సాక్షి, హైదరాబాద్: ఎల్బీనగర్‌లోని షైన్ ఆస్పత్రి యాజమాన్యం అడుగడుగునా నిబంధనల్ని ఉల్లఘించినట్లు రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ స్వరాజ్యలక్ష్మి బృందం గుర్తించింది. భవనంతో సహా అందులోని వార్డులు, ఐసీయూ విభాగాలు పూర్తిగా లోపభూయిష్టంగా ఉన్నాయని తేల్చింది. ఈ మేరకు ప్రభుత్వానికి గురువారం ఆమె తుది నివేదికను అందజేశారు. ఘటన తర్వాత మంగళవారం ఎల్బీనగర్ పోలీసుల సహకారంతో ఆస్పత్రిలో వైద్య ఆరోగ్యశాఖ అధికారుల బృందం తనిఖీ నిర్వహించింది.
సెల్లార్ సహా జీ+3తో కూడిన ఈ భవనం లో అత్యవసర ద్వారం లేకపోవడమే కాకుండా ప్రమాదం జరిగిన మూడో అంతస్తు పైకప్పు నిబంధనలకు విరుద్ధం గా థర్మాకోల్ షీట్స్‌తో ఏర్పాటు చేసినట్లు గుర్తిం చింది. 20 పడకలకు అనుమతి పొందిన ఈ ఆస్పత్రిలో అనధికారికంగా 58 పడకలు ఏర్పాటు చేసినట్లు నివేదికలో పేర్కొంది. 12 ఇంక్యూబేటర్లు, రెండు ఫొటో థెరపీ యూనిట్లు ఉండగా.. వీటిలో ఆరు ఇంక్యూబేటర్లు, రెండు ఫొటో థెరపీ యూనిట్లు పాడైపోయినట్లు గుర్తించింది. ఇప్పటి వరకు ఫైర్‌మాక్ డ్రిల్స్ నిర్వహించిన దాఖలాలు కూడా లేనట్లు పేర్కొంది.
సీఈఐజీ ప్రాథమిక విచారణ
నిర్వహణ లోపం వల్లే రిఫ్రిజిరేటర్‌లో పేలుడు సంభవించి షైన్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగినట్లు తెలంగాణ ప్రధాన విద్యుత్ తనిఖీ అధికారి కార్యాలయం(సీఈఐజీ) ధృవీకరించింది. ఎల్బీనగర్‌లోని షైన్ ఆస్పత్రిని సీఈఐజీ అధికారులు తనిఖీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదికను అందజేయనున్నట్లు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment