
హన్మకొండ సుబేదారిలోని రోహిణి ఆస్పత్రిలో సోమవారం జరిగిన అగ్ని ప్రమాదంతో రోగులు, వారి బంధువులు ఆస్పత్రి సిబ్బంది భయంతో పరుగులు తీశారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు వచ్చారు. కాగా ప్రమాదం జరిగిన విషయం తెలియగానే డిప్యూటీ సీఎం, పలు రాజకీయ పార్టీ నేతలు, అధికారులు ఆస్పత్రిని సందర్శించి సహాయ సహకారాలు అందించారు.
హన్మకొండ చౌరస్తా: హన్మకొండ సుబేదారిలోని రోహిణి ఆస్పత్రిలో జరిగిన అగ్నిప్రమాదంతో రోగులు, బంధువులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వైద్యసేవల కోసం వచ్చిన రోగులకు కనీసం స్ట్రెచర్ కూడా కరువైంది. దీంతో వారిని వీల్‌చైర్లు, బెడ్‌లోనే పడుకోబెట్టగా రోగి బంధువులు సెలైన్ బాటిల్‌ను పట్టుకున్నారు. దట్టమైన పొగతో శ్వాస పీల్చుకోవడం కష్టంగా మారడం, బయటకు వచ్చేందుకు ఎమర్జెనీ ద్వారం తెరుచుకోకపోవడంతో అద్దాలను ధ్వంసం చేశారు. భయానక వాతావరంణలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీసేక్రమంలో రోగులు, వారి బంధువులు తెచ్చుకున్న నగదు, విలువైన వస్తువులను అక్కడే వదిలేసి పరుగులు తీశారు. రోజు వారిగా మందులు వేసుకోవాల్సిన రోగులకు అవస్థలు తప్పలేదు. ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరగడంతో ఆస్పత్రి ఆవరణలో ఎక్కడా చూసిన జనం హాహాకారాలు, రోదనలు మిన్నంటాయి. ఊహించని ఘటనతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఘటన విషయాన్ని తెలుసుకున్న జనం ఆస్పత్రి వద్దకు జనం పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఈ క్రమంలో తోపులాట చోటుచేసుకుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను ఇతర ఆస్పత్రుల్లో చేర్చేందుకు అంబులెన్స్‌కు హుటాహుటిన ఆస్పత్రి ప్రాంగణానికి చేరుకున్నాయి. అప్రమత్తమైన పోలీసులు నక్కలగుట్ట కాళోజీ జంక్షన్ నుంచి రోహిణీ ఆస్పత్రి వైపు వెళ్లే వాహనాలను మళ్లీంచారు. మరోవైపు కలెక్టర్ నుంచి సర్యూ్కట్ గెస్ట్ హౌస్ రోడ్డుకు వాహనాలను మళ్లించారు. అంబులెన్స్‌లు సులువుగా వెళ్లేందుకు ట్రాఫిక్‌ను అదుపులోకి తీసుకొచ్చారు.
ప్రమాదం ఎలా జరిగిందంటే..
వరంగల్ క్రైం: రోహిణి ఆస్పత్రిలో బుధవారం సాయంత్రం 5.10 గంటలకు జరిగిన అగ్ని ప్రమాదం ఆక్సిజన్ సిలిండర్లు పేలడం వల్లే జరిగిందని ఆస్పత్రి వర్గాలు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఆస్పత్రిలోని రెండో అంతస్తులో రెండు ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. ఇందులో న్యూరో విభాగానికి సంబంధించి మధ్యాహ్నం 2 గంటల తరువాత ఒక ఆపరేషన్ పూర్తయింది. రెండో ఆపరేషన్ చేస్తుండగా సాయంత్రం 5.10 గంటల సమయంలో ఆపరేషన్ థియేటర్‌లో పెద్ద శబ్ధం వచ్చింది. ఒక్కసారిగా ఆపరేషన్ చేస్తున్న డాక్టర్ సంజయ్‌తో పాటు సిబ్బంది ఉలిక్కి పడ్డారు. అప్పటికే మంటలు వస్తుండంతో పేషెంట్‌ను సిబ్బంది సహాయంతో కిందికి పరుగులు తీశారు. ఆ మంటలు పక్కనే ఉన్న మరో ఆపరేషన్ థియేటర్‌లోకి వ్యాపించాయి. మంటలతో పాటు పొగ పెద్ద ఎత్తున గదుల్లోకి వ్యాపించడం వల్ల రెండో థియేటర్‌లో కాలుకు ఆపరేషన్ చేస్తున్న డాక్టర్లు పేషెంట్‌ను అక్కడే వదిలి పరుగు పెట్టారు.
ఆక్సిజన్, నైట్రస్ ఆక్సైడ్ పేలడం వల్లే...
ఆపరేషన్ థియేటర్‌కు సప్లయి అయ్యే ఆక్సిజన్ సిలిండర్ పేలడం వల్లే ప్రమాదం జరిగిందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. బెడ్లపై ఉన్న దుప్పట్లు తొందరగా అంటుకోవడం వల్ల మంటలు క్షణాల్లో ఇతర గదులకు వ్యాపించాయి. ప్రమాదం జరిగిందని తెలియగానే పేషెంట్లు, వారి బంధువులు, సిబ్బంది ఒక్కసారిగా పరుగు తేసే క్రమంలో భయంతో ఒకరినొకరు తోసుకుంటూ కిందికి వెళ్లారు. ఆపరేషన్ థియేటర్ పక్కనే ఉన్న మెట్ల దగ్గర గిల్స్‌కు తాళం వేసి ఉన్నట్లు తెలిసింది.
నా భర్త మంటల్లో ఉన్నాడు..
వరంగల్ క్రైం: సంఘటన స్థలంలో మొదటి నుంచి చివరి వరకు రోదిస్తూ... నా భర్త ఆపరేషన్ థియేటర్ మంటల్లో ఉన్నాడు కాపాడండి అంటూ చిట్యాల మండలం వెంకట్రావ్‌పల్లి గ్రామంకు చెందిన జెట్టి లక్ష్మి రోదించింది. ఆ పరేషన్ థియేటర్‌లో ఉండి మరణించిన జట్టి కుమారస్వామికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నా రు. కాలుకు గాయం కావడంతో ఆస్పత్రికి తీసుకొచ్చమని... యాజమాన్యం నిర్లక్ష్యంతో తన భర్త ప్రాణాలు కోల్పోపోయాయని ఆమె రోదించిన తీరు అక్కడున్న వారిని కలచివేసింది. తనకు న్యాయం చేయాలని ఆమె అందరినీ వేడుకుంది.
వెంకట్రావుపల్లిలో విషాదం..
చిట్యాల(భూపాలపల్లి): జెట్టి కుమారస్వామి(40) మృతి చెందడంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం వెంకట్రావుపల్లిలో విషాదం చోటుచేసుకుంది. మృతుడికి భార్య లక్ష్మి, కుమార్తెలు మమత, మౌనిక, మానస ఉన్నారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. కాగా జెట్టి కుమారస్వామి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాత్రి 11.40 గంటల ప్రాంతంలో ఎంజీఎంకు తరలించారు.
ఎంజీఎం తరలించే లోపే..
ఎంజీఎం/కాటారం: రోహిణి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వృద్ధురాలిని ఎంజీఎంకు తరలించే లోపు మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి... ఈ నెల 14న తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న భూపాలపల్లి జిల్లా కాటారం మండలం దేవరపల్లి గ్రామానికి చెందిన రత్న మల్లక్క(65) రోహిణి ఆస్పత్రిలో అడ్మిట్ అయింది. సోమవారం ఆస్పత్రిలో మంటలు వ్యాపించి అగ్ని ప్రమాదానికి గురైన ఘటనతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను వారి బంధుమిత్రులు, ఆస్పత్రి సిబ్బంది వేర్వేరు ఆస్పత్రులకు తరలించారు. ఈ క్రమంలో మల్లమ్మ అనే వృద్ధురాలిని ఆస్పత్రికి తీసుకురాగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్దారించారు. పలువురు చికిత్స పొందుతున్నారు.
మా అమ్మను మూడో అంతస్తు నుంచి తీసుకొచ్చా..
హన్మకొండ అర్బన్: మా అమ్మ లెల్లమ్మను శనివారం ఆస్పత్రిలో చేర్పించాం. సోమవారం ప్రమాద ఘటన తెలియగానే ఒక్కసారిగా ఏమీ తోచలేదు. ఒకరిని ఒకరు పట్టించుకునే పరిస్థితి లేదు. అంతా అరుపులు, ఉరుకుల పరుగులతో భయానకరంగా తయారైంది. నేను వెళ్లి వీల్ చైర్ తీసుకొచ్చి మా అమ్మను కిందకి తీసుకొచ్చ. సామగ్రి అన్నీ అక్కడే వదిలేసి వచ్చాం. ప్రాణాలు కాపాడుకుంటే చాలనుకునే పరిస్థితి ఉంది.
- తహసీల్దార్ శ్రీనివాస్, అర్బన్ కలెక్టరేట్
ఆస్పత్రిలో రెవెన్యూ సిబ్బంది సేవలు
హన్మకొండ అర్బన్: ఆస్పత్రిలో ప్రమాదం విషయం తెలియగానే వరంగల్ ఆర్డీఓ వెంకారెడ్డి, హన్మకొండ తహసీల్దార్ కిరణ్‌ప్రకాష్‌తోపాటు ఆర్‌ఐ సరిత సంఘటనా స్థలానికి చేరుకుని కలెక్టరేట్ జేసీలకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేశారు. బాధితులను తరలించడంలో సేవలందించారు.
ఘటనపై సమగ్ర విచారణ
హన్మకొండ: రోహిణి ఆస్పత్రిలో జరిగిన ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ చేపట్టనున్నట్లు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చెప్పారు. ఆస్పత్రిలో జరిగిన ప్రమాదం సమాచారం అందుకున్న కడియం శ్రీహరి ఆస్పత్రికి చేరుకున్నారు. వరంగల్ పోలీసు కమిషనర్ జి.సుధీర్‌బాబు, ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుధాకర్‌రెడ్డిని సంఘటనను జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రోహిణి ఆస్పత్రిలో 199 మంది రోగులు చికిత్స పొందుతున్నారన్నారు. 198 మందిని హుటాహుటిని నగరంలోని ఇతర ఆస్పత్రుల్లోకి తరలించారన్నారు. అందులో ఒక రోగి పరిస్థితి విషమంగా ఉందన్నారు. ఆస్పత్రిలో జరిగిన సంఘటన వివరాలపై విచారణ జరుపుతామన్నారు. రోగులకు సరైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.
రోగులను ఇతర ఆస్పత్రులకు తరలించాం...
కలెక్టర్ అమ్రపాలి కాట
హన్మకొండ: ప్రమాదం జరుగగానే రోగులను వెంట వెంటనే ఇతర ఆస్పత్రుల్లోకి తరలించామని జిల్లా కలెక్టర్ అమ్రపాలి కాట అన్నారు. రోహిణి సంఘటన జరిగిన సమాచారం అందుకున్న కలెక్టర్ అమ్రపాలి రోహిణికి చేసుకుని సంఘటన పై జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, రోహిణి ఆస్పత్రి వర్గాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరంగల్ నగరంలోని 40 వరకు ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్ ఉన్న ఆస్పత్రులు, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చేర్పించామన్నారు. జిల్లాలోని ఆస్పత్రులను తనిఖీ చేసి భద్రతా ఏర్పాట్లను పరీక్షించనున్నట్లు తెలిపారు. సంఘటన జరిగిన సమయంలో ఆస్పత్రిలో 193 మంది రోగులున్నారన్నారు. వీరందరికీ వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment