మహబూబ్‌నగర్: బోర్లు ఎండిపోయాయని మనస్తాపం చెందిన ఓ రైతు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా దౌల్తాబాద్ మండలం సంగాయిపల్లితండాలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.... గ్రామానికి చెందిన మున్యానాయక్ కుమారుడు నర్సిములు నాయక్(32) తన పొలంలో కంది, వేరుశెనగ సాగుకు పొలం దున్నాడు. అయితే, ఉన్న రెండు బోర్లలో నీళ్లు తగ్గడం, ఇంటి నిర్మాణానికి రూ.2 లక్షలకుపైగా అప్పు కావడంతో జీవితంపై మనస్తాపం చెందాడు.
భార్య పుట్టింటికి వెళ్ళడంతో ఒంటరిగా ఉన్న నర్సిములు మంగళవారం రాత్రి ఇంట్లో ఉరేసుకున్నాడు. బుధవారం ఉదయం ఉరికి వేలాడుతున్న నర్సిములు నాయక్‌ను చూసి చుట్టుపక్కలవారు పోలీసులకు, కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. నాయక్ భార్య రామమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవికాంత్‌రావు తెలిపారు.