మెదక్: ఓ ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సు అగ్నికి ఆహుతైన ఘటన జిల్లాలోని జహీరాబాద్ మండలం చిరాక్ పల్లి వద్ద సోమవారం ఉదయం చోటు చేసుకుంది. ముంబై నుంచి హైదరాబాద్ కు వస్తున్న సీబీఆర్ ట్రావెల్స్ కు చెందిన బస్సు ఇంజన్ లో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. దీంతో మంటల్లో చిక్కుకున్న బస్సు దాదాపు దగ్ధమయ్యింది.
అయితే బస్సు సిబ్బందితో పాటు ప్రయాణికులు ముందుగానే అప్రమత్తంకావడంతో భారీ ప్రమాదం తప్పింది. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడగా, బస్సు మాత్రం మంటలకు ఆహుతైంది. ఈ సమాచారాన్ని అందుకున్న అగ్ని మాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రయాణికులను వేరే బస్సులో తమ గమ్య స్థానాలకు తరలించేందుకు యత్నిస్తున్నారు.