నర్సాపూర్ రూరల్, న్యూస్‌లైన్ : వ్యవసాయానికి ఏడు గంటల పాటు నిరంతరాయంగా సరఫరాతో పాటు లో ఓల్టేజీ సమస్యను తీర్చాలని సోమవారం మండలంలోని కాజీపేట, మంతూరు, రెడ్డిపల్లి గ్రామాల రైతులు నర్సాపూర్ - మెదక్ రహదారిలోని రెడ్డిపల్లి విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట రాస్తారోకో చేశారు. అంతకుముందు సబ్‌స్టేషన్‌లో ఉన్న లైన్ ఇన్‌స్పెక్టర్ అంజ య్యతో పాటు లైన్‌మన్లు రాంలు, టీ వేణు, సబ్‌స్టేషన్ ఆపరేటర్ దశరథ్‌ను ఓ గదిలో నిర్బంధించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గతంలో రాత్రీపగలు కలిపి దశలవారీగా సుమారు ఐదు గంటలు సరఫరా చేసేవారని, అయితే వారం రోజులుగా కేవలం రెండు మూడు గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా అవుతోందని వాపోయారు. సరఫరా అవుతున్న విద్యుత్‌లో ఎక్కువ భాగం లో ఓల్టేజీతో సరఫరా అవుతోందని తెలిపారు.
దీంతో వారం రోజులుగా మంతూరు, కాజీపేట, గ్రామాల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొందన్నారు. వ్యవసాయ పంటలు దాదాపు ఎండిపోయే పరిస్థితి నెలకొందన్నారు. విద్యుత్ సమస్య పరిష్కారించాలని విద్యుత్ శాఖ ఏడీతో పాటు ఏఈలకు పలుమార్లు మొర పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై లైన్ ఇన్‌స్పెక్టర్‌తో పాటు లైన్‌మన్లను వివరణ కోరగా రెడ్డిపల్లి ఫీడర్ కెపాసిటీ కన్నా ఎక్కువ వినియోగం ఉండడంతో లో ఓల్టేజీతో పాటు తరచూ సబ్‌స్టేషన్‌లో ట్రిప్ కావడం జరుగుతోందన్నారు. రైతులు సమస్యల ఎదుర్కొంటున్న మాట వాస్తవమేనన్నారు. అయితే తమ చేతిలో ఏమీ లేదన్నారు.
ఇదిలా ఉండగా.. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ కోటేశ్వరరావు అక్కడికి చేరుకుని ప్రస్తుత పరిస్థితుల్లో అనుమతులు లేకుండా రాస్తారోకోలు చేయకూడదని రైతులకు సూచిం చారు. సమస్యలుంటే అధికారుల వద్దకు వెళ్లి చెప్పుకోవాలన్నారు. రైతులు తమ పరిస్థితులను వివరిస్తుండగా.. ఓ కానిస్టేబుల్ మొబైల్‌లో రాస్తారోకో ఫొటోలను తీశారు. అప్పటి వరకు ట్రాన్స్‌కో అధికారుల తీరును ఎండగట్టిన రైతులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా.. అనుమతులు లేకుండా రాస్తారోకో చేసినందుకు, అధికారులను నిర్బంధించిన విషయంలో ఆరుగురు రైతులు, మరో కొంతమందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
విద్యుత్ కోసం రైతుల రాస్తారోకో
Published Tue, Mar 25 2014 12:03 AM | Last Updated on Wed, Sep 5 2018 1:46 PM
Advertisement