సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ‘‘నాలుగేళ్లుగా కేసీఆర్.. మోదీ అంటే గడగడ వణికాడు.. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలతోపాటు పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ విషయంలో బీజేపీ సర్కారుకు మద్దతిచ్చాడు.. ఇప్పుడు ఫెడరల్ ఫ్రంట్ అంటూ నాటకమాడుతున్నాడు. ఫెడరల్ ఫ్రంట్ లేదు.. మన్నూలేదు. రానున్న ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు కూడా గెలుచుకోలేడు..’’అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిప్పులు చెరిగారు.
ప్రజాచైతన్య బస్సు యాత్రలో భాగంగా ఆదివారం బోధన్, నిజామాబాద్‌లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ఉత్తమ్ మాట్లాడారు. రాష్ట్రంలో నాలుగు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పరామర్శించకుండా అమానవీయంగా వ్యవహరించిన కేసీఆర్ ఇప్పుడు రైతులను ఉద్ధరిస్తానంటే ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు.
రెవెన్యూ మిగులు ఉన్న రాష్ట్ర బడ్జెట్‌లో రైతు ఉత్పత్తుల కొనుగోళ్లకు ఎందుకు నిధులు కేటాయించలేదన్నారు. కందులకు కర్ణాటక ప్రభుత్వం క్వింటాలుకు రూ. 450 బోనస్ ఇస్తోందని, మరికొన్ని రాష్ట్రాలు వరి, గోధుమలకు బోనస్ ఇస్తుంటే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు నిధులు కేటాయించలేదని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం రాష్ట్రంలో 1.05 కోట్ల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి అయితే, మూడేళ్లలో అది 49 వేల మెట్రిక్ టన్నులకు పడిపోయిందని వివరించారు.
మైనారిటీ సంక్షేమం కోసం రూ. 1,200 కోట్లు కేటాయించామంటున్న రాష్ట్ర ప్రభుత్వం అందులో సగం కూడా ఖర్చు చేయలేదన్నారు. తెలంగాణ బిల్లు ఆమోదంలో కీలకంగా వ్యవహరించిన లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ రాష్ట్రపతి ఎన్నికల్లో నిలబడినప్పుడు మద్దతు కోసం కేసీఆర్‌కు తాను ఫోన్ చేసినా లైన్లోకి రాలేదని విమర్శించారు.
టీఆర్‌ఎస్, ఎంఐఎంకు ఓటేస్తే బీజేపీకి లబ్ధి...
కేంద్రంలోని బీజేపీని గద్దె దించడం టీఆర్‌ఎస్, ఎంఐఎం వల్ల సాధ్యం కాదని, కాంగ్రెస్‌తోనే ఇది సాధ్యమవుతుందని ఉత్తమ్ తెలిపారు. దీన్ని ముస్లిం మత పెద్దలు గమనించాలని విజ్ఞప్తి చేశారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్, ఎంఐఎంలకు ఓట్లేస్తే పరోక్షంగా బీజేపీ లబ్ధి పొందుతుందని వ్యాఖ్యానించారు. బీజేపీకి కలిసొచ్చేలా ఎంఐఎం కొన్ని రాష్ట్రాల్లో పోటీ చేసిందని, బీజేపీ ప్రభుత్వం మైనారిటీలను టార్గెట్ చేస్తోందని ఉత్తమ్ ఆరోపించారు.
కేసీఆర్‌కు వ్యతిరేకంగా నిశ్శబ్ద విప్లవం..
రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నిశ్శబ్ద విప్లవం నడుస్తోందని, విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు, మహిళలు...ఇలా తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన అన్ని వర్గాలు కేసీఆర్ పాలనలో మోసపోయామనే భావనకు వచ్చాయన్నారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కేసీఆర్‌ను తరిమికొట్టే సమయం ఆసన్నమైందని తెలిపారు. డిసెంబర్‌లోనే కేంద్ర, రాష్ట్రాల్లో ఎన్నికలు వచ్చే అవకాశాలున్నాయన్నారు.
పెట్టుబడి సాయం ఎన్నికల జిమ్మిక్కే...
రైతులకు మే నుంచి ఎకరానికి రూ. 4 వేల చొప్పున పెట్టుబడి సాయం చేస్తామన్న కేసీఆర్ మాటలు ఎన్నికల జిమ్మిక్కేనని.. నాలుగేళ్లలో గుర్తుకురాని ఈ పథకం సీఎంకు ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చిందని ఉత్తమ్ ప్రశ్నించారు. వక్ఫ్ బోర్డుకు జ్యుడీషియల్ అధికారిలిస్తామని ఇచ్చిన సీఎం హామీ ఏమైందని ప్రశ్నించారు.
కబ్జాకు గురైన వక్ఫ్ భూములను స్వాధీనం చేసుకుంటామన్న కేసీఆర్ ఇప్పటివరకు ఒక్క అంగుళం భూమిని కూడా స్వాధీనం చేసుకోలేదన్నారు. మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్ల ఊసే ఎత్తడం లేదని దుయ్యబట్టారు. ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
కేసీఆర్‌వి కలలే : జానారెడ్డి
రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేత కె.జానారెడ్డి విమర్శించారు. కేంద్ర రాజకీయాలకు వెళతానని సీఎం కేసీఆర్ కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. కేంద్ర పథకాల పేర్లు మార్చి రాష్ట్రంలో అమలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా కేసీఆర్ సర్కారు నెరవేర్చలేదని విమర్శించారు. సభల్లో మాజీ ఎంపీ వి.హన్మంతరావు, మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ తదితరులు ప్రసంగించారు. మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సభల్లో మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి, నేతలు మల్లు రవి, ప్రసాద్, దానం నాగేందర్, కె.లక్ష్మారెడ్డి, ఫక్రుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
రైతు ఆత్మహత్యల్లోనే రాష్ట్రం నంబర్ వన్ ...
తన పాలనలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిందంటూ మీడియా, పేపర్లను వినియోగించుకుని కేసీఆర్ తప్పుడు ప్రచారం చేయించుకుంటున్నారని పీసీసీ చీఫ్ ఆరోపించారు. మద్యం తాగించడంలో, అప్పులు చేయడంలో, రైతు ఆత్మహత్యల్లోనే రాష్ట్రం నంబర్ వన్‌గా ఉందని ఎద్దేవా చేశారు.
మహిళా సంఘాలకు రూ.లక్ష రివాల్వింగ్ ఫండ్
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళా సంఘాలకు రూ. లక్ష చొప్పున రివాల్వింగ్ ఫండ్‌తోపాటు రూ. 10 లక్షల చొప్పున బ్యాంకు రుణం అందజేస్తామని ఉత్తమ్ హామీ ఇచ్చారు. ఈ రుణంపై వడ్డీ భారం ప్రభుత్వమే భరిస్తుందని, దీని ద్వారా రాష్ట్రంలోని 6 లక్షల స్వయం సహాయక సంఘాల్లో 70 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరుతుందన్నారు. అభయహస్తం పింఛను మొత్తాన్ని రూ. వెయ్యికి పెంచుతామని, సెర్ప్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని తెలిపారు. నిరుద్యోగులకు రూ. 3 వేల భృతి చెల్లిస్తామన్నారు. అలాగే బోధన్ నిజాం దక్కన్ చక్కెర కర్మాగారాన్ని ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment