చి ఆయిల్ కొరత ఏర్పడటంతో ధరకు రెక్కలు వచ్చాయి. అంతర్జాతీయంగా మిర్చికి రేటు పెరగడంతో ఇక్కడ కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉంచిన మిర్చి విక్రయాలు జోరందుకున్నాయి. ప్రస్తుతం రూ.9 వేల నుంచి రూ.10 వేల వరకు పలుకుతోంది. మరో నెల రోజుల్లో ఈ ఏడాది సాగు చేసిన మిర్చి పంట ఉత్పత్తి రానుండటంతో కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉంచిన సరుకును వ్యాపారులు, రైతులు విక్రయించేస్తున్నారు. ఇప్పటికే 4 వేల క్వింటాళ్ల వరకు విక్రయించేశారు. ఖమ్మం, మధిర, తల్లాడ తదితర ప్రాంతాల్లో మిర్చి కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఏసీ మిర్చితో పాటు, తాలు మిరప బేరం కూడా కొనసాగుతోంది. వ్యాపారులు నేరుగా కోల్డ్ స్టోరేజీలకు వెళ్లి కొంటున్నారు.
ఊహించని ధర..
గతేడాది పంట సీజన్‌లో మిర్చికి రూ.4వేలకు మించి ధర పలకలేదు. ఓ దశలో (ఏప్రిల్ నెల) క్వింటాకు రూ.2వేలు కూడా పడలేదు. 2015–16 సంవత్సరంలో పంటకు రూ. 13 వేల వరకు కూడా ధర పలికింది. దీంతో గతేడాది మిర్చిని విస్తారంగా సాగు చేశారు. ఉత్పత్తి కూడా పెరగడంతో ధర మందగిస్తూ పూర్తిగా పడిపోయింది. కనీసం పంట కోత కూలి ఖర్చులకు కూడా రాలేదు. చేసేది లేక, భవిష్యత్‌పై ఆశతో కోల్డ్ స్టోరేజీల్లో పెద్ద ఎత్తున నిల్వలు పెట్టారు. వాటికి ప్రస్తుతం సీజన్‌తో పోలిస్తే రెట్టింపునకు పైగా రూ.10 వేల వరకు ధర పలుకుతుండడంతో ఆనందంలో ఉన్నారు. జిల్లాలో మొత్తం 32 కోల్డ్ స్టోరేజీలు ఉన్నాయి. ఒక్కో కోల్డ్ స్టోరేజీలో 80నుంచి 1.10 లక్షల బస్తాల వరకు నిల్వ సామర్థ్యం ఉంది. జిల్లాలోని కోల్డ్ స్టోరేజీల్లో దాదాపు 32లక్షల మిర్చి బస్తాలు నిల్వ ఉండగా, ప్రస్తుతం పంటకు ధర పలుకుతుండటంతో నిల్వలు సగానికి చేరి ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇంకా 16 నుంచి 18 లక్షల బస్తాల వరకు స్టోరేజీల్లో నిల్వ ఉండి ఉంటాయని అంచనాలు వేస్తున్నారు. దాదాపు నెల రోజుల్లో ఈ నిల్వలు మొత్తం అమ్మకాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment