గీసుకొండ : మండలంలోని ప్రగతి పారిశ్రామిక ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్న పత్తి మిల్లుల్లో జిన్నింగ్, ప్రెస్సింగ్ వ్యాపారానికి ప్రోత్సాహం కరువైంది. రాష్ట్రంలో ఆదిలాబాద్ తర్వాత ద్వితీయ స్థానంలో ఉన్న ఇక్కడి పత్తి మిల్లులు అనేక సమస్యలకు నిలయంగా మారాయి. పత్తి బేళ్ల ఉత్పత్తిలో దేశంలోనే మన రాష్ట్రం మూడోస్థానంలో ఉంది.
మొదటి రెండు స్థానాల్లో గుజరాత్, మహారాష్ట్ర ఉన్నాయి. రాష్ట్రంలో ఏడాదికి 50 లక్షల బేళ్ల వరకు ఉత్పత్తి అవుతుండగా జిల్లాలో 9లక్షల బేళ్లు ఉత్పత్తి అవుతున్నాయంటే ఇక్కడి మిల్లుల ప్రాధాన్యం గురించి అర్థం చేసుకోవచ్చు. ప్రగతి పారిశ్రామిక ప్రాంతంలో 16 కాటన్ టెక్నాలజీ మిషన్(టీఎంసీ) మిల్లులు ఉండగా, 60 వరకు టీఎంసీ కాని జిన్నింగ్, ప్రెస్సింగ్ మిల్లులు, 40 వరకు జిన్నింగ్ మిల్లులు ఉన్నాయి.
నేలచూపులు చూస్తున్న పత్తిధర
ప్రస్తుత సీజన్‌లో క్యాండీ(356)ప్రెస్సింగ్ చేసిన పత్తి బేళ్ల ధర రూ. 33,500 పలుకుతోంది. ముడి పత్తి మార్కెట్ ధర ఆధారంగా బేలుకు రూ. 34,500 ఉండాలి. ఈ లెక్కన ప్రతీ బేలుపై వ్యాపారులకు రూ. వెయ్యి వరకు నష్టం వస్తోందని అంటున్నారు. స్థానిక మిల్లుల్లో తయారైన పత్తి బేళ్లను తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు, సేలం, మధురై తదితర ప్రాంతాల్లోని స్పిన్నింగ్ మిల్లులకు ఎగుమతి చేస్తున్నారు. ప్రతిరోజు సీజన్‌లో జిల్లాలో ఆరువేల పత్తి బేళ్లు తయారవుతున్నాయి. ఏడాదికి 9లక్షల బేళ్లకుపైగా ఉత్పత్తి అవుతున్నాయి. ముడిపత్తి నుంచి జిన్నింగ్ చేసిన గింజల ధర క్వింటాలుకు రూ.1450గా ఉంది. కొన్ని రోజుల క్రితం ఇది రూ. 1700 పలికింది.బేళ్లు, గింజల ధర రోజు రోజుకు పడిపోతుండడం వ్యాపారులను కలవరపరుస్తోంది.
కరెంటు కోతల సమస్య...
పత్లి మిల్లులకు తొలుత మూడు రోజుల పాటు పవర్‌హాలిడే విధించారు. దీంతో సరిగ్గా సీజన్ సమయంలోనే మిల్లులు సరిగా నడవకుండా అయిపోయింది. ఇటీవల కోతను ఒక రోజుకు పరిమితం చేశారు. బుధవారం పవర్‌హాలిడే అమలవుతోంది. ఎస్‌పీడీసీఎల్ పరిధిలో ఏడు ర కాల ఉత్పత్తులకు కరెంటు కోతలను మినహాయించారు. ఎన్‌పీడీసీఎల్ పరిధిలో అలా కాకుండా కోతలను విధిస్తుండడాన్ని పత్తి మిల్లుల వ్యాపారులు వ్యతిరేకిస్తున్నారు. తమకు కూడా పవర్‌హాలిడేను ఎత్తివేయాలని కోరుతున్నారు.
ప్రభుత్వ ప్రోత్సాహకాల ఊసేలేదు
దేశంలో పత్తిబేళ్ల ఉత్పత్తిలో రాష్ట్రం మూడోస్థానంలో ఉన్నా ఇక్కడి పత్తి మిల్లులకు, వ్యాపారం చేసేవారికి ప్రభుత్వ ప్రోత్సాహకాలు లేవు. గుజరాత్, మహారాష్ట్రలో మిల్లులను నెలకొల్పడానికి తీసుకునే రుణాలపై ఏడుశాతం వడ్డీపై రాయితీ ఇస్తున్నారు. కరెంటు ప్రతీ యూనిట్ ధరపై సబ్సిడీ, ఉచితంగా రిజిస్ట్రేషన్లు, అనుమతులు ఇస్తున్నారు. ఇక్కడ ఆ పరిస్థితి లేదని వ్యాపారులు చెబుతున్నారు.
మరికొన్ని సమస్యలు ఇలా..
ప్రగతి పారిశ్రామిక ప్రాంతంలోని అతర్గత రోడ్లు చాలా ఏళ్లక్రితం నిర్మించినవి. వాటి మరమ్మతు, కొత్త రోడ్ల నిర్మాణం వంటి విషయంలో పారిశ్రామికశాఖ పట్టించుకోవడం లేదు. వ్యాపారులే సొంతంగా ఈ ప్రాంతాన్ని పారిశ్రామిక ప్రాంతంగా గుర్తించి ఏర్పాటు చేసుకోవడం మినహా ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులు లేవు. తాగునీటి సదుపాయం కూడా లేకపోవడంతో నగర కార్పొరేషన్ నుంచి తమకు తాగునీరు అందించేలా చూడాలని స్థానిక మిల్లుల యజమానులు, కార్మికులు కోరతున్నారు.
రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వాలి
జిల్లాలో పత్తి జిన్నింగ్, ప్రెస్సింగ్ వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం రాయితీలు, తగిన ప్రోత్సాహకాలు ఇవ్వాలి. పత్తి ఉప ఉత్పత్తులపై సెస్ ఎత్తివేయాలి. పవర్ హాలిడేను కూడా ఎత్తివేసి సబ్సిడీపై మిల్లులకు కరెంటివ్వాలి. ఈ విషయమై ఇప్పటికే మంత్రి హరీష్‌రావుతో పాటు కేంద్రమంత్రులను కలిశాం. ప్రభుత్వం కొత్తగా రూపొందించే పారిశ్రామిక విధానంలో పత్తి మిల్లుల వ్యాపారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. స్పిన్నింగ్, సాల్వెంట్ మిల్లులను ఏర్పాటు చేయాలి.
- వీరారావు, కాటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు
అన్నీ ఉన్నా.. ఆదరణ కరువు
Published Sun, Nov 16 2014 1:46 AM | Last Updated on Sat, Sep 2 2017 4:31 PM
Advertisement