మోర్తాడ్: సహకార సంఘాల్లో కొత్తగా సభ్యత్వం పొందిన రైతులకు రుణాలు మంజూరు కావడం లేదు. రైతుల రుణ మాఫీపై ప్రభుత్వం ఇంకా స్పష్టతను ఇవ్వక పోవడంతో కొత్తగా సభ్యత్వం తీసుకున్న రైతులకు రుణాలు ఇచ్చే పరిస్థితి లేదని సహకార సంఘాల పాలకవర్గాలు చెబుతున్నాయి. కొత్తగా వ్యవసాయ భూములను కొనుగోలు చేసుకున్నవారు, తమ తల్లి తండ్రుల పేర్లపై ఉన్న భూములను తమ పేరున మార్చుకున్న వారు ఎంతో మంది సహకార సంఘాల్లో కొత్తగా సభ్యత్వం తీసుకున్నారు.
కొత్తగా సభ్యులుగా చేరిన రైతులకు రుణాలను మంజూరు చేయాల్సిన బాధ్యత సంఘాలపై ఉంది. సహకార సంఘాలను అజమాయిషీ చేసే జిల్లా సహకార బ్యాంకు నిధులను మంజూరు చేస్తేనే సంఘాలు రుణాల ప్రక్రియను ప్రారంభిస్తాయి. జిల్లా సహకార బ్యాంకులకు లీడ్ బ్యాంకుగా ఉన్న ఆప్కాబ్ కొత్త రుణాలపై ఎలాంటి విధానాన్ని ప్రకటించలేదు. దీంతో సహకార సంఘాలు కొత్త సభ్యుల దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచాయి. జిల్లాలో 142 సహకార సంఘాలు ఉన్నాయి.
ప్రతి సంఘంలో కొత్తగా సభ్యులు చేరిన వారు 50 నుం చి 75 మంది వరకు ఉన్నారు. వాణిజ్య బ్యాంకుల్లో పం ట రుణం పొందడం కంటే సహకార సంఘాల్లో రుణం పొందడం మేలు అని భావించిన రైతులు సహకార సం ఘాల్లోనే దరఖాస్తులు చేసుకున్నారు. సహకార సంఘా ల ద్వారా రాయితీలు ఎక్కువగా ఉండటం, రుణం సుల భంగా లభిస్తుండటంతో రైతులు సహకార సంఘాలనే నమ్ముకున్నారు. ఎన్నికలకు ముందుగా టీఆర్‌ఎస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పంట రుణాల మాఫీకి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. టీఆర్‌ఎస్‌కు మంచి మెజార్టీ స్థానాలు లభించడంతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది.
ఎన్నికల హామీని నిలబెట్టుకునేందు కు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నా రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇం డియా నిబంధనల కారణంగా రుణ మాఫీ ఇంకా జరుగడం లేదు. రుణ మాఫీపై ఏదైనా స్పష్టత వస్తేనే కొత్త రుణాలకు నిధులు మంజూరు అవుతాయని సంఘాల పాలకవర్గాలు చెబుతున్నాయి. రుణ మాఫీపై స్పష్టత రాకపోవడంతో కొత్త పంట రుణాలకు బ్రేక్ పడింది. రుణం రాక పోతే భూములను ఎలా అభివృద్ధి చేయాలి, పంటలను ఎలా సాగు చేయాలని రైతులు ప్రశ్నిస్తున్నారు.
ప్రైవేటు వ్యాపారుల వద్ద పంటల సాగు కోసం రుణం తీసుకుంటే వడ్దీభారం అధికం అవుతుందని రైతులు తెలిపారు. గతంలో పంట రుణం పొందిన రైతుల పరిస్థితి ఎలా ఉన్నా తమకు మాత్రం రుణం దొరకక ఇబ్బందులు కలుగుతున్నాయని సంఘాల్లో కొత్తగా సభ్యులుగా చేరిన రైతులు అంటున్నారు. ప్రభుత్వం స్పందించి సహకార సంఘాల్లోని కొత్త సభ్యులకు రుణాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
‘సహకారం’ ఏది ?
Published Mon, Aug 11 2014 1:55 AM | Last Updated on Sat, Sep 2 2017 11:41 AM
Advertisement