సాక్షి, హైదరాబాద్: వచ్చే నెలాఖరుకు ఖరీఫ్ రైతు బంధు నిధులను అందజేసేందుకు వ్యవసాయ శాఖ సన్నాహాలు మొదలుపెట్టింది. లోక్‌సభ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే రైతు బంధు సొమ్మును రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్, రబీల్లో రైతుబంధు నిధులను ప్రభుత్వం రైతులకు అందజేసిన సంగతి తెలిసిందే. రైతు బంధు కింద ప్రతి రైతుకు ఏడాదికి రూ.8 వేల చొప్పున రెండు విడతలుగా అందజేసింది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ఏడాదికి రెండు సీజన్లకు ఎకరానికి రూ.10 వేల చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. ఏటా ఖరీఫ్‌కు సంబంధించి రైతు బంధు సాయాన్ని మేలోనే ఇవ్వాలని సర్కారు భావిస్తోంది. దీంతో ఖరీఫ్ ప్రారంభానికి ముందే రైతులు విత్తనాలు, సాగు సహా ఇతరత్రా ఖర్చులకు వినియోగించుకుంటారని పేర్కొంటోంది.
అవే మార్గదర్శకాలు..
ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రైతుబంధు కోసం బడ్జెట్‌లో రూ.12 వేల కోట్లు కేటాయించింది. గత ఏడాది సాయం అందజేసిన ప్రతి రైతుకు ఈసా రి కూడా సాయం అందివ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈసారి పదెకరాలకు మించి భూమి ఉన్న రైతులకు సాయం నిలిపేస్తారన్న ప్రచారం జరిగింది. అయితే వ్యవసాయ శాఖ వర్గాలు మాత్రం అలాంటిదేమీ లేదని, గతేడాది మాదిరిగానే అందరికీ సాయం అందజేస్తామని చెబుతున్నాయి. మార్గదర్శకాలను మార్చేది లేదని స్పష్టం చేస్తున్నారు.
రుణమాఫీపై అస్పష్టత..
అసెంబ్లీ ఎన్నికల హామీ ప్రకారం అధికారంలోకి వస్తే రూ.లక్ష రుణమాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చాక దీనికి సం బంధించి బ్యాంకర్లు కసరత్తు కూడా చేశారు. పైగా ప్రభుత్వం విడతల వారీగా ఇచ్చేలా బడ్జెట్లో ఈసారి రూ.6 వేల కోట్లు కేటాయించింది. అయితే ఎప్పుడు రుణమాఫీ చేస్తారన్న దానిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. లోక్‌సభ ఎన్నికల కోడ్ అయిపోయాక, రైతు బంధు సొమ్ము అందజేశాక రుణమాఫీ గురించి ఆలోచిస్తామని కొందరు సీనియర్ వ్యవసాయాధికారులు చెబుతున్నారు.
రైతు ఖాతాలకే నేరుగా..
గతేడాది ఖరీఫ్‌లో రైతుబంధు సొమ్మును ప్రభుత్వం చెక్కుల రూపంలో అందజేసింది. ప్రతి గ్రామంలో సభలు పెట్టి చెక్కుల పంపిణీ చేసింది. రబీలోనూ అలాగే చేయాలని అనుకున్నారు. అయితే ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు రావడం, కోడ్ ప్రభావంతో చెక్కుల పంపిణీ జరగలేదు. దీంతో డబ్బును నేరుగా రైతుల ఖాతాలోనే జమ చేశారు. ఈసారి కూడా ఖరీఫ్‌లో రైతు బంధు సొమ్మును రైతుల ఖాతాలోనే నేరుగా వేయాలని సర్కారు నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment