బీసీల రిజర్వేషన్లకు పోరాటం | Fight for BCs reservation | Sakshi
Sakshi News home page

బీసీల రిజర్వేషన్లకు పోరాటం

Published Thu, Dec 20 2018 1:37 AM | Last Updated on Thu, Sep 19 2019 8:28 PM

Fight for BCs reservation - Sakshi

హైదరాబాద్‌: స్థానిక సంస్థల్లో బీసీలకు ప్రస్తుతం ఉన్న 34 శాతం రిజర్వేషన్లు కొనసాగించాలనే డిమాండ్‌కు పార్టీలు, జెండాలు పక్కనబెట్టి తెలం గాణ ఉద్యమాన్ని స్పూర్తిగా తీసుకుని పోరాడాలని బీసీ సంఘాల నేతలు పిలుపునిచ్చారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు అధ్యక్షతన ‘ఇప్పుడున్న బీసీల 34 శాతం రిజర్వేషన్లు రాబోయే గ్రామపంచాయతీ ఎన్నికల్లో అమలు చేయాలి’ అనే అంశంపై రౌండ్‌టేబుల్‌ సదస్సు జరిగింది. 

ఐక్యమైతేనే రాజ్యాధికారం: జస్టిస్‌ ఈశ్వరయ్య
సమావేశంలో జాతీయ బీసీ కమిషన్‌ మాజీ అధ్యక్షుడు, రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్‌ ఈశ్వరయ్య మాట్లాడుతూ.. లెక్కల ప్రకారం 18 జిల్లాల్లో బీసీలు 55 శాతంకన్నా ఎక్కువగా ఉన్నారని, మిగిలిన జిల్లా ల్లో కూడా 50 శాతం ఉన్నామని తెలిపారు. అయితే సీఎం కేసీఆర్‌ తన సొంత లెక్కల ద్వారా ఎస్సీ, ఎస్టీలు పెరిగారని చెప్తూ వారికి రిజర్వేషన్లు పెంచి, బీసీలకు తగ్గించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలు ఇప్పుడు చైతన్యం కాకపోతే ఎప్పటికీ కాలేరని అంతా ఐక్యమై రాజ్యాధికారం దక్కేలా కృషిచేయాలన్నారు. ఉత్తరభారత దేశంలో మాదిరి ఇక్కడకూడా బీసీలపార్టీ ఒకటి ఏర్పాటు చేయాలన్నారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీలకు 26 శాతం పోతే మిగిలిన 74 శాతం బీసీలే కైవసం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ మాట్లాడుతూ.. వివిధ బీసీ కుల సంఘా ల ఆశీర్వాద సభలు పెట్టి అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు రాజ్యాధికారం దూరం చేసే కుట్ర లు పన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ.. రిజర్వేషన్లు తగ్గించడం చారిత్రాత్మక తప్పని, దీన్ని బడుగు, బలహీనవర్గాలవారు సహించరని నిరూపించాలన్నారు. వెంటనే ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్‌ ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. వీహెచ్‌ మాట్లాడుతూ .. సీఎం కేసీఆర్‌కు బీసీలంటే ఎందుకు ఇంత కక్షో అర్థం కావడంలేదన్నారు. ఈ అంశంపై ఓ వైపు న్యాయబద్ధంగా పోరాడుతూనే తెలంగాణ ఉద్యమస్పూర్తితో ఉద్యమాలు చేద్దామని, ప్రతీ జిల్లాలో నిరసనలు చేద్దామని పిలుపునిచ్చారు.

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ .. ప్రొఫెసర్‌ జయశంకర్, కొండా లక్ష్మణ్‌బాపూజీ, ఆలె నరేంద్ర లాంటి బీసీ నేతల పునాదులమీద పుట్టిన టీఆర్‌ఎస్‌ పార్టీ, చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్లు బీసీలకే ద్రోహం చేస్తోందని ఆగ్రహంవ్యక్తం చేశారు. రిజర్వేషన్లపై కేసు వేసిన కాంగ్రెస్‌ పార్టీకి చెందిన స్వప్నా రెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ కి చెందిన గోపాల్‌ రెడ్డిలను ఆయా పార్టీలు సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆకుల లలిత, కాంగ్రెస్‌ బీసీ సెల్‌ చైర్మన్‌ చిత్తరంజన్‌ దాస్‌ తదితరులు పాల్గొన్నారు. రిజర్వేషన్ల సాధనకోసం జాజుల శ్రీనివాస్‌ నేడు ధర్నాచౌక్‌ వద్ద చేపట్టనున్న ధర్నాకు అన్ని పార్టీలు, సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. పార్టీలు, జెండాలు పక్కన పెట్టి అందరూ రిజర్వేషన్‌ కోసం పోరాడాలని సదస్సులో తీర్మానించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement