అంబులెన్స్ రాకపోవడంతో రోడ్డుపై వేచి ఉన్న క్షత్రగాత్రులు
హైదరాబాద్: జీడిమెట్ల పారిశ్రామికవాడలో శుక్రవారం భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఐడీఏ జీడిమెట్ల ఎస్వీ కో–ఆపరేటివ్ సొసైటీలోని స్యూటిక్ ఫార్మా కంపెనీలో బాయిలర్ పేలడంతో ఏడుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఉదయం 6 గంటలకు 8 మంది కార్మికులు మొదటి షిఫ్ట్ విధులకు హాజరయ్యారు. బాయిలర్ నుండి బయటకు వస్తున్న ఘాటైన రసాయనాలను డ్రమ్ముల్లో నింపుతుండగా ఒక్కసారిగా బాయిలర్ పేలింది. దీంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. భారీగా మంటలెగిసిపడటంతో కుమారస్వామి(39), సుభాష్‌నగర్‌కు చెందిన కొమర సింహాచలం(34), సమీద్ కుమార్(19), బండి శ్రీనివాస్(38), సూరారం రాజీవ్ గృహకల్పకు చెందిన నరహరి(20), ఆవ్రేన్(40), నాగ్(20) అనే కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. నాగ్ మినహా మిగతావారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు.
గాలిలోకి ఎగిరిపడిన డ్రమ్ములు
మంటల తాకిడికి పరిశ్రమలోని డ్రమ్ములు ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి జనావాసాల మధ్య పడ్డాయి. దీంతో పరిశ్రమకు ఆనుకుని ఉన్న గంపలబస్తీవాసులు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. పక్కనే ఉన్న రీ సైక్లింగ్ పరిశ్రమ, విజయశ్రీ కెమికల్స్, సత్య ఫ్యాబ్రికేషన్స్‌లో సైతం మంటలు చెలరేగడంతో సిబ్బంది, స్థానికులు నీళ్లు చల్లి అదుపు చేశారు. అగ్నిమాపక సిబ్బంది మూడు గంటలపాటు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.
గంట వరకు పత్తాలేని అధికారగణం..
ప్రమాదం జరిగిన గంట వరకు కూడా పరిశ్రమలు, పీసీబీ, జీహెచ్‌ఎంసీ అధికారులు, సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకోలేదు. జీడిమెట్ల ఫైర్ సిబ్బంది తొలుత అక్కడికి చేరుకున్నా ఇంజన్‌లో నీళ్లు సరిపడాలేక ట్యాంకర్‌లు వచ్చేవరకు వేచి ఉండాల్సి వచ్చింది.
ప్రాణాలతో బయటపడ్డా...
‘ముందుగానే ప్రమాదాన్ని పసిగట్టి పరుగు తీశాను. అందరికంటే ముందు పరుగులు తీయడంతో నేను ప్రాణాలతో బయట పడ్డా. నేను చెప్పినట్లు వినుంటే మిగతా కార్మికులు కూడా బయటపడేవారు. నాకు ఇది పునర్జన్మగా భావిస్తున్నా’ అని నాగ్ అనే కార్మికుడు తెలిపాడు.
మీకు దండం పెడతాం.. ఆస్పత్రికి తీసుకెళ్లండి..
ప్రమాదంలో గాయపడిన కార్మికులు ఎలాగోలా లేచి హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు. తమను ఆస్పత్రికి తీసుకెళ్ల మంటూ కనబడ్డవారినల్లా వేడుకున్నారు. అయితే, 108 అంబులెన్స్ క్షత్రగాత్రుల వద్దకు చేరుకునేందుకు ఆలస్యం కావడంతో వారి వేదన వర్ణనాతీతం.బాధిత కుటుంబసభ్యులు వారి వద్దకు వచ్చి కన్నీరుమున్నీరుగా విలపించడం అక్కడివారిని కలచి వేసింది.
Comments
Please login to add a commentAdd a comment