కొల్చారం (మెదక్ జిల్లా) : మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని చిన్నఘనాపూర్ గ్రామానికి చెందిన రైతులు మంగళవారం మెదక్-జోగిపేట ప్రధాన రహదారిపై రుణమాఫీ కోరుతూ రాస్తారోకోకు దిగారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన రైతులు రాస్తారోకోలో పాల్గొని అటు ప్రభుత్వానికి, బ్యాంక్ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. దీంతో ఇరువైపుల వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. దీంతో అక్కడికి చేరుకున్న కొల్చారం పోలీసులు రైతులను సముదాయించి రోడ్డుపై నుంచి తప్పించారు. రైతులు మాట్లాడుతున్న చిన్నఘనాపూర్ గ్రామం మెదక్ ఏడిబి బ్యాంక్ పరిధిలో కొనసాగుతుంది.
ప్రభుత్వం రుణమాఫీలో భాగంగా 25శాతం డబ్బులను రైతులకు అందించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. కాగా బ్యాంక్ అధికారులు మాత్రం రుణానికి సంబంధించి 75శాతం డబ్బులు రుణాన్ని రీషెడ్యూల్ చేస్తేనే 25శాతం మాఫీని వర్తింపజేస్తామని రైతులకు షరతులు విధించిందని ఆరోపించారు. దీంతో పాటు కొత్తగా రుణాలు కూడా ఇవ్వడం లేదని రైతులు ఆరోపించారు. అసలే ఉన్న డబ్బులను పంటసాగు కోసం పెట్టుబడి పెట్టి చేతిలో చిల్లిగవ్వలేకుండా ఉన్న తాము అప్పును రెన్యువల్ చేసే పరిస్థితి లేదని బ్యాంక్ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వెంటనే ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.
రుణమాఫీ కోసం రైతుల రాస్తారోకో
Published Tue, Sep 1 2015 4:13 PM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM
Advertisement