అంగడిపేట ఎక్స్ రోడ్డు వద్ద ధర్నా చేస్తున్న రైతులు
పెద్దఅడిశర్లపల్లి : ఆరుగాలం కష్టించి సాగు చేసిన పంటను అమ్ముకునేందుకు అన్నదాలు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది... రోజుల తరబడి నిరీక్షణ... తేమ పేరుతో జాప్యం... తీరా అకాల వర్షాలతో తడిసిన ధాన్యం... ఇలా ఓపిక పడుతూ వచ్చిన రైతులు సహనం కోల్పోయారు... మద్దతు ధర పొందేందుకు ధాన్యాన్ని ఆరబెట్టి తేమ సరితూగినా కొనుగోళ్ల చేయకపోవడంతో అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోయింది. దీంతో ఆగ్రహించిన రైతులు శనివారం పీఏపల్లి తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేసి ధర్నాకు దిగారు. అధికారుల నుంచి స్పందన రాకపోవడంతో అంగడిపేట ఎక్స్‌రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. సుమారు 2 గంటల పాటు ఆందోళన చేయడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
పీఏపల్లి మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. అయితే తమ గ్రామాల నుంచి సాగు చేసిన పంటలను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన రైతులు అధికారుల తీరుతో విసుగెత్తిపోతున్నారు. తెచ్చిన ధాన్యంలో తేమ లేదని ఓ సారి, కాంటాలు లేవని ఓ సారి, కూలీల కొరత అని మరో సారి ఇలా రోజుల తరబడి జాప్యం జరుగుతూ వస్తోందని రైతులు వాపోతున్నారు. తేమ కోసం వడ్లను ఆరబెట్టి తేమ శాతం సరితూగాక కొనుగోలు చేయమంటే సాకులు చెబుతూ జాప్యం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
తెచ్చిన ధాన్యానికి కావలి ఉండలేక, తేమ కోసం వడ్లను ఆరబెట్టుకునేందు సబ్ మార్కెట్‌యార్డులోనే ఉంటున్నామని రైతులు పేర్కొంటున్నారు. తాము తెచ్చిన ధాన్యాన్ని కొనేందుకు పది నుంచి పదిహేను రోజులకుపైగానే సమయం పడుతుందని, దీనికి తోడు అకాల వర్షాలతో ఎప్పుడు ధాన్యం తడుస్తుందోనని ఆందోళన చెందాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. తెచ్చిన ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉందని అధికారులు చెప్పడంతో ఒడ్లను ఆరబెట్టి తేమ సరితూగినా కొనుగోళ్లు చేయలేదని, తీరా అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోగా ఇప్పుడు మరోమారు తేమ శాతం ఎక్కువగా ఉందని చెప్పడం ఎంత వరకు సమంజసమని రైతులు ఆరోపిస్తున్నారు.
అధికారులతో తీరుతో తాము సహనం కోల్పోవాల్సి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరుకు నిరసనగా శనివారం తమ నిరసన తెలిపేందుకు తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేసి, కాసేపు ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. అధికారుల నుంచి స్పందన రాకపోవడంతో రైతులంతా కలసి అంగడిపేట స్టేజీ వద్ద హైదరాబాద్ –నాగార్జున సాగర్ రాష్ట్ర రహదారిపై బైఠాయించి రాస్తారోకోకు దిగారు. సుమారు రెండు గంటల పాటు రాస్తారోకో చేయడంతో హైదరాబాద్–నాగార్జునసాగర్ ప్రధాన రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు, తహసీల్దార్, రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకొని సర్దిచెప్పాల్సి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment