ఈనెల 20వరకు టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు
నియోజకవర్గానికి 30వేల సభ్యత్వం లక్ష్యం
పార్టీ కమిటీలన్నీ రద్దు.. ఏప్రిల్‌లో కొత్త జిల్లా కమిటీ
వార్డు స్థాయి నుంచి అన్ని కమిటీలూ కొత్తవే
సభ్యత్వ నమోదు రాష్ట్ర బాధ్యతలు రాజేశ్వరరెడ్డికి
జిల్లా నుంచి జెల్లా, సామేలుకు చోటు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : అధికార టీఆర్‌ఎస్‌లో సంస్థాగత నిర్మాణ ప్రక్రియ ప్రారంభమైంది. పార్టీని అన్ని స్థాయిల్లో బలోపేతం చేసుకునే దిశలో పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో ఈ మేరకు తీసుకున్న నిర్ణయాలను అమలుపర్చేందుకు జిల్లా నాయకత్వం సంసిద్ధమవుతోంది. జిల్లా వ్యాప్తంగా పార్టీ సభ్యత్వ నమోదును వెంటనే ప్రారంభించి, జిల్లా వ్యాప్తంగా 3.60లక్షల మంది పార్టీ సభ్యులను చేర్చుకునే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు పార్టీ నేతలు. అయితే, పార్టీ సభ్యత్వ నమోదు రాష్ట్ర బాధ్యతలను జిల్లాకు చెందిన నాయకుడు పల్లా రాజేశ్వరరెడ్డికి అప్పగించారు. సభ్యత్వ నమోదు స్టీరింగ్ కమిటీ కన్వీనర్‌గా ఆయనను నియమించారు. ఆయనతోపాటు మొత్తం 11 మంది సభ్యులున్న ఈ కమిటీలో జిల్లా నుంచి జెల్లా మార్కండేయులు, మందుల సామేలుకు స్థానం దక్కింది.
25వేలు సాధారణ, 5వేలు క్రియాశీలక..
పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో యుద్ధప్రాతిపదికన సభ్యత్వ నమోదు చేస్తామని జిల్లా నాయకులంటున్నారు. నియోజకవర్గానికి 25వేల మంది సాధారణ సభ్యులను, 5వేల మంది క్రియాశీల సభ్యులను చేర్పించాల్సి ఉంది. అంటే జిల్లా వ్యాప్తంగా మొత్తం 3.6లక్షల మందిని టీఆర్‌ఎస్ సభ్యులుగా చేర్చనున్నారన్నమాట. అదే విధంగా ప్రస్తుతం ఉన్న పార్టీ కమిటీలన్నింటినీ రద్దు చేస్తూ రాష్ట్రస్థాయి సమావేశంలో తీర్మానం చేయడంతో ఇప్పుడున్న కమిటీలన్నీ రద్దయినట్టే. వార్డు స్థాయి నుంచి జిల్లా కమిటీ వరకు కొత్తవి ఏర్పాటు చేయనున్నారు. మార్చి1 నుంచి 10వ తేదీ వరకు వార్డు, గ్రామ స్థాయి కమిటీలు, ఆ తర్వాత 20వరకు మండల, మున్సిపల్ కమిటీలను నియమించనున్నారు. ఏప్రిల్‌లో జిల్లాకు కూడా కొత్త కమిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర సమావేశంలో నిర్ణయించారు. ఇంకా తేదీ ప్రకటించలేదు. అన్ని స్థాయిల్లో పార్టీని బలోపేతం చేసేలా ఈ సంస్థాగత నిర్మాణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటామని పార్టీ నేతలు చెబుతున్నారు.
అయితే, జిల్లాలో ఎమ్మెల్యేలు లేని చోట్ల పార్టీని సమన్వయంతో ముందుకు తీసుకెళ్లే విషయంలో జాగ్రత్తగా ఉండాలని సీఎం కేసీఆర్ పార్టీ నేతలకు సూచించారు. జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యేలు లేని చోట్ల బహునాయకత్వం సమస్య పార్టీకి ఉంది. కోదాడ, హుజూర్‌నగర్, దేవరకొండల్లో ఈ విషయంలో కొంత సమస్య ఉందనేది పార్టీ నేతల అభిప్రాయం. దీనికి సంబంధించి అందరూ కలిసి పనిచేయాలని, నియోజకవర్గాల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నందున అందరికీ అవకాశం కల్పిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా అందరికీ తగిన ప్రాధాన్యం ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశానికి జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్‌చైర్మన్లు, ఇతర ముఖ్య నేతలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
నేటి నుంచే సభ్యత్వ నమోదు : పార్టీ జిల్లా అధ్యక్షుడు బండా
పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బుధవారం నుంచి ప్రారంభిస్తామని పార్టీ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి చెప్పారు. సమావేశం అనంతరం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ ఈ సంస్థాగత నిర్మాణ ప్రక్రియను పార్టీని బలోపేతం చేసుకునేందుకు ఉపయోగించుకుంటామన్నారు. ఆది నుంచి పార్టీని నమ్ముకుని ఉన్నవారిని, కొత్తగా వచ్చి న వారికి కలుపుకుని వెళ్లి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తామని చెప్పారు. పార్టీ శ్రేణులందరూ సంస్థాగత నిర్మాణ కార్యక్రమంలో చురుకుగా పాలుపంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇక.. సంస్థాగత బాట
Published Wed, Feb 4 2015 3:00 AM | Last Updated on Sat, Sep 2 2017 8:44 PM
Advertisement
Advertisement