
గ్యాస్ పైప్ లైన్ లీక్.. ఎగిసిన మంటలు
సదాశివపేట/ పటాన్‌చెరు: మద్దికుంట గ్రామానికి ఆనుకుని నిర్మించిన రిలయన్స్ గ్యాస్ మాన్యువల్‌లో సోమవారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో మాన్యువల్ నుంచి గ్యాస్ లీకై మంటలు ఎగిసి పడడంతో అధికారులు గ్రామ ప్రజలు భయందోళనకు గురయ్యారు. అధికారుల ద్వారా సమాచారం అందుకున్న డీఎస్పీ తిరుపతన్న తెల్లవారు జామున 3.30 గంటలకల్లా గ్రామానికి చేరుకుని ఉదయం 10 గంటలకు వరకు అక్కడే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు జిల్లా ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకువచ్చారు.
జిల్లా ఎస్పీ సుమతి ఘటనా స్థలానికి చేరుకుని గ్యాస్ లీకైన విషయం గురించి రిలయన్స్ గ్యాస్ ప్రతినిధులు, పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సంఘటన స్థలానికి చేరుకున్నారు.
గాల్లోకి గ్యాస్ విడుదల..
సదాశివపేటలోని మద్దికుంట వద్ద జరిగిన రిలయన్స్ గ్యాస్ పైప్‌లైన్‌లో చెలరేగిన మంటలను నియంత్రించేందుకు పటాన్‌చెరు మండలం ఐనోల్ వద్ద ఉన్న ఆ పైప్‌లైన్ జంక్షన్ వద్ద గ్యాస్‌ను గాల్లోకి వదిలారు. సోమవారం ఉదయం 5.30 గంటల నుంచి 9.30 గంటల వరకు గ్యాస్‌ను గాలిలోకి వదిలారు. పటాన్‌చెరు నుంచి సదాశివపేట వద్ద గ్యాస్ విస్ఫోటన జరిగిన ప్రాంతానికి సరిగ్గా 37 కిలోమీటర్లు దూరం ఉందని రిలయన్స్ పైప్ లైన్ ఇంజినీర్ తెలిపారు. 48 ఇంచుల డయాతో ఉన్న పైప్‌లైన్ ఉన్న గ్యాస్ అంతా విడుదల చేశామన్నారు.
ఆ సమయంలో దాదాపు ఓ బోర్‌వెల్ వేసేటప్పుడు వచ్చే శ బ్దంలా వినిపించింది. విడుదల చేసిన గ్యాస్ ఆకాశాన్ని తాకింది. దీంతో పరిసర గ్రామాల్లోని ప్రజలు వణికిపోయారు. గ్యాస్ లీకైందనే పుకార్లు పుట్టాయి.. ఆ సూచనలతో ఆ ప్రాంతంలో చాలా మంది ఆందోళన చెందారు. ఉదయం పూట పిల్లలను స్కూల్‌కు పంపాలా వద్దా?, అని ఆలోచించాల్సి వచ్చిం ది. టిఫిన్‌లు, వంటలు చేసేందుకు కూడా భయపడ్డారు. ఆ ప్రాంతంలో దగ్గరే ఉన్న ఇటుకబట్టీల వారిని అగ్గిపుల్ల వెలగించరాదని రిలయన్స్ సెక్యూరిటీ సిబ్బంది సూచిం చారు. గ్యాస్ విడుదల ప్రక్రియ అయిదు గంటల పాటు సాగింది. ఐనోల్ వద్ద జంక్షన్‌లో ఉన్న వాల్వును తె రిచి గ్యాస్‌ను గాల్లోకి వదిలారు.
మాన్యువల్‌ను తరలించాలి..
రిలయన్స్ గ్యాస్ మాన్యువల్‌ను తమ గ్రామం నుంచి ఇతర ప్రాంతానికి తరలించాలని మద్దికుంట గ్రామస్తులు మాన్యువల్ వద్ద ధర్నా చేసి ఆందోళనకు దిగారు. రాత్రి నుంచి తాము చాల భయాందోళనకు గురికావాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. డీఎస్పీ తిరుపతన్న, ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌నాయుడు అందోళకు దిగిన ప్రజలను సముదాయించి నచ్చజేప్పడంతో అందోళన విరమించారు.
పరుగో పరుగు....
గ్యాస్ జంక్షన్‌కు సమీపంలో ఉన్న ఇటుకబట్టీల్లో వందలాది మంది కార్మికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగు పెట్టారు. ఉదయం గ్యాస్ విడుదల సందర్భంగా వచ్చిన శబ్దం భారీగా ఉండటంతో వారు భీతిల్లిపోయారు. తొలుత వారు నిద్రలో ఉండగా రిలయన్స్ సెక్యూరిటీ వారు పెద్ద శబ్దంతో వారిని అప్రమత్తం చేశారు. ఆ తరువాత గ్యాస్ విడుదల కాగానే ఆ ప్రజలు తమ గుడిసెలు వదిలిపెట్టి పరుగు పెట్టారు. మండల పరిధిలోని ఐనోల్‌తో పాటు ఇంద్రేశం, పెద్ద కంజర్ల, చిన్న కంజర్ల, జిన్నారం మండలం అండూర్ వరకు గ్యాస్ శబ్దం వినిపడింది.
ప్రతి 33 కిలోమీటర్లకు ఒక మాన్యువల్..
కాకినాడ కేజీ బేసిన్ నుంచి గుజరాత్‌లోని భరిష్‌పూర్ వరకు గ్యాస్ పైప్‌లైన్ 1400 కిలోమీటర్ల వరకు ఉంది. ప్రమాదాలు చోటుచేసుకుంటే నివారించడానికే ప్రతి 33 కిలోమీటర్ల వద్ద గ్యాస్ మాన్యువల్ ఏర్పాటు చేశాం. అత్యాధునిక సాంకేతిక టెక్నాలజీ పరిజ్ఞానంతో గ్యాస్ సరఫరా చేస్తున్నాం. గ్యాస్ లీకై మంటలు చెలరేగినందు వల్ల వాటిని అదుపులోకి తీసుకువచ్చేందుకు పటాన్‌చెరువు మండలం ఇంద్రేశం గ్రామం వద్ద ఉన్న గ్యాస్ సరఫరాను నిలిపివేశాం. అదే విధంగా కోహిర్ మండలం మదిర గ్రామం వద్ద ఉన్న మాన్యువల్ వద్ద కూడా గ్యాస్ నిలిపివేసి పైపుల్లో మిగిలిఉన్న గ్యాస్‌ను వెంటిలేషన్ ద్వారా గాలిలోకి వదిలివే శాం. దాంతో మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి.
- ఏరియా మేనేజర్ వెంకటేశ్వర్‌రెడ్డి
చచ్చేంత భయమేసింది
గ్యాస్‌లీకై మంటలు ఎగిసిపడ్డాయి. చచ్చేంత భయమేసింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్లు విడిచి ముందు ప్రాణాలు దక్కించుకుందామని ఊరి బయటకు వెళ్లిపోయి తెల్లవారే వరకు భయంతో గడిపాం.
-భాగ్యమ్మ, మద్దికుంట
బర్రెలు అరిచాయి
జంక్షన్‌కు పక్కనే ఉన్న పొలం నాదే. పైప్‌లైన్ వేసేట ప్పుడే వద్దన్నాం. ఈయాల (సోమవారం) తెల్లారకముందే బర్రెలు లేచి అరుస్తున్నాయి. నాకు బర్రెలు ఉన్నాయి. రోజూ పాలు తీస్తాను. కాని అవి నాకంటే ముందే లేచి అరుస్తున్నాయి. గ్యాస్‌లీకైన సంగతి తెల్వలే.
- బాల్‌రాజ్, ఐనోల్
వాసన కూడా వచ్చింది
గ్యాస్ విడుదలైనప్పుడు చాలా శబ్దం వచ్చింది. వాసన కూడా ఉంది. మంటలు వస్తాయని భయ పడ్డాం. ఆకాశమంత ఎత్తున గ్యాస్ తెల ్లగా పోతూ కనిపించింది. పిల్లలను స్కూల్‌కు కూడా కొందరు పంపలేదు. - పురుషోత్తం, ఇంద్రేశం
పరుగు పెట్టాం
కూలీలంతా భ్యార్యా పిల్లలతో కలిసి భయపడి పరుగు పెట్టారు. అంతా కలిసి చేరో గ్రామానికి పోయాం. కొందరు చిన్న కంజర్లకు, మరి కొందరు కాలేజీవైపుకు, ఇంద్రేశంకు పారిపోయాం.
- హరి, ఇటుక బట్టీ మున్షీ, ఐనోల్