కుమారుడికి ఆదాయ, స్థానికతకు సంబంధించిన సర్టిఫికెట్ల జారీలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని
♦ సర్టిఫికెట్ల జారీలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని ఆరోపణ
♦ తహసీల్దార్ కార్యాలయం ఎదుట చెట్టుకు తాడుతో ఉరేసుకునేందుకు యత్నం
♦ స్థానికులు గమనించి.. వారించిన వైనం
నిడమనూరు : కుమారుడికి ఆదాయ, స్థానికతకు సంబంధించిన సర్టిఫికెట్ల జారీలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని ఆరోపిస్తూ ఓ తండ్రి తహసీల్దార్ కార్యాలయం ముందే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నిడమనూరు మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు.. మండలంలోని నారమ్మగూడేనికి చెందిన బెరైడ్డి నాగార్జునరెడ్డి కుమారుడు ప్రవీణ్‌రెడ్డి ఎంసెట్ ఎంట్రన్స్ రాశాడు. ఎంసెట్ కౌన్సెలింగ్ గురువారం నుంచి మొదలవుతున్నది.
నాగార్జునరెడ్డి రెండు రోజులుగా నిడమనూరు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా సర్గిఫికెట్లు మంజూరు చేయలేదు. ఇదే సమయంలో అధికారులంతా మిర్యాలగూడలో హరితహారంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఉన్నారు. విసిగిన ఆయన బుధవారం మధ్యాహ్నం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఉన్న చెట్టుకు తన వెంట తెచ్చుకున్న తాడుతో ఉరివేసుకునే ప్రయత్నం చేస్తుండగా అక్కడ ఉన్నవారు చూసి వారించారు. తహసీల్దార్ సిబ్బంది స్పందించి మ్యాన్యువల్ సర్టిఫికెట్ ఇస్తామనగా, వాటిని కౌన్సెలింగ్‌లో అనుమతించరని నిరాకరించారు.
కారణం ఏమిటంటే..
నిడమనూరు తహసీల్దార్ అంబేద్కర్ బదిలీ కావడం, బదిలీపై వచ్చిన తహసీల్దార్ బాధ్యతలు స్వీకరించకపోవడంతో ఆన్‌లైన్ సర్టిఫికెట్ల జారీ జరగడం లేదు. దీంతో సర్గిఫికెట్ల కోసం వస్తున్న వారికి సిబ్బంది సమాధానం చెప్పలేకపోతున్నారు. చివరికి ఇన్‌చార్జ్ తహసీల్దార్ ఆనంద్‌కుమార్ మాన్యువల్ సర్టిఫికెట్లపై సంతకాలు పెట్టించారు. దీంతో కథ సుకాంతం అయ్యింది.