చెరుకు టన్ను ధర తేల్చండి | farmers strike at ndsl | Sakshi
Sakshi News home page

చెరుకు టన్ను ధర తేల్చండి

Published Thu, Dec 25 2014 2:43 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

farmers strike at ndsl

* టన్నుకు రూ. 2600 ధర ఇవ్వాల్సిందే
* రైతుల డిమాండ్
* ఎన్‌డీఎస్‌ఎల్ ఎదుట ధర్నా

బోధన్ : చెరుకు టన్ను ధర పై వెంటనే స్పష్టత ఇవ్వాలని, టన్నుకు రూ. 2600 ధర ప్రకటించాల్సిందేనని డిమాండ్ చేస్తూ చెరుకు ఉత్పత్తిదారులు సంఘం ఆధ్వర్యంలో నిజాందక్కన్ షుగర్స్ లిమిటెడ్ (ఎన్‌డీఎస్‌ఎల్) ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు. ఫ్యాక్టరీ గేట్ ప్రధాన గేట్ ఎదుట బైఠాయించారు. బుధవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యా హ్నం ఒంటి గంట వరకు ధర్నా కొనసాగించారు. ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి నశించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా చెరకు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు కెపీ శ్రీనివాస్‌రెడ్డి మా ట్లాడుతూ.. 2014-15 క్రషింగ్ సీజన్ ప్రారంభమై 23 రోజులు అవుతున్నా, ఇప్పటి వరకు యాజమాన్యం టన్ను ధర ప్రకటించలేదన్నారు.

స్థానిక అసిస్టెంట్ కేన్ కమిషనర్‌కు టన్ను రూ. 2260 ధర చెల్లిస్తామని తెలిపిందని అన్నారు. 2002 లో ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ సమయంలో జరిగిన ఒప్పందం ప్రకారం తెలంగాణ జిల్లాలోని అన్ని ఫ్యాక్టరీల కన్నా అధికంగా ధర చెల్లిస్తామని ఫ్యాక్టరీ యాజమాన్యం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ ఆ ఒప్పం దాన్ని ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. గడిచిన సీజన్‌లో టన్ను ధర రూ. 2600 ధర చెల్లించారని, జిల్లాలోని ఇతర ఫ్యాక్టరీలో ఇదే ధర ప్రకటించినా ఇక్కడి యాజమాన్యం తక్కువ ధర ఇస్తామని చెబుతోందన్నారు.

ఈ ధర ఏమాత్రం గిట్టుబాటు కాదని, టన్నుకు రూ. 2600 ధర కంటే అదనంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు సుమారు 46 వేల టన్నుల చెరుకు క్రషింగ్ అయ్యిందని, ఇప్పటి వరకు ఒక్క పైసా ఇవ్వ లేదని తెలిపారు. వచ్చే ఏడాది క్రషింగ్‌కుగాను చెరకు సాగు పై అటు ప్రభుత్వం ,ఇటు ఫ్యాక్టరీ యాజమాన్యం వెంటనే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధర్నా వద్దకు వచ్చిన ఫ్యాక్టరీ వైస్ ప్రెసిడెంట్ జానకీ మనోహర్‌తో రైతులు వాగ్వాదానికి దిగారు.

రాష్ట్ర ప్రభుత్వం, ఫ్యాక్టరీ యా జమాన్యం మధ్య ధర, ఇతర విషయాలపై చర్చలు జరుగుతున్నాయని ఆయన రైతులకు వివరించారు.కొంత ఓపిక పడితే ధర విషయంలో స్పష్టత వస్తుందన్నారు. ఫ్యాక్టరీకి లక్ష టన్నుల వరకు చెరుకు క్రషింగ్‌కు వచ్చే అవకాశం ఉందని అంచనా ఉం దని, రైతులు క్రషింగ్ విషయంలో ఎలాంటి ఆందోళన పడవద్దన్నారు. ఒక వేళ ఇక్కడ క్రషింగ్ ముగిసినా మెదక్ యూనిట్‌కు తరలిస్తామన్నారు.

అనంతరం ఆయనకు రైతు నాయకులు వినతి పత్రం అందించారు. తదనంతరం ర్యాలీగా ఆర్డీవో కార్యాలయానికి వెళ్లిన రైతులు అక్కడ అధికారి సత్యనారాయణకు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో చెరుకు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు కెపీ శ్రీనివాస్‌రెడ్డి, ప్రతినిధులు శివరాజ్‌పాటిల్, మారుతి పటేల్, కర్నె హన్మంత్‌రావు, పోలా మల్కారెడ్డి, చిద్రపు రాములు, గంగాధర్,బీర్కూర్ సురేందర్, కోట గంగారెడ్డి,రవి, మాధవరావు పటేల్,ఫ్యాక్టరీ పరిధిలోని రైతులు పాల్గొన్నారు.
 
కార్మిక సంఘాల మద్దతు
చెరుకు రైతుల ధర్నాకు పలు కార్మిక సంఘాల ప్రతినిధులు మద్దతు ప్రకటించారు. ధర్నా శిబిరానికి వచ్చి మాట్లాడారు. వీరిలో సిఐటీయు నాయకులు కుమార్ స్వామి, శంకర్‌గౌడ్, ఐఎఫ్‌టీయు నాయకుడు బి మల్లేష్, మజ్దూర్ సభ కార్యదర్శి రమేష్, బిఎంఎస్ కార్యదర్శి ఈరవేణి సత్యనారాయణ , కార్యకర్తలు, కార్మికులు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement