భార్య, కొడుకుతో శివలాల్
సాక్షి, హైదరాబాద్: అతని ఆత్మవిశ్వాసం ముందు అంగవైకల్యం చిన్నబోయింది. కష్టపడేతత్వం ఉండాలే గానీ... ఎన్ని సమస్యలొచ్చినా ఎదురీదొచ్చని నిరూపించాడు అతడు. రాష్ట్రంలో 300 మంది మరుగుజ్జులు ఉండగా, వారిలో డిగ్రీ చేసిన మొట్టమొదటి వ్యక్తిగా ఘనత సాధించారు గట్టిపల్లి శివలాల్(35). జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన శివలాల్ బీకామ్ పూర్తిచేసి, పీజీడీసీఏ చేశాడు. ప్రస్తుతం బంజారాహిల్స్ రోడ్ నెంబర్.1లోని డెక్కన్ ట్రయల్స్ సంస్థలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. మెట్‌పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన శివలాల్... తన కాళ్లపై తాను నిలబడాలనే ఉద్దేశంతో నగరానికొచ్చి ఉద్యోగంలో చేరాడు. సంస్థ ఎండీ ప్రోత్సాహం, సహోద్యోగుల సహకారంతో ఆయన 12 ఏళ్లుగా ఇక్కడే పని చేస్తున్నాడు. శివలాల్.. చిన్మయి అనే మరుగుజ్జు అమ్మాయినే వివాహమాడాడు.
వీరికి ఒక బాబు ఉన్నాడు. ఎంతో కష్టపడి కుటుంబాన్ని పోషిస్తున్న శివలాల్‌కు సొంతిల్లు కూడా లేదు. బంజారాహిల్స్‌రోడ్ నెంబర్.11లోని ఉదయ్‌నగర్‌లో అద్దె ఇంట్లో జీవనం కొనసాగిస్తున్నాడు. తమలాంటి వారిని ప్రభుత్వం ఆదుకోవాలని, ఏదైనా ఉపాధి కల్పించడంతో పాటు డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వాలని శివలాల్ వేడుకుంటున్నాడు.
నడుచుకుంటూ ఆఫీస్‌కు..
ఇంటికి సమీపంలోనే కార్యాలయం ఉండటంతో శివలాల్ రోజూ నడుచుకుంటూనే వెళ్తుంటాడు. దారి పొడవునా తనను చాలా మంది వింతగా చూస్తుంటారని, అవేమీ తాను పట్టించుకోనన్నారు. అయితే ఆఫీస్‌లో సహోద్యోగులంతా తనకెంతో ధైర్యాన్ని ఇస్తారన్నాడు. టైప్ నేర్చుకునేప్పుడు పొట్టివేళ్లు పనికిరావని తిట్టిన నిర్వాహకులకు నిమిషానికి 80–100 పదాలు కొట్టి సవాల్ విసిరాడు. గుండె ధైర్యంతో అన్నింటినీ జయిస్తున్న శివలాల్ ఎక్కడా సిగ్గుపడకుండా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment