ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న పసిపాప
సాక్షి, సిటీబ్యూరో: ప్రమాదాలు జరిగినప్పుడే హడావుడి చేయడం, ఆపై విస్మరించడం బల్దియాకు పరిపాటిగా మారింది. నగరంలో ఫైర్ సేఫ్టీ లేని సంస్థలపై చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోంది. తాజాగా సోమవారం ఎల్‌బీనగర్‌లోని షైన్ చిల్డ్రన్ ఆస్పత్రిలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. ఇక్కడ షార్ట్ సర్క్యూట్‌తో ఇంక్యుబేటర్ పేలి మంటలు చెలరేగడంతో ఐదుగురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఓ చిన్నారి మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఆస్పత్రి భవనంలో ఎలాంటి ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు లేకపోవడంతోనే దుర్ఘటన జరిగిందని, దీనికి సెట్‌బ్యాక్ కూడా లేదని తేలింది. ఈ ఒక్క ఆస్పత్రిలోనే కాదు.. నగరంలోని చాలా హాస్పిటల్స్‌లోనూ అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లు లేవు. సిటీలో మొత్తం 1,600లకు పైగా ఆస్పత్రులు ఉండగా... అసలు వాటిలో ఎన్నింటికి ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లున్నాయనే లెక్కలు జీహెచ్‌ఎంసీ దగ్గర కూడా లేవంటే పరిస్థితిని అంచనా వేసుకోవచ్చు. ఆస్పత్రులు, వాణిజ్య భవనాలు, విద్యాసంస్థలు, బార్లు తదితర రద్దీ ఎక్కువగా ఉండే వాటిలో ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు చేయడంతో పాటు ప్రతిఏటా రెన్యూవల్ చేయించుకోవాలి. కానీ వీటికి సంబంధించి జీహెచ్‌ఎంసీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
దాదాపు 50 వేలు
గ్రేటర్ పరిధిలో ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు చేసుకోవాల్సిన భవనాలు దాదాపు 50వేలు ఉన్నాయి. నిర్మాణ అనుమతితో పాటే ప్రొవిజనల్ ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు చేసుకోవడం గతంలో తప్పనిసరిగా ఉండేది. జీహెచ్‌ంఎసీ 6–15 మీటర్ల ఎత్తు వరకు వాణిజ్య భవనాలకు, 18 మీటర్ల ఎత్తు వరకు నివాస భవనాలకు ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లున్నాయో లేదో పరిశీలిస్తుంది. అంతకంటే ఎక్కువ ఎత్తున్న భవనాలను రాష్ట్ర ఫైర్ సర్వీసెస్ విభాగం చూస్తుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని వాటికి నిర్మాణ సమయంలోనే ప్రొవిజనల్ ఫైర్ సేఫ్టీ అవసరం లేదని పాత నిబంధన సవరించినట్లు సంబంధిత అధికారి తెలిపారు. నిర్మాణాలు పూర్తయ్యాక సైతం ఫైర్ సేఫ్టీ తీసుకుంటున్నవారు అత్యల్పంగా మాత్రమే ఉన్నారు. ఇక ఏటేటా రెన్యూవల్స్ గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు.
ప్రకటనలకే పరిమితం
గ్రేటర్‌తో పాటు దేశంలోని ఇతర ముఖ్య నగరాల్లో భారీ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు నివారణకు కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు ఎప్పటికప్పుడు ప్రకటిస్తున్నప్పటికీ... ఆచరణకు మాత్రం నోచుకోవడం లేదు. ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు లేని వాటి అనుమతులు రద్దు చేయించే అంశాన్ని సైతం ఆరేడేళ్ల క్రితం పరిశీలించినప్పటికీ... ఆ తర్వాత విస్మరించారు. ఫైర్ సేఫ్టీ తనిఖీల సమయంలోనే భవన నిర్మాణ అనుమతి, ట్రేడ్ లైసెన్సు, ఆస్తి పన్ను చెల్లింపు తదితర అంశాలనూ పరిశీలించాలని దాదాపు ఏడాదిన్నర క్రితం నిర్ణయించారు.
నిబంధనలతోనే...
నగరంలో 2009 కంటే ముందు నిర్మించిన స్కూళ్లకు ఫైర్ సేఫ్టీ ఎన్‌ఓసీ అవసరం లేదని, యాజమాన్యాలు స్వీయ ధ్రువీకరణలను డీఈఓకు అందజేస్తే సరిపోతుందనే జీవో ఉందని సంబంధిత అధికారి తెలిపారు. అలాగే 2009 తర్వాత నిర్మించిన వాటికి సైతం చుట్టూ 6 మీటర్ల సెట్‌బ్యాక్ ఉంటేనే ఫైర్ సేఫ్టీ ఎన్‌ఓసీ ఇవ్వాలనే నిబంధన ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో స్కూళ్లలో ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లపై పెద్దగా శ్రద్ధ చూపడం లేదు.
సిబ్బంది లేమి..
వాణిజ్య భవనాల్లో ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లపై తనిఖీలు చేయాలని మున్సిపల్ పరిపాలన ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్‌కుమార్ ఫిబ్రవరిలో జీహెచ్‌ఎంసీని ఆదేశించారు. ఫైర్ సేఫ్టీ విభాగంలో జీహెచ్‌ఎంసీకి తగిన యంత్రాంగం లేకపోవడంతో ఆ పని పూర్తి కాలేదు. ఎంసీహెచ్‌గా ఉన్నప్పుడు మంజూరైన పోస్టులు తప్ప.. ఆ తర్వాత పెరగనేలేదు. ఇద్దరు డీఎఫ్‌ఓలు, ఐదుగురు ఎస్‌ఎఫ్‌ఓలకు ఇద్దరు మాత్రమే ఉన్నారు. అడిషనల్ డైరెక్టర్ పోస్టు ఖాళీగానే ఉంది. ఈ విభాగం బాధ్యతలను ఈవీడీఎం డైరెక్టర్‌కు అప్పగించాక, తొలి దశలో బార్లు, పబ్బులపై దృష్టిసారించారు. ఆస్పత్రుల తనిఖీలు మలిదశలో చేయాలని భావిస్తున్నారు.
దశలవారీగా తనిఖీలు..
ఈవీడీఎం విభాగానికి ఫైర్ సేఫ్టీ బాధ్యతలు అప్పగించాక దశల వారీగా చర్యలు తీసుకుంటున్నాం. అందులో భాగంగా తొలిదశలో బార్లు, పబ్‌లకు నోటీసులు జారీ చేశాం. రెండో దశలో స్కూళ్లు, మూడో దశలో ఆసత్రులకు నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకోవాలనుకుంటున్నాం. అంతలోనే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఫైర్ సేఫ్టీ లేని ఆస్పత్రిపై కఠిన చర్యలు తీసుకుంటాం. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు నగరంలో ఎన్ని ఆస్పత్రులకు ఫైర్ సేఫ్టీ లేదో తెలుసుకునేందుకు శనివారం నుంచి డాక్యుమెంట్ల పరిశీలన చేపట్టి 10–15 రోజుల్లో పూర్తి చేస్తాం. ఏర్పాట్లు చేసుకునేందుకు తగిన సమయం, అవసరమైన వారికి సామగ్రి సమకూర్చే చర్యలు కూడా చేపడతాం. అప్పటికీ తగిన ఏర్పాట్లు చేసుకోని వారిపై కఠిన చర్యలు తప్పవు. ఇంత పెద్ద నగరంలో అన్నింటిలో తనిఖీలు ఒకేసారి సాధ్యం కాదు. అందుకే దశలవారీగా ప్రణాళిక రూపొందించాం. ఒకసారి రంగంలోకి దిగాక తూతూమంత్రంగా కాకుండా పటిష్టంగా అమలు చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ అగ్నిమాపక అనుమతుల విషయంపై విచారణ చేస్తాం. – విశ్వజిత్ కాంపాటి, ఈవీడీఎం డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment