ప్రియమైన అంజలీ.. నీకు జేజేలు | anjali works at cotton mill and wants to study | Sakshi
Sakshi News home page

ప్రియమైన అంజలీ.. నీకు జేజేలు

Published Sat, Jan 30 2016 3:14 AM | Last Updated on Sun, Sep 3 2017 4:34 PM

ప్రియమైన అంజలీ.. నీకు జేజేలు

ప్రియమైన అంజలీ.. నీకు జేజేలు

భవిష్యత్తును బతికించుకునేందుకు పెను సవాళ్లను అధిగమించిన బాలిక
చదువుపై తపన ఉన్నా.. మూడేళ్లుగా కాటన్ మిల్లులో మగ్గిన బాల్యం
బడికి పంపిస్తానని తీసుకెళ్లి పనిలో కుదిర్చిన అమ్మ
పత్తి నుంచి దారం తీస్తూ రోజూ ఎనిమిదిన్నర గంటల పాటు చాకిరీ
14 ఏళ్లకే పెళ్లి చేయాలనుకున్న తల్లి
చదువుకోవాలన్న ఆశతో హైదరాబాద్‌లోని బాబాయ్ వద్దకు వచ్చేసిన బాలిక
తన లాంటివారు మిల్లులో మరెందరో ఉన్నారని ఆవేదన
మిల్లు యాజమాన్యం నుంచి జీతం ఇప్పిస్తే ఆ డబ్బుతో చదువుకుంటానంటూ కన్నీళ్లు

 
మేకల కల్యాణ్ చక్రవర్తి, సాక్షి ప్రతినిధి నల్లగొండ:
ఆ చిన్నారికి పదకొండేళ్లు.. తల్లికి దూరంగా.. నానమ్మ ఊళ్లో చదువు.. స్నేహితులు, ఆటపాటలతో హాయిగా సాగిపోతోంది చదువు.. ఓ రోజు స్కూలు వద్దకు అమ్మ వచ్చింది.. ‘నాతో రా.. బాగా చదివిస్తా..’ అంది.. బాలిక నమ్మింది. ఇంకా మంచి స్కూళ్లో చదువుతానన్న ఆశతో అమ్మ వెంట నడిచింది. కానీ బాలికను స్కూల్లో చేర్పించాల్సిన ఆ తల్లి.. కాటన్ మిల్లులో చేర్చింది. చదువు, భవిష్యత్తుపై ఆ పాప అల్లుకున్న ఆశలన్నీ అడియాశలయ్యాయి. పుస్తకాలు పట్టాల్సిన ఆ చేతులు.. మిల్లులో పత్తి నుంచి దారం తీశాయి. రాత్రీపగలు తేడా లేకుండా రోజుకు 8.30 గంటల చాకిరీ! మూడేళ్లు ఉగ్గబట్టింది ఆ బాలిక.
 
తన చదువుకు సరిపడ డబ్బులు సమకూరాయని భావించింది. అంతే.. తన ఆశలకు రెక్కలు తొడుక్కొని మిల్లు నుంచి బయటపడింది. ఇప్పుడు ఆ మిల్లు యాజమాన్యం నుంచి డబ్బులిప్పిస్తే చదువుకుంటానని కన్నీళ్లు పెట్టుకుంది. బాగా చదువుకొని ఉన్నత స్థానానికి చేరుకోవడమే తన లక్ష్యమని చెబుతోంది. ఆ సాహస బాలిక పేరు వరికుప్పల అంజలి. ఊరు నల్లగొండ జిల్లా డిండి మండలంలోని శేషాయకుంట. శుక్రవారం నల్లగొండలోని బాలసదన్ ప్రాంగణంలో అంజలిని ‘సాక్షి’ పలకరించింది. బాలిక ఆవేదన, ఆలోచనలు ఆమె మాటల్లోనే...
 
మిల్లులో ఉన్నా మనసు చదువు మీదే..
మా నాన్న సత్యనారాయణ ఐదేళ్ల కిందటే చనిపోయిండు. తాత, నానమ్మ వద్ద ఉండి తౌకలాపూర్ హైస్కూల్‌లో చదువుకుంటున్న. అమ్మ మా దగ్గర ఉండేది కాదు. ఓ రోజు మంచినీళ్లకని బడిలో ఉన్న బోరింగ్ దగ్గరికి పోయిన. అమ్మ వచ్చి బాగా చదివిస్తానని చెప్పి తనతో తీసుకెళ్లింది. కానీ అలా చేయలేదు. నెల తర్వాత కాటన్ మిల్లులో పనికి కుదిర్చింది. మహబూబ్‌నగర్ జిల్లాలోని ఆమనగల్ దాటగానే కాటన్‌మిల్లు ఉంది. అందులో పనికి పెట్టి మూడేళ్లయింది. అందులో పని చేస్తున్నా.. మనసు చదువు మీదే ఉండేది. కానీ చేసేదేమీ లేక మిల్లులో దారం నేసేదాన్ని. మూడేళ్లుగా పనిచేస్తున్నా. మా అమ్మ కూడా ఆ మిల్లులోనే పనిచేస్తది. నాకు పెళ్లి చేస్తానని వాళ్లతో వీళ్లతో చెప్పింది. నా వయసు 14 ఏళ్లే. నాకేమో చదువుకోవాలని ఉంది. అప్పుడే పెళ్లి వద్దనుకున్నా... మిల్లు నుంచి తప్పించుకుని వచ్చేశా.
 
డబ్బులిప్పించండి.. చదువుకుంటా..
మిల్లులో పత్తిని రోయింగ్, గేటింగ్ చేసి పోగు వేసే పనిజేసిన. అంటే దారం తీయడం అన్నమాట. రాత్రి 10 గంటలకు వచ్చి ఉదయం 7:30 వరకు పనిచేయాలె. రెండో షిఫ్టు అయితే మధ్యాహ్నం 2 గంటలకు వచ్చి రాత్రి 10:30 వరకు చేయాలె. అలా చేస్తే నెలకు రూ.6 వేల జీతం ఇస్తరు. తిండి ఖర్చులు, ఇతరత ఖర్చులు పోను ఏడాదికి రూ.50 వేలిస్తరు. అది కూడా ఏటా జీతం ఇవ్వరు. మూడేళ్లు పనిచేస్తేనే జీతం. మూడేళ్లకు ఆ మిల్లోళ్లు నాకు లక్షన్నర రూపాయలు ఇయ్యాలె. నేను పెద్దమనిషిని అయినప్పుడు సంతకం పెడితే నా జీతంలో పదివేలు మా అమ్మకు ఇచ్చిండ్రు. ఆ డబ్బులతో ఫంక్షన్ చేసి, నాకు కమ్మలు చేయించింది. నా రెండు జత కమ్మలు, కాళ్ల గొలుసులు అమ్మ దగ్గరే ఉన్నయ్. మిల్లోళ్లు ఇయ్యాల్సిన డబ్బులు ఇప్పించండి. అవి బ్యాంకులో వేసుకుని మా ఊర్లనే చదువుకుంట.
 
చెకింగ్‌కు వస్తే మమ్ముల్ని షెడ్డులో దాచేవాళ్లు..
ఆ మిల్లులో అందరూ పేదోళ్లే పనిచేస్తరు. వైజాగ్, శ్రీకాకుళం, తమిళనాడు, ఒడిశా నుంచి కూడా వస్తరు. నా కన్నా చిన్నవాళ్లు (12, 13 ఏళ్ల వాళ్లు) కూడా పని చేస్తున్నరు. అలా పిల్లల్ని తీసుకురావడానికి సార్లుంటరు. పిల్లల్ని తెస్తే వారికి పైసలిస్తరు. శ్రీకాకుళం అప్పారావు అదే పని చేస్తడు. కష్టాల్లో తల్లిదండ్రులు కూడా ఇక్కడ వారి పిల్లలను పనికి కుదురుస్తరు. నా స్నేహితులు నీరజ, లక్ష్మి కూడా ఇక్కడే పనిచేసి వెళ్లిపోయిండ్రు. పండుగలకు మాత్రమే ఇంటికి పంపుతరు. దూరం ఉన్నోళ్లని ఎక్కువ రోజులు పంపుతరు. కానీ మమ్మల్ని పంపరు. ఎవరైనా గవర్నమెంటోళ్లు మిల్లు చెకింగ్‌కు వస్తే మమ్మల్ని మిల్లు అవతల షెడ్డులో దాచిపెట్టేవాళ్లు. క్వార్టర్స్‌లో, ఇన్‌చార్జుల రూముల్లో ఉంచెటోళ్లు. ఉదయాన్నే 8:30కి సైరన్ ఇడుస్తరు. అప్పుడు అన్నం పెడతరు. ఎప్పుడు తిన్నా అన్నమే.. టిఫిన్లు, అలాంటివి ఉండయ్. అన్నం మంచిగనే ఉంటది కానీ కూరలు బాగుండయ్.
 
బేకరికని చెప్పి బస్సు ఎక్కేశా..
ఓ రోజు జ్వరం వచ్చింది. వార్డెన్ సుబ్బలక్ష్మితో (కాటన్‌మిల్లులో అంజలి లాంటి బాల కార్మికుల బాగోగులు చూసుకునే ఉద్యోగిని) ఆసుపత్రికి వచ్చా. ఆసుపత్రిలో చూపించుకున్నా. బేకరీ షాప్‌కు వెళ్తానని వార్డెన్‌కు చెప్పి బస్సు వస్తుంటే చెప్పకుండా ఎక్కేశా. హైదరాబాద్ ఆర్ట్స్ కాలేజీ దగ్గర ఉన్న వడ్డెర బస్తీకి వెళ్లా. అక్కడ మా బాబాయి ఇద్దయ్య ఉన్నడు. ఆయన దగ్గరకు వెళ్లి అన్ని విషయాలు చెప్పిన. మా మేనత్త మంగమ్మ కూడా వచ్చింది. ఇద్దరూ కలసి డిండి పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిండ్రు. అన్ని విషయాలు పోలీసోళ్లకు చెప్పిన్రు. మా అమ్మ నాకు చిన్న వయసులోనే పెళ్లి చేస్తోందని కేసు పెట్టిన. గవర్నమెంటోళ్లు ఇక్కడికి తీసుకొచ్చిండ్రు. నేను మా ఊరికెళ్లి చదువుకుంటా. ఇప్పుడే పెళ్లి చేసుకోను. ప్రభుత్వ ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషించాలని ఉంది.
 
అమ్మ దగ్గరికి వెళ్లను..
నేను ఇక అమ్మ దగ్గరికి వెళ్లను. పత్తి మిల్లులో పెట్టిందని నాకు అమ్మంటే కోపం. మొన్న మా అమ్మ పోలీస్‌స్టేషన్‌కు వచ్చింది కానీ మాట్లాడలేదు. తమ్ముడితో కూడా మాట్లాడలేదు. తాత దగ్గర్నే ఉంట. మా తాత మంచిగ చూసుకుంటడు. నన్ను చదివిస్తడు. నానమ్మ కూడా ఉంది. వాళ్ల దగ్గర ఉండి చదువుకుని ప్రభుత్వ ఉద్యోగం వచ్చినంక పెళ్లి చేసుకుంట. అప్పటి వరకు పెళ్లి ముచ్చటే లేదు. ఉద్యోగం వచ్చేదాకా చదువుకుంట.
 
 ఆ పైసలిప్పిస్తే పెళ్లికి అక్కరొస్తయ్: అంజయ్య, అంజలి తాత
 నా కోడలు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్లిపోయింది. నేనే ఈ బిడ్డను సాకి పెద్ద చేసిన. మళ్లొచ్చి పిల్లను తీస్కపొయింది. మిల్లుల పనికి పెట్టింది. మేం బోయినా చూపలే. పండుగలకు కూడా తోలలే. అంజలి నాన్న చనిపోయిన ప్పుడు రూ.30 వేలొస్తే అవి కూడా నా కోడలే తీసుకుంది. ఇప్పుడు అంజలికి మిల్లోళ్లు ఇయ్యాల్సిన పైసలిప్పిస్తే బ్యాంకులో వేసుకుంటం. గవర్నమెంటోళ్లనే బ్యాంకుల వేయమనండి. నా మనమరాలి పెళ్లికి అక్కరొస్తయ్. నేనే నా మనమరాలిని తీసుకపోతా.
 
 40 మంది బాల కార్మికులకు విముక్తి
 ఆమనగల్లు/కల్వకుర్తి: మహబూబ్‌నగర్ జిల్లా ఆమనగల్లు, కల్వకుర్తిలోని సూర్యలక్ష్మి, సూర్యలత కాటన్‌మిల్లుల్లో పనిచేస్తున్న 40 మంది బాల కార్మికులను శుక్రవారం స్థానిక పోలీసుల సహకారంతో ఆపరేషన్ స్మైల్ టీం సభ్యులు గుర్తించారు. ఆమనగల్లులోని సూర్యలక్ష్మి కాటన్‌మిల్లులో 17 మంది, సూర్యలత కాటన్‌మిల్లులో 23 మంది బాలలను గుర్తించారు. వీరంతా బిహార్, జార్ఖండ్, ఒడిశా,  వైజాగ్, శ్రీకాకుళం తదితర ప్రాంతాలకు చెందినవారు. వారిని జిల్లా కేంద్రంలోని బాలసదన్‌కు తరలించారు. పోలీసులు ఆయా మిల్లుల యాజమాన్యాలపై కేసు నమోదు చేశారు. ఈ రెండు మిల్లులు అన్నదమ్ములివిగా సమాచారం.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement