నిర్విఘ్నంగా చేప మందు పంపిణీ
* 60 వేల చేపపిల్లల విక్రయాలు
* నేడు, రేపు పాతబస్తీ దూద్‌బౌలిలో చేప ప్రసాదం పంపిణీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్‌గ్రౌండ్స్‌లో చేపప్రసాదం పంపిణీ రెండురోజుల పాటు నిర్విఘ్నంగా కొనసాగింది. సోమవారం రాత్రి 11.45 గంటలకు మృగశిర కార్తె ప్రారంభమవగా... అదేసమయంలో బత్తిని సోదరులు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ప్రారంభించిన చేప మందును మంగళవారం రాత్రి వరకు కొనసాగించారు. వివిధ రాష్ట్రాలతో పాటు దుబాయ్, లండన్, రష్యా, జపాన్ దేశాల నుంచీ పెద్ద ఎత్తున ఆస్తమా రోగులు చేప మందు కోసం తరలివచ్చారు.
మంగళవారం ఉదయం రైళ్లు వచ్చిన సమయంలో జనంసంఖ్య పెరగడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపు చేయడంతోపాటు, బత్తిని సోదరుల వద్దనున్న చేప మందును లాక్కొని ఆస్తమా రోగులకు వేశారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై బత్తిని సోదరులు అసంతృప్తి వ్యక్తం చేశారు. పవిత్రంగా వేయాల్సిన చేప ప్రసాదాన్ని పోలీసులు తీసుకొని వేయడం సరికాదని బత్తిని గౌరీ శంకర్‌గౌడ్ ఆవేదనతో పేర్కొన్నారు.
గత రెండు రోజులుగా 40 కౌంటర్లలో చేపపిల్లలను, 32 కౌంటర్లలో చేప మందును పంపిణీ చేశారు. మంగళవారం రాత్రి వరకు 60 వేల చేపపిల్లలను విక్రయించినట్లు మత్స్యశాఖ అధికారులు వెల్లడించారు. కాగా బుధ, గురు వారాల్లో పాతబస్తీ దూద్‌బౌలిలోని సొంత గృహం వద్ద చేప ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నట్లు బత్తిని సోదరులు తెలిపారు.