వ్యవసాయానికి 5 గంటలే..
ముకరంపుర : వ్యవసాయానికి 5 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా అవుతుందని, వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ వీరబ్రహ్మయ్య ఆదేశించారు. వ్యవసాయ, విద్యుత్, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో కలెక్టరేట్‌లోని సమావేశ మంది రంలో మంగళవారం ఆయన సమీక్షించారు. అవసరానికి కంటే తక్కువగా విద్యుత్ సరఫరా అవుతోందని, 5 గంటలకు మించి ఇవ్వలేమని ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ తెలిపారని కలెక్టర్ చెప్పారు. పంటలు కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రైతులకు సాంకేతిక సలహాలు అందించాలని వ్యవసాయశాఖను ఆదేశించారు.
డివిజన్ స్థాయిలో ఆర్డీవోలు పంటల పరిస్థితి, విద్యుత్ సరఫరా, తాగునీటిపై సమీక్ష నిర్వహిం చాలన్నారు. తాగునీటి ఇబ్బందులు రాకుండా ఎస్సారెస్పీ, ఎల్‌ఎండీల్లో ఉన్న నీరు వచ్చే వేసవి వరకు తాగునీటి సరఫరా కోసమే వినియోగించాలన్నారు. 15 రోజులకోసారి తాగునీటి సరఫరాపై నివేదికలు పంపాలని ఆదేశించారు. పంచాయతీలు బకాయి ఉన్న రూ.70 కోట్ల విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి వర్షాభావ పరిస్థితులపై సూచనలు అందించాలన్నారు. మరమ్మతులో ఉన్న 154 తాగునీటి పథకాల పునరుద్ధరణకు అవసరమైన నిధులు జెడ్పీ, మండల పరి షత్‌ల నుంచి వినియోగించుకోవాలన్నారు. ఏజేసీ టి.నంబయ్య, జేడీఏ ప్రసాద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
‘ఉపాధి’ మొదలెట్టండి
జిల్లాలో వర్షాభావ పరిస్థితులేర్పడుతున్నందున అన్ని గ్రామాల్లో ఉపాధిహామీ పనులు వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ వీరబ్రహ్మయ్య అధికారులను ఆదేశించారు. ఉపాధిహామీ పనులపై కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో అధికారులతో సమీక్షించారు. పనికోసం వలసలు పోకుండా చూడాలన్నారు. 15 రోజుల్లో రెండు లక్షల మంది కూలీలకు పనులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. సెప్టెంబర్ నెలాఖరుకు లక్ష మరుగుదొడ్ల నిర్మాణం పూర్తవుతుందని, మొదలుపెట్టని యూనిట్లను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. సమావేశంలో డ్వామా పీడీ గణేశ్ తదితరులు పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా చర్యలు
జిల్లాలో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను కలెక్టర్ ఆదేశించారు. వైద్యశాఖ అధికారులతో మంగళవారం తన చాంబర్‌లో సమీక్షించారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో జనవరి నుంచి ఇప్పటివరకు 5 మలేరియా కేసులు నమోదయ్యాయని, వ్యాధుల నివారణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో మొత్తం 34 మలేరియా కేసులు నమోదయ్యాయని తెలిపారు. దోమల నివారణకు పారిశుధ్య చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ప్రాథమిక వైద్యకేంద్రాల్లో వైద్యులను అప్రమత్తం చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు జేసీ టి.నంబయ్య, వైద్యారోగ్యశాఖాధికారి, మలేరియా అధికారి తదితరులు పాల్గొన్నారు.