ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్
‘నా కష్టసుఖాల్లో నాన్న అండగా ఉంటాడు.. నేను చేసే పనుల్లో మంచి చెడు విడమరిచి చెప్పే విమర్శకుడు.. సాయం కోసం మనల్ని నమ్మి ఎవరైనా వస్తే రెండో సారి రాకుండా పని చేయాలని సునిశితంగా మందలిస్తారు.. ఓ రకంగా చెప్పాలంటే ఆయనే నాకు అండాదండ.. ఎన్టీఆర్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన నాకు అక్కాచెల్లెళ్లతో ఆడుకున్న ఆటపాటలు, అన్నయ్యతో కలిసి సైకిల్‌పై వెళ్లి చూసిన సినిమాలు అన్నీ గుర్తున్నాయి’ – ‘సాక్షి పర్సనల్ టైమ్’లో ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్
వరంగల్ సాక్షి ప్రతినిధి: నలుగురం అక్కాచెల్లెళ్లం కురవి మండలం గుండాత్రిమడుగు పక్కన ఉన్న పెద్ద తండాలో వ్యవసాయ చేసుకునే గిరిజన కు టుంబం మాది. నాన్న లింగయ్యనాయక్, అమ్మ దశిమి. మేము నలుగురం అక్కాచెల్లెళ్లం. ఒక అన్నయ్య. నేను అందరి కంటే చిన్నదాన్ని. మా పెద్ద తండా నుంచి 5 కి.మీ దూరంలో ఉండే గుండాత్రిమడుగుకు వెళ్లి చదువుకున్నా. ఐదో తరగతిలో ఉన్నప్పుడు వరంగల్‌లోని సంక్షేమ హాస్టల్‌లో చేర్పిస్తే తిండి బాగాలేదని ఇంటికి పారిపోయి వచ్చా. ఏడో తరగతి వరకు గుండాత్రిమడుగులో చదువుకున్నా. నాది బాల్యవివాహం. ఏడో తరగతి పూర్తికాగానే లగ్గమైంది. మా అన్న స్నేహితుడైన కర్ణాటక రాష్ట్రానికి చెందిన రైల్వే ఉద్యోగి గోవింద్ రాథోడ్‌తో 1982లో వివాహమైంది. ఆ తర్వాతే పదో తరగతి పరీక్ష పూర్తి చేశా. అనంతరం ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ మొదటి సంవత్సరం పరీక్షలు రాశాను. ఇక రాజకీయాల్లో బిజీ కావడంతో చదువు అంతకంటే ముందుకు సాగలేదు.
నాన్న సహకారం మరవలేనిది
నేను రాజకీయాల్లోకి రావటానికి, రాణించటానికి, ప్రస్తుతం నేను ఈ స్థితిలో ఉండటానికి నాన్న లింగ్యనాయకే కారణం. ఎందుకు ఇలా చెప్పుతున్నానంటే.. చాలామంది కార్యకర్తలు, ప్రజలు ఇంటికి వస్తూ పోతూ ఉంటారు కదా. వారందరినీ నాన్న గమనిస్తూ ఉండేవారు. అలా ఎవరైనా ఒకటి, రెండుసార్లకు మించి వస్తే గమనించి నాకు చెప్పేవాడు. మనపై నమ్మకంతో సహాయపడుతామని ఎందరో వస్తుంటారు. పని ఐతే ఐతది, లేకపోతే కాదు అని చెప్పాలే తప్ప తిప్పించుకోవద్దని సూచిస్తారు. నీ వల్ల అయ్యేటట్లు ఉంటే ఖచ్చితంగా సాయం చేయాలని, ఇప్పటికి కూడా నేను చేసే పనులను గమనిస్తూ నన్ను హెచ్చరిస్తూ, సలహాలు ఇస్తాడు. మా నాన్న నాకు పెద్ద విమర్శకుడు, మార్గదర్శి.
నాగలి దున్నుతా...
వ్యవసాయ కుటుంబం కావటంతో చిన్నప్పుడు పొలం పనులకు అమ్మవాళ్లతో వెళ్లేదాన్ని. నాకు నాగలి దున్నటం, నాట్లు వేయటం, నీళ్లు పెట్టడం.. ఒక్కటేమిటి వ్యవసాయ పనులన్నీ వచ్చు. నిజంగా ఆ రోజుల్లో జీవితం చాలా అందంగా ఉండేది. అరమరికలు లేకుండా అందరం కలిసి మెలిసి జీవించేటోళ్లం. చిన్నప్పుడు మా అక్కలతో, అన్నలతో తీరొక్క ఆటలు ఆడేవాళ్లం. ఈత కొట్టడం కూడా వచ్చు.
మగరాయుడిలా పెరిగా
ఇంట్లో అన్నయ్యతో పాటు నలుగురం ఆడపిల్లలం. కానీ నేను చిన్నప్పటినుంచి మగరాయుడిలాగే పెరిగా. ఇంట్లో అన్ని పనులు చేసేదాన్ని. మా కజిన్స్‌తో ఎక్కువగా తిరిగేది. నా బలం, బలహీనత గిరిజన మహిళను కావటమే. చిన్నప్పటి నుంచి మగరాయుడిలా ధైర్యంగా పెరగటం వల్లే ఈ స్థితికి చేరుకోగలిగిను. అలాగే మహిళను కావడం వల్ల చాలా ఇబ్బందుల సైతం ఎదుర్కోవాల్సి వచ్చిందనిపిస్తుంది. నాకు మొదటి నుంచి అన్ని మతాలు, దేవుళ్లను ఆరాదించటం అలవాటు. కురవి వీరన్న ఇష్టదైవం.
అప్పట్లో ఎన్టీఆర్.. ఇప్పుడు మహేశ్ బాబు
చిన్నప్పుడు మా అన్నయ్యతో కలిసి సైకిల్ మీద, ఎండ్లబండి మీద మహబూబాబాద్, బయ్యారం వెళ్లి సినిమాలు చూసేది. నాకు ఇంకా గుర్తుంది.. నేను మొదట చూసిన సినిమా లవకుశ. మా ఆయనకు తెలుగు రాకపోవటంతో ఇద్దరం కలిసి హిందీ సినిమాలు బాగా చూసేవాళ్లం. ఆ తర్వాత రాజకీయాల్లో బిజీ కావడంతో ఎక్కువగా చూడలేకపోయినా. అప్పుడు ఎన్టీఆర్, ప్రస్తుతం మహేష్‌బాబు అంటే ఇష్టం. హీరోయిన్లలో జయసుధ, జయప్రద అంటే ఇష్టం. జయప్రద తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు ఆమెతో కలిసి పనిచేశా. ఇటీవల ఫిదా, బాహుబలి సినిమాలను మా కొడుకులు, కోడళ్లతో కలిసి చూశాను.
నా జీవితాంతం వెంటాడుతుంది
మా ఆయన అకాల మరణం నన్ను జీవితాంతం వెంటాడుతుంది. నా జీవితంలో అత్యంత బాధాకరమైన ఘటన అదే. నాకు ఇద్దరు కొడుకులు. పెద్దవాడు సునీల్‌కుమార్ రాథోడ్, చిన్నవాడు సతీష్ రాథోడ్. పెద్దకుమారుడు, కోడలు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల్లో ఉన్నారు. చిన్నబ్బాయి ఇక్కడే మహబూబా బాద్ ఏరియా ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్నాడు.
ఎన్టీఆర్ స్ఫూర్తితోనే..
ఎన్టీఆర్ స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చాను. చిన్నప్పటి నుంచి ఎందుకో తెలియదు కానీ కాంగ్రెస్ వ్యతిరేక భావజాలంతోనే పెరిగాను. ఎన్టీఆర్ ప్రజలకు పాలన చేరువ చేశారు. మా అన్న గోవింద్‌నారాయణ లడ్డా సహకారంతో రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేదాన్ని. ఎన్టీఆర్ తరువాత, ప్రజలకు పరిపాలన దగ్గర చేసిన సీఎం కేసీ ఆర్. ప్రజలకు ఏం అవసరమో తెలిసిన నాయకుడు. నన్ను తన సొంత బిడ్డ్డలా చూసుకుంటాడు. ఇంటికి వెళ్తే భోజనం చేయకుండా వెళ్లనివ్వరు.
రాజకీయాలు వదిలేద్దాం అనుకున్నా..
చిన్నతనంలోనే రాజకీయాల్లోకి వచ్చి, సర్పంచ్, జెడ్పీటీసీగానే కాకుండా పార్టీల్లో వివిధ పదవులు చేపట్టినా. 2004–05 ప్రాంతంలో పిల్లల చదువు కోసమైతేనేమి,ఇతరత్రా ఇబ్బందులతో రాజకీయాలు నాకు సరిపడవు.. తప్పుకుందాం అని అనుకున్నా. కానీ అనూహ్యంగా చంద్రబాబు 2006లో కురవి జెడ్పీటీసీగా పోటీ చేయించారు. జెడ్పీటీసీగా గెలిచి స్టాండింగ్ కమిటీ చైర్‌పర్సన్‌గా పనిచేశా. ఈ నేపథ్యంలో 2009లో డోర్నకల్ నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందటం నా జీవితంతో అత్యంత ఆనందకరమైన విషయం.
ఈ స్థితికి చేరుకోవటమే గొప్ప
నేను సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఈ స్థితికి చేరుకోవటమే గొప్పగా భావిస్తున్నా. ఉన్నత పదవులు ఆశించాలని కోరిక ఏమీ లేదు. కేసీఆర్ ఇప్పటి వరకు నాపై నమ్మకంతో ఇచ్చిన అన్ని బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాను. నన్ను గుర్తుపెట్టుకుని మరీ నాకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చిన కేసీఆర్ ఏ బాధ్యతలు అప్పగించినా శిరసావహిస్తా.
జగన్ పరిపాలన బాగుంది
తండ్రిలాగ పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకుని ఏపీ సీఎం అయిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆయన మంచి భవిష్యత్ ఉంటుంది.రాజకీయాలు పక్కకు పెడితే తను అనుకున్న లక్ష్యం కోసం ఎన్నికష్టాలైనా ఎదుర్కొని సాధించటం అనేది చాలా గొప్ప విషయం. కష్టాలు ఎదురైతే భయపడకుండా ధైర్యంగా ఎదుర్కొంటేనే విజయం వరిస్తుందని జగన్ నిరూపించారు.
Comments
Please login to add a commentAdd a comment