కురవి/మహబూబాబాద్‌టౌన్ : ఊరంతా వెలుగులు నింపే దీపావళి పండుగపూట ఆ రైతు ఇంట్లో చీకట్లు ఆవరించాయి. పండుగ పూట దీపాలతో కళకళలాడాల్సిన ఆ ఇల్లు కన్నీటి సంద్రమైంది. కరెంట్ రాత్రిపూట సరఫరా అవుతుండడంతో పంటకు నీరు పెట్టేందుకు వెళ్లిన ఓ రైతు విద్యుదాఘాతానికి గురై మృత్యువాతపడ్డాడు. ఈ సంఘటన మహబూబాబాద్ మండలం మాధవపురం శివారు చీకటిచింతల తండాలో గురువారం తెల్లవారుజామున జరిగింది.
తండా వాసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకా రం... చీకటిచింతల తండాకు చెందిన బానోత్ వెంకన్న(38)కు మూడెకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో వరి, పత్తి, మిర్చి పంటలను సాగు చేస్తున్నాడు. ఇప్పటికే బావిలో నీళ్లు అడుగంటడంతో పొలం ఎండిపోయింది. దీంతో క్రేన్ సాయంతో బావిలో పూడిక తీయిస్తున్నాడు. తెల్లవారుజామున రెండు గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు కరెంట్ సరఫరా అవుతుండడంతో కరెంట్ రాగానే అతడు బావి వద్దకు వెళ్లాడు. మోటార్‌ను ఆన్ చే సే ముందు ఫ్యూజులను సరిచేస్తుండగా ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై అరుస్తూ కుప్పకూలాడు.
నీళ్లు పెట్టేందుకు వచ్చిన సమీప రైతులు బానోత్ రామా, వీరమ్మ అతడి అరుపులు విని సంఘటన స్థలానికి పరుగెత్తుకొచ్చారు. వెంకన్న స్టార్టర్ బాక్స్ పక్కన షాక్‌తో విలవిలలాడుతుండడం గమనించిన వారు వెంటనే అతడిని కర్రతో పక్కకు లాగారు. కొనఊపిరితో ఉన్న అతడిని బతికించేందుకు యత్నించినా ఫలితం లేకుండాపోయింది. వెంకన్న మరణవార్త తెలియగానే అతడి భార్య విజయ, కుమార్తెలు కల్యాణి, రోజా, కుమారుడు బాలాజీ బోరున విలపిస్తూ బావి వద్దకు పరుగులు పెట్టారు. మృతదేహంపై పడి కన్నీరుమున్నీరయ్యూరు. పిల్లల రోదన చూసి బంధుమిత్రులు, తండా వాసులు కంటతడి పెట్టారు.
మృతదేహంతో ఆందోళన
రాత్రి, తెల్లవారుజామున కరెంట్ సరఫరా చేయడం వల్లే వెంకన్న మృతిచెందాడని ఆగ్రహించిన తండా వాసులు మృతదేహాన్ని అయ్యగారిపల్లి విద్యుత్ సబ్‌స్టేషన్ వద్దకు ట్రాక్టర్‌లో తీసుకొచ్చి ఆందోళనకు దిగారు. సబ్‌స్టేషన్ ఎదురుగా ఉన్న మరిపెడ-మానుకోట ప్రధాన రహదారిపై మృతదేహాన్ని ఉంచి సుమారు రెండుగంటలపాటు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ నాయకులు నల్లు సుధాకర్‌రెడ్డి, ఎన్.సురేందర్ కుమార్, కన్నె వెంకన్న, గునిగంటి రాజన్న, గంధసిరి శ్రీనివాస్, దుడ్డెల రాంమూర్తి, బజ్జూరి పిచ్చిరెడ్డి ధర్నాకు మద్దతుగా నిలిచారు.
రైతు కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. కురవి సీఐ కరుణాసాగర్‌రెడ్డి చేరుకుని ఆందోళన విరమించాలని కోరగా ఆర్డీఓ రావాలని, ఎక్స్‌గ్రేషియో ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఏఈ రాజారత్నంను అక్కడికి పిలిపించగా.. రూ.2 లక్షలు పరిహారం వస్తుందని, మరో రూ.50 వేలు అదనంగా వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు.
పండుగ పూట రైతు ఇంట్లో చీకట్లు
Published Sat, Oct 25 2014 4:51 AM | Last Updated on Sat, Sep 2 2017 3:19 PM
Advertisement
Advertisement