చిట్యాల: నల్లగొండ జిల్లా చిట్యాలలోని సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రంలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కోట్ల రూపాయల విలువైన పత్తి నిల్వలు కాలిపోయాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల శివారులోని కృష్ణా కాటన్ మిల్లులో శుక్రవారం మధ్యాహ్నం నిల్వ చేసిన పత్తిని డోజర్‌తో పక్కకు తీస్తుండగా అకస్మాత్తుగా నిప్పురవ్వలు లేచాయి.
అవి పక్కనే ఉన్న పత్తి నిల్వలపై పడటంతో నిప్పంటుకుంది. అక్కడి సిబ్బంది, కార్మికులు నిప్పు ఆర్పేస్తుండగానే గోడౌన్‌లోని పత్తి నిల్వలకు మంటలు వ్యాపించాయి. దీనిపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్ధలానికి చేరుకుని రెండు ఫైరింజన్‌లతో మంటలను అదుపు చేసేందుకు యత్నించినా ఫలితం లేకపోయింది. సాయంత్రం నాలుగు గంటలకు మంటలు ఆరాయి. ఈ ప్రమాదంలో రూ.12 కోట్ల విలువైన సుమారు 30 వేల క్వింటాళ్ల పత్తి కాలిపోయినట్లు తెలుస్తోంది.