
స్రవంతికి వైద్య ఖర్చుల కోసం మంజూరైన సొమ్ముకు సంబంధించిన ఎల్‌ఓసీని అందజేస్తున్న మాజీ మంత్రి హరీశ్‌రావు
న్యాల్‌కల్ (జహీరాబాద్): సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌లోని ఎస్సీ కాలనీకి చెందిన స్రవంతి వైద్యం కోసం అవసరమైన నిధుల మంజూరుకు మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవ చూపారు. ఆమె వైద్యం కోసం అవసరమైన డబ్బులను ప్రభుత్వం నుంచి మంజూరు చేయించారు. మంజూరైన సొమ్ముకు సబంధించిన ఎల్‌ఓసీని శుక్రవారం బాధితులకు అందజేశారు. వివరాల్లోకి వెళ్లితే.. న్యాల్‌కల్‌కు చెందిన కీర్తన, మాణిక్ దంపతుల కూతురు స్రవంతి ప్రస్తుతం ఇంటర్ చదువుతోంది. కొంత కాలంగా ఆమె మెదడుకు సంబంధించిన వ్యాధితో బాధ పడుతోంది. కూతురుకు వచ్చిన వ్యాధికి చికిత్స చేయించేందుకు తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతున్నారు. ఇటీవల ఆసుపత్రికి తీసుకు వెళ్లడంతో వైద్యానికి రూ.14 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. దీంతో వారు తీవ్ర ఆందోళనలో పడ్డారు.
పూట గడవడమే కష్టంగా ఉన్న సమయంలో ఇంత డబ్బు ఎక్కడ నుంచి తేవాలని తల్లిదండ్రులు మనో వేదనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో అదే కాలనీకి చెందిన టీఆర్‌ఎస్ నాయకులు భాస్కర్, మండల టీఆర్‌ఎస్ నాయకుడు వెంకట్ ఈ విషయాన్ని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు దృష్టికి తీసుకువెళ్లారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే ఈ విషయాన్ని మాజీ మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన హరీశ్‌రావు, ముఖ్యమంత్రి సహాయ నిధి అధికారులతో మాట్లాడి స్రవంతి వైద్యం ఖర్చుల కోసం రూ.12 లక్షలు మంజూరు చేయించారు. దీనికి సంబంధించిన ఎల్‌ఓసీ పత్రాన్ని శుక్రవారం హైదరాబాద్‌లో హరీశ్‌రావు బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. స్రవంతి వైద్యం కోసం అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించడానికి చొరవ చూపిన హరీశ్‌రావు, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావుకు స్రవంతి, ఆమె తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment