
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల కోటాను తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్సు జారీచేయడంపై అన్ని రాజకీయ పక్షాలు మండిపడ్డాయి. జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేష న్లు పెంచాల్సి ఉండగా, అనూహ్యంగా తగ్గించడాన్ని తీవ్రంగా తప్పుబట్టాయి. వెనుకబడిన తరగతులను అణగదొక్కాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని.. అందువల్ల రిజర్వేషన్ల సాధనలకు మూకుమ్మడిగా ఉద్యమించాలని నిర్ణయించాయి. ఇంతకుముందు జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 34% శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయగా.. ప్రస్తుతం దీన్ని 22 శాతానికే కుదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఆర్డినెన్సు సైతం జారీ చేసి రిజర్వేషన్లు ఖరారు చేయడాన్ని నిరసిస్తూ బుధవారం మాసబ్‌ట్యాంక్‌లోని గోల్కొండ హోటల్ లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరకు సుధాకర్, వీహెచ్ తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో మూడ్రోజుల కార్యాచరణను ఖరారు చేశారు. ఈ నెల 27న రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు చెపట్టాలని నిర్ణయించాయి. ఈ నెల 28న అఖిలపక్ష నేతలు గవర్నర్ నరసింహన్, ప్రభుత్వ సీఎస్ ఎస్‌కే జోషిలను కలిసి పరిస్థితిని వివరించి రిజర్వేషన్లను పెంచాలని డిమాండ్ చేస్తారు. ఈ నెల 29న జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించనున్నారు.
పార్టీలకతీతంగా ఉద్యమించాలి
బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ల అమలు సంగతి సరే.. పంచాయతీ ఎన్నికల్లో ఉన్న రిజర్వేషన్లు తగ్గించడం అన్యాయం. ఈ నిర్ణయంతో బీసీలు తీవ్రంగా నష్టపోతారు. నాయకుడిగా ఎదిగేందుకు దారిచూపే పంచాయతీ ఎన్నికల్లోనే బీసీలకు అవకాశాలు తగ్గితే వారి అభివృద్ధి కష్టమే. బీసీ రిజర్వేషన్లపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ను కోరినా ఆయన స్పందించలేదు. బీసీ రిజర్వేషన్లు తగ్గితే ఊరుకోం. కచ్చితంగా పోరాడతాం. పార్టీలకు అతీతంగా ఉద్యమిస్తాం. – ఎల్.రమణ, టీటీడీపీ అధ్యక్షుడు
కులసంఘాలే ఓడించాయి
బీసీలకు ఎక్కువ సీట్లివ్వాలని అన్ని కుల సంఘాలు డిమాండ్ చేశాయి. ఈమేరకు బీజేపీ ఏ పార్టీ ఇవ్వనన్ని సీట్లను బీసీలకు కేటాయించింది. కానీ ఆ బీసీ అభ్యర్థులను ఓడించింది బీసీ కుల సంఘాల నేతలే. వీరంతా తీర్మానించుకుని టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే.. బీసీల రిజర్వేషన్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పార్టీలకతీతంగా బీసీలంతా కలిసికట్టుగా ఉంటేనే న్యాయం జరుగుతుంది. సమగ్ర కుటుంబ సర్వేలో వెల్లడైన లెక్కలను సర్కారు బయటపెట్టడం లేదు. రిజర్వేషన్లు 50% మించకూడదని సుప్రీంకోర్టు ఏనాడూ చెప్పలేదు. జనగణన వివరాలను సమర్పిస్తే రిజర్వేషన్లు పెంచుకోవచ్చని కోర్టులే స్పష్టం చేశాయి. కలిసి పోరాడకుంటే బీసీలకు తీవ్ర అన్యాయం తప్పదు.
– డాక్టర్ కె.లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
ప్రభుత్వానివి కుంటిసాకులు
బీసీ జనాభా ఎంతుందో ప్రభుత్వం చెప్పడం లేదు. కానీ రిజర్వేషన్లు మాత్రం అడ్డదిడ్డంగా తగ్గించింది. జనగణన లేనందునే 50% రిజర్వేషన్లు మించొద్దని కోర్టు చెప్పింది. వివరాలు సమర్పిస్తే పెంచొద్దని కోర్టులు చెప్పవు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి కుంటి సాకులు చెబుతున్న ప్రభుత్వం.. కోర్టు ఆర్డర్‌ను బూచిగా చూపి ఆర్డినెన్స్ తీసుకొచ్చి రిజర్వేషన్లు అమలు చేస్తోంది. ముందుగా జనగణన చేసి వివరాలు వెల్లడించిన తర్వాతే పంచాయతీ ఎన్నికలకు వెళ్ళాలి. 2016లో ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ వేసి.. రిజర్వేషన్లపై స్టే తెచ్చుకోవచ్చు. ఆమేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఒక్కరోజులో సమగ్ర కుటుంబ సర్వే చేసిన కేసీఆర్ బీసీల లెక్కలు ఎందుకు చెప్పడం లేదు. బీసీలకు ప్రభుత్వం ద్రోహం చేస్తోంది. అన్ని పార్టీలు కలిసి ప్రధానికి వివరిస్తే రాజ్యాంగ సవరణ చేసే అవకాశం ఉంటుంది.
– జస్టిస్ వి. ఈశ్వరయ్య
న్యాయ పోరాటం చేద్దాం
బీసీ రిజర్వేషన్ల సాధన కోసం న్యాయపోరాటం చేయాలి. అదేవిధంగా రాజకీయ పార్టీలు క్షేత్రస్థాయిలో ప్రజా ఉద్యమాలు చేయాలి. పాలనను గాలికొదిలేసిన సీఎం కేసీఆర్ పొరుగురాష్ట్రాల చుట్టూ తిరుగుతున్నారు. అసలు ఇలా రాష్ట్రాలు పట్టుకుని సీఎం ఎందుకు తిరుగుతున్నాడో ప్రజలకు సమాధానం చెప్పాలి. బీసీ రిజర్వేషన్ల తగ్గింపు ఆర్డినెన్సును ఉపసంహరించుకున్న తర్వాత పర్యటనలు చేసుకోవాలి. – పొన్నాల – పొన్నాల లక్ష్మయ్య, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు
సర్కారు కళ్లు తెరిపిద్దాం
బీసీ రిజర్వేషన్లు తగ్గిస్తూ ప్రభుత్వం ఆర్డి నె న్స్ జారీ చేయడాన్ని ఖండిస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి స్టే తెచ్చి ఎన్నికలు నిర్వహించారు. ఇప్పుడు కూడా స్టే తీసుకొచ్చి ఎన్నికలు నిర్వహించాలి. ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలి. అన్ని పార్టీలు ఐక్యంగా ఉద్యమించి ప్రభుత్వం కళ్లు తెరిపించాలి.
– చాడ వెంకట్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
జనాభా ప్రాతిపదికనే రిజర్వేషన్లు
జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలని రాజ్యాంగం చెబుతుంది. ఈ విధమైన రిజ ర్వేషన్ల ద్వారానే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది. వీటిని సాధించుకునేందుకు పార్టీలకతీ తంగా ఉద్యమం చేపట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కనీస విలువనివ్వడం లేదు.
– చెన్నయ్య, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు
రిజర్వేషన్ల కోసం కలిసి పోరాడదాం
బీసీ రిజర్వేషన్ల కోసం అన్ని పార్టీలు, సం ఘాలు ఒకే వేదిక ద్వారా పోరాడాలి. కాసాని జ్ఞానేశ్వర్, ఆర్.కృష్ణయ్య తదితరులంతా కలిసిరావాలి. ఒక పార్టీ టిక్కెట్ ఇవ్వనందుకు రాష్ట్ర బం ద్‌కు పిలుపునిచ్చి తర్వాత ఉపసంహరించుకోవడంలా బీసీ ఉద్యమాన్ని నడపొద్దు. బీసీ రిజర్వేషన్లను పంచాయతీలతోపాటు.. చట్టసభల్లోనూ అమలుచేసుకునేలా ఐక్యంగా ఉద్యమిద్దాం.
– జాజుల శ్రీనివాస్‌గౌడ్
Comments
Please login to add a commentAdd a comment