cotton mill
-
పత్తి మిల్లులో భారీ అగ్ని ప్రమాదం.. ఏడు కోట్ల నష్టం!
సాక్షి, మాగనూరు: నారాయణపేట జిల్లాలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. కాటన్ జిన్నింగ్ మిల్లులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడంతో భారీ స్థాయితో పత్తి దగ్ధమైంది. దాదాపు ఏడు కోట్ల నుంచి ఎనిమిది కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. నారాయణపేట జిల్లా మాగనూరు మండలంలోని బసవేశ్వర కాటన్ జిన్నింగ్ మిల్లో విద్యుత్ షార్ట్ సర్కూట్ జరిగింది. ఈ సందర్భంగా మిల్లులో నిల్వ చేసుకున్న పత్తి దగ్దమైంది. శనివారం రాత్రి 11గంటల సమయంలో విద్యుత్ షార్ట్ సర్యూట్‌తో మిల్లులో నిల్వ ఉంచిన పత్తి మంటల్లో కాలిపోయింది. సకాలంలో అగ్నిమాపక కేంద్రం సిబ్బంది వచ్చి మంటలు ఆర్పడంతో కొంత మేరకు ప్రమాదం తప్పింది. అగ్ని ప్రమాదం కారణంగా బసవేశ్వర జిన్నింగ్ కాటన్ మిల్లులో పత్తి, పత్తి గింజలు, మిషనరీలు, షెడ్డు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో దాదాపు 7 నుండి 8కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగిందని మిల్లు యజమాని దండే తమ్మన్న తెలిపారు. ఈ సందర్భంగా తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. -
కాగజ్‌నగర్ కాటన్ మిల్లులో అగ్ని ప్రమాదం
రెబ్బెన(ఆసిఫాబాద్): కుమురంభీం జిల్లా రెబ్బెన మండలంలోని కాగజ్‌నగర్ కాటన్ మిల్లులో శుక్రవా రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రూ.2 కోట్ల విలువైన పత్తి అగ్నికి ఆహుతైంది. ఈ ఘనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. శుక్రవారం మధ్యా హ్నం తర్వాత మిల్లులోకి పత్తి లోడుతో వచ్చిన ట్రాక్టర్ ఇంజిన్ స్టార్ట్ చేసే క్రమంలో నిప్పురవ్వలు చెలరేగాయి. క్షణాల్లోనే మిల్లు ఆవరణలో ఉన్న పత్తితో పాటు బేళ్లకు అంటుకోవటంతో పెద్దమొత్తంలో మంటలు వ్యాపించాయి. అక్కడ ఉన్న వారు వెంటనే ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ పట్టణాల్లోని ఫైరింజన్లకు సమాచారం అందించగా.. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. అప్పటికే 2,300 క్వింటాళ్ల పత్తితోపాటు, 94 పత్తి బేళ్లు కాలిపోయాయని మిల్లు నిర్వాహకులు తెలిపారు. -
స్వాతి మిల్లులో ప్రమాదం.. అనుమానాలు
నాదెండ్ల: మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు చెందిన స్వాతి కాటన్ ప్రైవేట్ లిమిటెడ్‌లో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం గణపవరం 16వ నంబర్ జాతీయ రహదారికి ఆనుకుని కాటన్, స్పిన్నింగ్, టెక్స్టైల్స్, అయిల్ మిల్స్ తదితర వ్యాపారాలకు సంబంధించిన కంపెనీలున్నాయి. కంపెనీ డైరెక్టర్ బి.అంకమ్మరావు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం తెల్లవారు జామున డీలింట్ కాటన్ (జిన్నింగ్ చేయగా పత్తివిత్తనాలపై మిగిలిన దూది నూగు) బేల్స్‌ఉన్న గోడోన్ నుంచి మంటలు చెలరేగాయి. దీంతో సంస్థ యాజమాన్యం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించింది. మంటలు భారీగా చెలరేగడంతో అగ్నిమాపక అధికారులు మంటలను అదుపు చేసేందుకు నరసరావుపేట, చీరాల, గుంటూరు–1 నుంచి అగ్నిమాపక వాహనాలు తెప్పించారు. ఉదయం 10 గంటలకు మంటలు అదుపులోకి వచ్చాయి. ప్రమాద స్థలానికి గుంటూరు డీఎఫ్‌వో శ్రీనివాసరెడ్డి చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. దీనిపై కంపెనీ డైరెక్టర్ అంకమ్మ రావు మాట్లాడుతూ విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని అధికారులకు వివరించారు. రూ. 40లక్షలు నష్టం వాటిల్లినట్లు ఆయన తెలిపారు. స్వాతి కాటన్ మిల్స్‌ను అగ్ని మాపక శాఖ డీఎఫ్‌వో శ్రీనివాసరెడ్డి సందర్శించారు. జరిగిన సంఘటన తీరుపై విచారిస్తున్నామని, నష్టాన్ని అంచానా వేస్తున్నామని వివరించారు. -
మాజీ మంత్రి పత్తి మిల్లులో అగ్ని ప్రమాదం..
సాక్షి, గుంటూరు: పత్తి మిల్లులో అగ్ని ప్రమాదం సంభవించింది. నాదెండ్ల మండలం గణపవరంలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు చెందిన పత్తిమిల్లులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గౌడౌన్లో నిల్వ ఉంచిన ప్రత్తి దగ్ధం అయ్యింది. రూ.40 లక్షలు ఆస్తి నష్టం జరిగినట్లు తెలిసింది. విద్యుత్ షార్ట్ సర్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని సిబ్బంది తెలిపారు. ఫైర్ సిబ్బంది స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. -
కాటన్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం
సాక్షి, వరంగల్ అర్బన్: ఖిలా వరంగల్ మండలం నక్కలపెళ్లి గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్‌తో మహాలక్ష్మీ కాటన్ మిల్లులో మంటలు చెలరేగాయి. ఈ ఘటన గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారని పోలీసులు వెల్లడించారు. అయితే, అప్పటికే మంటలు తీవ్రమవడంతో గోదాంలో నిల్వ చేసిన పత్తి బెయిళ్లన్నీ కాలిపోయినట్లు తెలిసింది. ప్రమాదంలో రెండు కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని మిల్లు యాజమాని వాపోయారు. కాగా, ఘటనపై అగ్నిమాపక అధికారులు, పోలీసులు విచారణ చేపట్టారు. -
మంత్రి ప్రత్తిపాటి కంపెనీలో అగ్నిప్రమాదం
నాదెండ్ల (చిలకలూరిపేట): మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు చెందిన స్వాతి కాటన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆయిల్ డివిజన్ సీడ్ గోడౌన్లో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 7 వేల డీలింట్ కాటన్ బేళ్లు అగ్నికి ఆహుతవగా, సుమారు రూ.3.5 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. గుంటూరు జిల్లా గణపవరంలోని వేలూరు రోడ్డులో మంత్రి ప్రత్తిపాటికి శివస్వాతి టెక్స్టైల్స్, స్వాతి కాటన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మిల్లులున్నాయి. ఆదివారం అర్ధరాత్రి సీడ్ గోడౌన్లో మంటలు వ్యాపించాయి. నైట్ వాచ్మెన్లు మేనేజ్మెంట్ సిబ్బందికి సమాచారం అందించారు. నాలుగు ఫైరింజన్లు మంటలను ఆర్పే ప్రయత్నం చేశాయి. అనంతరం మరో నాలుగు ఫైరింజన్లను రప్పించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఉదయం 7 గంటలకు మంత్రి మిల్లును పరిశీలించారు. -
నూలుమిల్లు క్వార్టర్స్‌లో యువతి ఆత్మహత్య
గుంటూరు, నాదెండ్ల (చిలకలూరిపేట) : గణపవరం గ్రామంలోని ఒక నూలు పరిశ్రమలోని క్వార్టర్స్‌లో ఓ యువతి అనుమానాస్పదంగా ఫ్యాన్ ఒగ్గెకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై కె.చంద్రశేఖర్ చెప్పిన వివరాల మేరకు.. ఒడిశా రాష్ట్రానికి చెందిన జెటి అహల్య(23) తన అక్కా, బావతో కలిసి స్పిన్నింగ్ మిల్ క్వార్టర్స్‌లో నివాసం ఉంటుంది. ముగ్గురు కలిసి ప్రతిరోజు కూలి పనులకు వెళ్తుంటారు. ఈ క్రమంలో వారం రోజుల కిందట అక్కా, బావలు దసరా పురస్కరించుకుని స్వగ్రామానికి వెళ్లారు. తల్లిదండ్రులు ఒడిశాలో ఉంటూ ప్రతిరోజు ఫోన్లో మాట్లాడుతుంటారు. అహల్య ప్రవర్తనపై తల్లిదండ్రులు రోజు కోపంగా ఉంటుంటారని తోటి కార్మికులు చెబుతున్నారు. అయితే మంగళవారం ఉదయం నుంచి క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న గది తలుపులు ఎంత సేపటికీ తెరవకపోవడంతో పక్కనే నివాసం ఉండే వాళ్లు క్వార్టర్స్ ఇంచార్జి సాంబశివరావుకి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన తలుపులు తీయగా ఫ్యాన్‌కు ఉరివేసుకుని కన్పించడంతో యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. అయితే మృతురాలి వద్ద చేతిరాతతో ఉన్న సూసైడ్ నోట్ ఒడిశా భాషలో ఉండటంతో పోలీసులు దీనిపై అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆర్టీసీ బస్సు ఢీ కొని వ్యక్తి మృతి
గూడూరు రూరల్: ఆర్టీసీ బస్సు ఢీకొని కె.నాగలాపురంకు చెందిన కుర్వ ఎల్లయ్య(46) మృతి చెందాడు. పెంచికలపాడు సమీపంలోని కాటన్‌మిల్లు వద్ద బుధవారం రాత్రి ప్రమాదం చోటుచేసుకుంది. కె.నాగలాపురానికి చెందిన కుర్వ ఎల్లయ్యకు భార్య కిష్టమ్మ, ఇద్దరు సంతానం ఉన్నారు. ఇతనికి 150 వరకు గొర్రెల మంద ఉండగా, వాటిని మేపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పెంచికలపాడు సమీపంలోని కాటన్ మిల్లు వెనుక ఉన్న పొలంలో తన గొర్రెల మందను నిలుపుకున్న కాపరులకు ఇంటి నుంచి భోజనం తీసుకుని రాత్రి 9 గంటలకు బయలుదేరాడు. కాటన్ మిల్లు సమీపంలో రోడ్డుపై ఎడమ వైపున ఎల్లయ్య వెళుతుండగా పత్తికొండ డిపోకు చెందిన ఏపీ 21 జెడ్ 0148 ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో ఆయన అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. సమాచారం తెలుసుకున్న కె.నాగలాపురం ఎస్ఐ మల్లికార్జున, హెడ్‌కానిస్టెబుల్ పెద్దయ్య, కానిస్టేబుల్ రామాంజనేయులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న బస్సు డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
పత్తి ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం
–రూ.కోటి నష్టం ఆదోని అర్బన్: స్థానిక ఐశర్య కాటన్ పత్తి ఫ్యాక్టరీలో బుధవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సాయంత్రం చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో దాదాపు రూ.కోటి విలువైన పత్తి దగ్ధమైనట్లు అంచనా. ప్రమాదం ఎలా జరిగిందో విచారించాల్సి ఉందని అగ్నిమాపక కేంద్రం అధికారి ప్రభాకర్ తెలిపారు. రాశులుగా పోసిన పత్తి నుంచి ఒక్క సారిగా చెలరేగిన మంటలతో ఫ్యాక్టరీలో ఉన్న కూలీలు, హమాలీలు తీవ్ర భయాందోళనలకు గురి పరుగులు తీశారు. ఫ్యాక్టరీ యజమాని సోమశేఖర్గౌడుతో పాటు మరో ఇద్దరు వెంటనే పట్టణంలో ఉన్న అగ్ని మాపక కేంద్రం అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రెండు వాహనాలతో ఫ్యాక్టరీకి చేరుకున్న అగ్ని మాపక కేంద్రం సిబ్బంది నీరు చిమ్మి మంటలను అదుపు చేశారు. అయితే మంటలు భారీగా ఉండడంతో రెండు గంటలకు పైగా శ్రమించాల్సి వచ్చింది. -
ప్రియమైన అంజలీ.. నీకు జేజేలు
భవిష్యత్తును బతికించుకునేందుకు పెను సవాళ్లను అధిగమించిన బాలిక చదువుపై తపన ఉన్నా.. మూడేళ్లుగా కాటన్ మిల్లులో మగ్గిన బాల్యం బడికి పంపిస్తానని తీసుకెళ్లి పనిలో కుదిర్చిన అమ్మ పత్తి నుంచి దారం తీస్తూ రోజూ ఎనిమిదిన్నర గంటల పాటు చాకిరీ 14 ఏళ్లకే పెళ్లి చేయాలనుకున్న తల్లి చదువుకోవాలన్న ఆశతో హైదరాబాద్‌లోని బాబాయ్ వద్దకు వచ్చేసిన బాలిక తన లాంటివారు మిల్లులో మరెందరో ఉన్నారని ఆవేదన మిల్లు యాజమాన్యం నుంచి జీతం ఇప్పిస్తే ఆ డబ్బుతో చదువుకుంటానంటూ కన్నీళ్లు మేకల కల్యాణ్ చక్రవర్తి, సాక్షి ప్రతినిధి నల్లగొండ: ఆ చిన్నారికి పదకొండేళ్లు.. తల్లికి దూరంగా.. నానమ్మ ఊళ్లో చదువు.. స్నేహితులు, ఆటపాటలతో హాయిగా సాగిపోతోంది చదువు.. ఓ రోజు స్కూలు వద్దకు అమ్మ వచ్చింది.. ‘నాతో రా.. బాగా చదివిస్తా..’ అంది.. బాలిక నమ్మింది. ఇంకా మంచి స్కూళ్లో చదువుతానన్న ఆశతో అమ్మ వెంట నడిచింది. కానీ బాలికను స్కూల్లో చేర్పించాల్సిన ఆ తల్లి.. కాటన్ మిల్లులో చేర్చింది. చదువు, భవిష్యత్తుపై ఆ పాప అల్లుకున్న ఆశలన్నీ అడియాశలయ్యాయి. పుస్తకాలు పట్టాల్సిన ఆ చేతులు.. మిల్లులో పత్తి నుంచి దారం తీశాయి. రాత్రీపగలు తేడా లేకుండా రోజుకు 8.30 గంటల చాకిరీ! మూడేళ్లు ఉగ్గబట్టింది ఆ బాలిక. తన చదువుకు సరిపడ డబ్బులు సమకూరాయని భావించింది. అంతే.. తన ఆశలకు రెక్కలు తొడుక్కొని మిల్లు నుంచి బయటపడింది. ఇప్పుడు ఆ మిల్లు యాజమాన్యం నుంచి డబ్బులిప్పిస్తే చదువుకుంటానని కన్నీళ్లు పెట్టుకుంది. బాగా చదువుకొని ఉన్నత స్థానానికి చేరుకోవడమే తన లక్ష్యమని చెబుతోంది. ఆ సాహస బాలిక పేరు వరికుప్పల అంజలి. ఊరు నల్లగొండ జిల్లా డిండి మండలంలోని శేషాయకుంట. శుక్రవారం నల్లగొండలోని బాలసదన్ ప్రాంగణంలో అంజలిని ‘సాక్షి’ పలకరించింది. బాలిక ఆవేదన, ఆలోచనలు ఆమె మాటల్లోనే... మిల్లులో ఉన్నా మనసు చదువు మీదే.. మా నాన్న సత్యనారాయణ ఐదేళ్ల కిందటే చనిపోయిండు. తాత, నానమ్మ వద్ద ఉండి తౌకలాపూర్ హైస్కూల్లో చదువుకుంటున్న. అమ్మ మా దగ్గర ఉండేది కాదు. ఓ రోజు మంచినీళ్లకని బడిలో ఉన్న బోరింగ్ దగ్గరికి పోయిన. అమ్మ వచ్చి బాగా చదివిస్తానని చెప్పి తనతో తీసుకెళ్లింది. కానీ అలా చేయలేదు. నెల తర్వాత కాటన్ మిల్లులో పనికి కుదిర్చింది. మహబూబ్‌నగర్ జిల్లాలోని ఆమనగల్ దాటగానే కాటన్‌మిల్లు ఉంది. అందులో పనికి పెట్టి మూడేళ్లయింది. అందులో పని చేస్తున్నా.. మనసు చదువు మీదే ఉండేది. కానీ చేసేదేమీ లేక మిల్లులో దారం నేసేదాన్ని. మూడేళ్లుగా పనిచేస్తున్నా. మా అమ్మ కూడా ఆ మిల్లులోనే పనిచేస్తది. నాకు పెళ్లి చేస్తానని వాళ్లతో వీళ్లతో చెప్పింది. నా వయసు 14 ఏళ్లే. నాకేమో చదువుకోవాలని ఉంది. అప్పుడే పెళ్లి వద్దనుకున్నా... మిల్లు నుంచి తప్పించుకుని వచ్చేశా. డబ్బులిప్పించండి.. చదువుకుంటా.. మిల్లులో పత్తిని రోయింగ్, గేటింగ్ చేసి పోగు వేసే పనిజేసిన. అంటే దారం తీయడం అన్నమాట. రాత్రి 10 గంటలకు వచ్చి ఉదయం 7:30 వరకు పనిచేయాలె. రెండో షిఫ్టు అయితే మధ్యాహ్నం 2 గంటలకు వచ్చి రాత్రి 10:30 వరకు చేయాలె. అలా చేస్తే నెలకు రూ.6 వేల జీతం ఇస్తరు. తిండి ఖర్చులు, ఇతరత ఖర్చులు పోను ఏడాదికి రూ.50 వేలిస్తరు. అది కూడా ఏటా జీతం ఇవ్వరు. మూడేళ్లు పనిచేస్తేనే జీతం. మూడేళ్లకు ఆ మిల్లోళ్లు నాకు లక్షన్నర రూపాయలు ఇయ్యాలె. నేను పెద్దమనిషిని అయినప్పుడు సంతకం పెడితే నా జీతంలో పదివేలు మా అమ్మకు ఇచ్చిండ్రు. ఆ డబ్బులతో ఫంక్షన్ చేసి, నాకు కమ్మలు చేయించింది. నా రెండు జత కమ్మలు, కాళ్ల గొలుసులు అమ్మ దగ్గరే ఉన్నయ్. మిల్లోళ్లు ఇయ్యాల్సిన డబ్బులు ఇప్పించండి. అవి బ్యాంకులో వేసుకుని మా ఊర్లనే చదువుకుంట. చెకింగ్‌కు వస్తే మమ్ముల్ని షెడ్డులో దాచేవాళ్లు.. ఆ మిల్లులో అందరూ పేదోళ్లే పనిచేస్తరు. వైజాగ్, శ్రీకాకుళం, తమిళనాడు, ఒడిశా నుంచి కూడా వస్తరు. నా కన్నా చిన్నవాళ్లు (12, 13 ఏళ్ల వాళ్లు) కూడా పని చేస్తున్నరు. అలా పిల్లల్ని తీసుకురావడానికి సార్లుంటరు. పిల్లల్ని తెస్తే వారికి పైసలిస్తరు. శ్రీకాకుళం అప్పారావు అదే పని చేస్తడు. కష్టాల్లో తల్లిదండ్రులు కూడా ఇక్కడ వారి పిల్లలను పనికి కుదురుస్తరు. నా స్నేహితులు నీరజ, లక్ష్మి కూడా ఇక్కడే పనిచేసి వెళ్లిపోయిండ్రు. పండుగలకు మాత్రమే ఇంటికి పంపుతరు. దూరం ఉన్నోళ్లని ఎక్కువ రోజులు పంపుతరు. కానీ మమ్మల్ని పంపరు. ఎవరైనా గవర్నమెంటోళ్లు మిల్లు చెకింగ్‌కు వస్తే మమ్మల్ని మిల్లు అవతల షెడ్డులో దాచిపెట్టేవాళ్లు. క్వార్టర్స్‌లో, ఇన్చార్జుల రూముల్లో ఉంచెటోళ్లు. ఉదయాన్నే 8:30కి సైరన్ ఇడుస్తరు. అప్పుడు అన్నం పెడతరు. ఎప్పుడు తిన్నా అన్నమే.. టిఫిన్లు, అలాంటివి ఉండయ్. అన్నం మంచిగనే ఉంటది కానీ కూరలు బాగుండయ్. బేకరికని చెప్పి బస్సు ఎక్కేశా.. ఓ రోజు జ్వరం వచ్చింది. వార్డెన్ సుబ్బలక్ష్మితో (కాటన్‌మిల్లులో అంజలి లాంటి బాల కార్మికుల బాగోగులు చూసుకునే ఉద్యోగిని) ఆసుపత్రికి వచ్చా. ఆసుపత్రిలో చూపించుకున్నా. బేకరీ షాప్‌కు వెళ్తానని వార్డెన్‌కు చెప్పి బస్సు వస్తుంటే చెప్పకుండా ఎక్కేశా. హైదరాబాద్ ఆర్ట్స్ కాలేజీ దగ్గర ఉన్న వడ్డెర బస్తీకి వెళ్లా. అక్కడ మా బాబాయి ఇద్దయ్య ఉన్నడు. ఆయన దగ్గరకు వెళ్లి అన్ని విషయాలు చెప్పిన. మా మేనత్త మంగమ్మ కూడా వచ్చింది. ఇద్దరూ కలసి డిండి పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిండ్రు. అన్ని విషయాలు పోలీసోళ్లకు చెప్పిన్రు. మా అమ్మ నాకు చిన్న వయసులోనే పెళ్లి చేస్తోందని కేసు పెట్టిన. గవర్నమెంటోళ్లు ఇక్కడికి తీసుకొచ్చిండ్రు. నేను మా ఊరికెళ్లి చదువుకుంటా. ఇప్పుడే పెళ్లి చేసుకోను. ప్రభుత్వ ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషించాలని ఉంది. అమ్మ దగ్గరికి వెళ్లను.. నేను ఇక అమ్మ దగ్గరికి వెళ్లను. పత్తి మిల్లులో పెట్టిందని నాకు అమ్మంటే కోపం. మొన్న మా అమ్మ పోలీస్‌స్టేషన్‌కు వచ్చింది కానీ మాట్లాడలేదు. తమ్ముడితో కూడా మాట్లాడలేదు. తాత దగ్గర్నే ఉంట. మా తాత మంచిగ చూసుకుంటడు. నన్ను చదివిస్తడు. నానమ్మ కూడా ఉంది. వాళ్ల దగ్గర ఉండి చదువుకుని ప్రభుత్వ ఉద్యోగం వచ్చినంక పెళ్లి చేసుకుంట. అప్పటి వరకు పెళ్లి ముచ్చటే లేదు. ఉద్యోగం వచ్చేదాకా చదువుకుంట. ఆ పైసలిప్పిస్తే పెళ్లికి అక్కరొస్తయ్: అంజయ్య, అంజలి తాత నా కోడలు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్లిపోయింది. నేనే ఈ బిడ్డను సాకి పెద్ద చేసిన. మళ్లొచ్చి పిల్లను తీస్కపొయింది. మిల్లుల పనికి పెట్టింది. మేం బోయినా చూపలే. పండుగలకు కూడా తోలలే. అంజలి నాన్న చనిపోయిన ప్పుడు రూ.30 వేలొస్తే అవి కూడా నా కోడలే తీసుకుంది. ఇప్పుడు అంజలికి మిల్లోళ్లు ఇయ్యాల్సిన పైసలిప్పిస్తే బ్యాంకులో వేసుకుంటం. గవర్నమెంటోళ్లనే బ్యాంకుల వేయమనండి. నా మనమరాలి పెళ్లికి అక్కరొస్తయ్. నేనే నా మనమరాలిని తీసుకపోతా. 40 మంది బాల కార్మికులకు విముక్తి ఆమనగల్లు/కల్వకుర్తి: మహబూబ్‌నగర్ జిల్లా ఆమనగల్లు, కల్వకుర్తిలోని సూర్యలక్ష్మి, సూర్యలత కాటన్మిల్లుల్లో పనిచేస్తున్న 40 మంది బాల కార్మికులను శుక్రవారం స్థానిక పోలీసుల సహకారంతో ఆపరేషన్ స్మైల్ టీం సభ్యులు గుర్తించారు. ఆమనగల్లులోని సూర్యలక్ష్మి కాటన్‌మిల్లులో 17 మంది, సూర్యలత కాటన్‌మిల్లులో 23 మంది బాలలను గుర్తించారు. వీరంతా బిహార్, జార్ఖండ్, ఒడిశా, వైజాగ్, శ్రీకాకుళం తదితర ప్రాంతాలకు చెందినవారు. వారిని జిల్లా కేంద్రంలోని బాలసదన్‌కు తరలించారు. పోలీసులు ఆయా మిల్లుల యాజమాన్యాలపై కేసు నమోదు చేశారు. ఈ రెండు మిల్లులు అన్నదమ్ములివిగా సమాచారం. -
పత్తి బుగ్గి
- కాటన్ మిల్లులో అగ్నిప్రమాదం - సుమారు రూ.5 కోట్ల ఆస్తి నష్టం.. పూడూరు మండలం అజయ్‌బాగ్ సమీపంలోని సాయిబాబా అగ్రిటెక్ కాటన్ మిల్లులో బుధవారం అగ్ని ప్రమాదం సంభవించింది. మిల్లు ఆవరణలో ఆరబెట్టిన పత్తిని ట్రాక్టర్ డోజర్‌తో ఒక్కచోటకు పోగు చేస్తుండగా ఒక్కసారిగా దట్టమైన పొగలు వచ్చాయి. కాసేపటికే మంటలు మిల్లు ఆవరణ మొత్తం వ్యాపించి 9,100 క్వింటాళ్ల పత్తి కాలిబూడిదైంది. - పూడూరు పూడూరు: ప్రమాదవశాత్తు నిప్పంటుకోవడంతో కాటన్‌మిల్లులో అగ్ని ప్రమాదం జరిగి రూ. 5 కోట్ల ఆస్తినష్టం సంభవించింది. ఈ సంఘటన బుధవారం ఉదయం పూడూరు మండల పరిధిలోని అజయ్‌బాగ్ సమీపంలో ఉన్న సాయిబాబా అగ్రిటెక్ కాటన్ మిల్లులో చోటుచేసుకుంది. స్థానికులు, మిల్లు మేనేజర్ సంజయ్‌కుమార్ అగర్వాల్ తెలిపిన వివరాల ప్రకారం.. కాటన్ మిల్లులో విడిగా ఉన్న పత్తిని ట్రాక్టర్ డోజర్ ద్వారా సిమెంట్ బెడ్‌పై కుప్పగా చేస్తున్నారు. ఈక్రమంలో సిమెంట్ బెడ్,ట్రాక్టర్ డోజర్‌కు ఉన్న ఇనుప పరికరం వలన రాపిడీ జరిగి నిప్పురవ్వలు రావడంతో పత్తికి అంటుకొని మంటలు చెలరేగాయి. అంతలోనే సిబ్బంది అప్రమత్తమయ్యేసరికి దట్టంగా పొగ కమ్మేసింది. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. సిబ్బంది వెంటనే కంపెనీలో ఉన్న ఫైర్‌సిస్టమ్‌ను ఆన్ చేయగా అది పనిచేయలేదు. దీంతో ఫైర్ ఇంజన్‌కు సమాచారం ఇచ్చారు. గంట వరకు కూడా ఫైరింజన్ ఘటనా స్థలానికి చేరుకోలేదు. దీంతో దాదాపు రూ. 5 కోట్లకు పైగా విలువ చేసే పత్తి కాలిపోయింది. అనంతరం అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పారు. వికారాబాద్, చేవెళ్ల, పరిగి నుంచి మూడు ఫైర్ ఇంజన్లు రావడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. మిగతా పత్తి పూర్తిగా తడిచిపోయింది. కాగా, పక్కనే సీసీఐ అధికారులు కొనుగోలు చేసిన 2747 క్వింటాళ్ల పత్తికి ఎలాంటి ప్రమాదం వాటి ళ్లలేదు. రెండు వేల క్వింటాళ్ల పత్తిగింజలు,700 దూదిబేళ్లకు ఎలాంటి నష్టం జరగలేదు. కాగా, అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఘటనా స్థలాన్ని చేవెళ్ల సీఐ ఉపేందర్ పరిశీలించారు. కంపెనీలో ఉన్న ఫైర్ సిస్టం పని చేసి ఉంటే నష్టం తగ్గేదని తెలిపారు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది. -
కాటన్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం
పూడూరు: రంగారెడ్డి జిల్లా పూడూరు మండలం సాయిబాబా అగ్రోటెక్ కాటన్ జిన్నింగ్ మిల్లులో బుధవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ట్రాక్టర్ సహాయంతో పత్తిని ఒక్కచోటికి కుప్ప చేస్తుండగా ప్రమాదవశాత్తూ పొగగొట్టం నుంచి నిప్పు రవ్వలు ఎగిరిపడ్డాయి. ఫైరింజన్లు వచ్చేలోపే మంటలు మిల్లు అంతటా వ్యాపించాయి. ఫైరింజన్లు వచ్చి మంటలను అదుపు చేశాయి. సుమారు 10 వేల క్వింటాళ్ల పత్తి బూడిద పాలయినట్లు అధికారులు అంచనావేశారు. -
కాటన్‌మిల్లులో అగ్నిప్రమాదం
మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ మండలం చిలకలమర్రి కాటన్ మిల్లులో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. భద్రత సిబ్బంది వెంటనే అప్రమత్తమై... అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని.. మంటలార్పుతున్నారు. ఈ అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా పోలీసులు భద్రత సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. -
కాటన్ మిల్లులో అగ్నిప్రమాదం..
చింతపల్లి(నల్గొండ జిల్లా): చింతపల్లి మండలం కొక్కిరాలతండాలోని వెంకటేశ్వర కాటన్ మిల్లులో బుధవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. లారీ సైలెన్సర్ నుంచి వచ్చిన అగ్గిరవ్వ ప్రత్తికి అంటుకుని ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు చెబుతున్నారు. సుమారు రూ.కోటికి పైగా ఆస్తినష్టం సంభవించినట్లు తెలుస్తోంది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పత్తి మిల్లులో భారీ అగ్నిప్రమాదం
చిట్యాల: నల్లగొండ జిల్లా చిట్యాలలోని సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రంలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కోట్ల రూపాయల విలువైన పత్తి నిల్వలు కాలిపోయాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల శివారులోని కృష్ణా కాటన్ మిల్లులో శుక్రవారం మధ్యాహ్నం నిల్వ చేసిన పత్తిని డోజర్‌తో పక్కకు తీస్తుండగా అకస్మాత్తుగా నిప్పురవ్వలు లేచాయి. అవి పక్కనే ఉన్న పత్తి నిల్వలపై పడటంతో నిప్పంటుకుంది. అక్కడి సిబ్బంది, కార్మికులు నిప్పు ఆర్పేస్తుండగానే గోడౌన్‌లోని పత్తి నిల్వలకు మంటలు వ్యాపించాయి. దీనిపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్ధలానికి చేరుకుని రెండు ఫైరింజన్లతో మంటలను అదుపు చేసేందుకు యత్నించినా ఫలితం లేకపోయింది. సాయంత్రం నాలుగు గంటలకు మంటలు ఆరాయి. ఈ ప్రమాదంలో రూ.12 కోట్ల విలువైన సుమారు 30 వేల క్వింటాళ్ల పత్తి కాలిపోయినట్లు తెలుస్తోంది. -
పత్తి పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం
నల్లగొండ : నల్లగొండ జిల్లా చిట్యాలలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్సర్క్కూట్తో మంటలు చెలరేగి పత్తి పరిశ్రమలో ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. వివరాలు..మండలంలోని శ్రీకృష్ణా కాటన్ మిల్లో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి పరిశ్రమలోని పత్తి బేళ్లకు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో సుమారు 30 వేల క్వింటాళ్ల పత్తి కాలి బూడిదైనట్లు కంపెనీ యాజమాన్యం తెలిపింది. దీంతో సుమారుగా రూ. 10 కోట్ల విలువైన పత్తి కాలిపోయిందని వారు వాపోయారు. విషయం తెలిసిన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. (చిట్యాల) -
పత్తి మిల్లులో భారీ అగ్నిప్రమాదం
సత్తెనపల్లి : గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల సమీపంలోని పత్తి మిల్లులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గురువారం మధ్యాహ్నం మిల్లులో ఒక్కసారిగా మంటలు చెలరేగి పత్తి బేళ్లకు అంటుకున్నాయి. వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించటంతో ఫైరింజన్లు వచ్చి మంటలు ఆర్పుతున్నాయి. కాగా ప్రమాదానికి గల కారణాలు, నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. -
కాటన్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం
మెదక్: ప్రమాదవశాత్తు మంటలు రావడంతో కాటన్ మిల్లు కాలిబూడిదైంది. ఈ సంఘటన మెదక్ జిల్లా ఆంథోల్ మండలంలోని రాంసాన్పల్లి గ్రామశివారులో ఉన్న సిద్ధార్థ కాటన్ మిల్లో శుక్రవారం జరిగింది. వివరాలు.. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) కొనుగోలు చేసిన 16,000 క్వింటాళ్లు పత్తిని సిద్ధార్థ కాటన్ మిల్లో నిల్వ ఉంచారు. శుక్రవారం యార్డులో లారీ ప్రయాణిస్తుండగా అందులోంచి నిప్పు తుంపరులు వెళ్లి పత్తికి అంటుకోవడంతో అగ్నిప్రమాదం జరిగిందని సీసీఐ ఇన్చార్జ్ మంగేష్ తెలిపారు. వెంటనే అప్రమత్తమైన యార్డు సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. ఈ ప్రమాదంలో సుమారుగా 7000 క్వింటాళ్ల పత్తి దగ్ధమైందన్నారు. సుమారుగా రూ. 50లక్షల నష్టం వాటిల్లిందని ఆయన చెప్పారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (జోగిపేట) -
పత్తిమిల్లులో అగ్నిప్రమాదం
నల్లగొండ జిల్లా వలిగొండ మండలం నర్సయ్యగూడెం వద్ద ఉన్న పత్తిమిల్లులో అగ్నిపమాదం జరిగింది. అయితే ప్రమాదానికి కారణం తెలియలేదు. సాయంత్రం 6.30 గంటల నుంచి మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన చేరుకుని మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎంత ఆస్తి నష్టం జరిగిందనేది ఇంకా తెలియలేదు. మంటలు ఎగిసిపడుతుండడంతో చుట్టుపక్కల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. -
అన్నీ ఉన్నా.. ఆదరణ కరువు
గీసుకొండ : మండలంలోని ప్రగతి పారిశ్రామిక ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్న పత్తి మిల్లుల్లో జిన్నింగ్, ప్రెస్సింగ్ వ్యాపారానికి ప్రోత్సాహం కరువైంది. రాష్ట్రంలో ఆదిలాబాద్ తర్వాత ద్వితీయ స్థానంలో ఉన్న ఇక్కడి పత్తి మిల్లులు అనేక సమస్యలకు నిలయంగా మారాయి. పత్తి బేళ్ల ఉత్పత్తిలో దేశంలోనే మన రాష్ట్రం మూడోస్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాల్లో గుజరాత్, మహారాష్ట్ర ఉన్నాయి. రాష్ట్రంలో ఏడాదికి 50 లక్షల బేళ్ల వరకు ఉత్పత్తి అవుతుండగా జిల్లాలో 9లక్షల బేళ్లు ఉత్పత్తి అవుతున్నాయంటే ఇక్కడి మిల్లుల ప్రాధాన్యం గురించి అర్థం చేసుకోవచ్చు. ప్రగతి పారిశ్రామిక ప్రాంతంలో 16 కాటన్ టెక్నాలజీ మిషన్(టీఎంసీ) మిల్లులు ఉండగా, 60 వరకు టీఎంసీ కాని జిన్నింగ్, ప్రెస్సింగ్ మిల్లులు, 40 వరకు జిన్నింగ్ మిల్లులు ఉన్నాయి. నేలచూపులు చూస్తున్న పత్తిధర ప్రస్తుత సీజన్లో క్యాండీ(356)ప్రెస్సింగ్ చేసిన పత్తి బేళ్ల ధర రూ. 33,500 పలుకుతోంది. ముడి పత్తి మార్కెట్ ధర ఆధారంగా బేలుకు రూ. 34,500 ఉండాలి. ఈ లెక్కన ప్రతీ బేలుపై వ్యాపారులకు రూ. వెయ్యి వరకు నష్టం వస్తోందని అంటున్నారు. స్థానిక మిల్లుల్లో తయారైన పత్తి బేళ్లను తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు, సేలం, మధురై తదితర ప్రాంతాల్లోని స్పిన్నింగ్ మిల్లులకు ఎగుమతి చేస్తున్నారు. ప్రతిరోజు సీజన్లో జిల్లాలో ఆరువేల పత్తి బేళ్లు తయారవుతున్నాయి. ఏడాదికి 9లక్షల బేళ్లకుపైగా ఉత్పత్తి అవుతున్నాయి. ముడిపత్తి నుంచి జిన్నింగ్ చేసిన గింజల ధర క్వింటాలుకు రూ.1450గా ఉంది. కొన్ని రోజుల క్రితం ఇది రూ. 1700 పలికింది.బేళ్లు, గింజల ధర రోజు రోజుకు పడిపోతుండడం వ్యాపారులను కలవరపరుస్తోంది. కరెంటు కోతల సమస్య... పత్లి మిల్లులకు తొలుత మూడు రోజుల పాటు పవర్‌హాలిడే విధించారు. దీంతో సరిగ్గా సీజన్ సమయంలోనే మిల్లులు సరిగా నడవకుండా అయిపోయింది. ఇటీవల కోతను ఒక రోజుకు పరిమితం చేశారు. బుధవారం పవర్‌హాలిడే అమలవుతోంది. ఎస్పీడీసీఎల్ పరిధిలో ఏడు ర కాల ఉత్పత్తులకు కరెంటు కోతలను మినహాయించారు. ఎన్పీడీసీఎల్ పరిధిలో అలా కాకుండా కోతలను విధిస్తుండడాన్ని పత్తి మిల్లుల వ్యాపారులు వ్యతిరేకిస్తున్నారు. తమకు కూడా పవర్‌హాలిడేను ఎత్తివేయాలని కోరుతున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహకాల ఊసేలేదు దేశంలో పత్తిబేళ్ల ఉత్పత్తిలో రాష్ట్రం మూడోస్థానంలో ఉన్నా ఇక్కడి పత్తి మిల్లులకు, వ్యాపారం చేసేవారికి ప్రభుత్వ ప్రోత్సాహకాలు లేవు. గుజరాత్, మహారాష్ట్రలో మిల్లులను నెలకొల్పడానికి తీసుకునే రుణాలపై ఏడుశాతం వడ్డీపై రాయితీ ఇస్తున్నారు. కరెంటు ప్రతీ యూనిట్ ధరపై సబ్సిడీ, ఉచితంగా రిజిస్ట్రేషన్లు, అనుమతులు ఇస్తున్నారు. ఇక్కడ ఆ పరిస్థితి లేదని వ్యాపారులు చెబుతున్నారు. మరికొన్ని సమస్యలు ఇలా.. ప్రగతి పారిశ్రామిక ప్రాంతంలోని అతర్గత రోడ్లు చాలా ఏళ్లక్రితం నిర్మించినవి. వాటి మరమ్మతు, కొత్త రోడ్ల నిర్మాణం వంటి విషయంలో పారిశ్రామికశాఖ పట్టించుకోవడం లేదు. వ్యాపారులే సొంతంగా ఈ ప్రాంతాన్ని పారిశ్రామిక ప్రాంతంగా గుర్తించి ఏర్పాటు చేసుకోవడం మినహా ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులు లేవు. తాగునీటి సదుపాయం కూడా లేకపోవడంతో నగర కార్పొరేషన్ నుంచి తమకు తాగునీరు అందించేలా చూడాలని స్థానిక మిల్లుల యజమానులు, కార్మికులు కోరతున్నారు. రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వాలి జిల్లాలో పత్తి జిన్నింగ్, ప్రెస్సింగ్ వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం రాయితీలు, తగిన ప్రోత్సాహకాలు ఇవ్వాలి. పత్తి ఉప ఉత్పత్తులపై సెస్ ఎత్తివేయాలి. పవర్ హాలిడేను కూడా ఎత్తివేసి సబ్సిడీపై మిల్లులకు కరెంటివ్వాలి. ఈ విషయమై ఇప్పటికే మంత్రి హరీష్‌రావుతో పాటు కేంద్రమంత్రులను కలిశాం. ప్రభుత్వం కొత్తగా రూపొందించే పారిశ్రామిక విధానంలో పత్తి మిల్లుల వ్యాపారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. స్పిన్నింగ్, సాల్వెంట్ మిల్లులను ఏర్పాటు చేయాలి. - వీరారావు, కాటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు