ఇక.. ఫ్లోరైడ్ బాధలకు చెక్
మునుగోడు నియోజకవర్గం నుంచే వాటర్‌గ్రిడ్ పథకం
డిసెంబర్‌లో పైలాన్‌ను
ఆవిష్కరించనున్న సీఎం
జనవరి మొదటివారంలో ప్రారంభం కానున్న పనులు
నీటి సరఫరా విభాగం అధికారుల సమీక్షలో నిర్ణయించిన కేసీఆర్
చౌటుప్పల్ ఎన్నికల ముందు ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టి, ప్రజలకు రక్షిత జలాలను అందిస్తామని హామీ ఇచ్చిన టీఆర్ ఎస్ ఆ దిశగా అడుగులు వేస్తోంది. కరువు కాలంలో నీటి కొరత లేకుండా ప్రజలకు అవసరమైన నీటిని నిల్వ చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్ పథకానికి, రాష్ట్రంలోనే అత్యంత ఫ్లోరైడ్ పీడిత ప్రాంతమైన మునుగోడు నియోజకవర్గం నుంచే శ్రీకారం చుట్టనుంది. సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లో శనివారం నీటి సరఫరా విభాగం అధికారులతో సమీక్షించారు. మునుగోడులో వాటర్‌గ్రిడ్ పైలాన్ ఏర్పాటుకు సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. డిసెంబర్ మాసంలో కేసీఆర్ పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు. జనవరి మొదటి వారంలో రాష్ట్రవ్యాప్తంగా వాటర్‌గ్రిడ్ పనులు ప్రారంభం కానున్నాయి.
నేటికీ అందని రక్షిత జలాలు..
రాష్ట్రంలోనే అత్యంత ఫ్లోరైడ్‌పీడిత ప్రాంతంగా జిల్లా గుర్తింపు పొందింది. డెబ్బైఏళ్లుగా ఫ్లోరైడ్ భూతం పట్టి పీడిస్తోంది. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లవుతున్నా జిల్లావాసులకు తాగేందుకు రక్షిత జలాలు కరువయ్యాయి. నేటికీ సగం మంది విషపు నీటినే తాగుతున్నారు. దాదాపు 5లక్షల మంది బాధితులు ఫ్లోరైడ్ వ్యాధితో సతమతమవుతున్నారు. మునుగోడు నియోజకవర్గంలో అత్యధికంగా ఫ్లోరైడ్ ఉంది. సాధారణంగా నీటిలో ఫ్లోరైడ్ శాతం 0.5పీపీఎం (పార్ట్ పర్ మిలియన్) ఉండాల్సి ఉండగా, ఇక్కడ లభించే నీటిలో 16నుంచి 18పీపీఎం వరకు ఉంది. ఫలితంగా ఈ నీటిని తాగిన జనం జీవచ్ఛవాలుగా మారిపోయారు. చేతులు, కాళ్లు వంకర్లు పోయాయి. నడవలేరు. వంగలేరు. నేలపై పడుకోలేరు.
5లక్షల మంది ఫ్లోరైడ్ బాధితులు
జిల్లాలో దాదాపు 5లక్షల మంది ఫ్లోరైడ్ వ్యాధితో బాధపడుతున్నారు. ఇందులో సుమారు 4లక్షల మంది 1 - 18 ఏళ్ల వయస్సున్న వారు ఉన్నారు. సుమారు 75వేల మందికిపైగా పూర్తి స్థాయిలో ఫ్లోరైడ్ భారిన పడి నరకయాతన అనుభవిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 1900 నివాస ప్రాంతాల్లో ఫ్లోరైడ్ నీటి సమస్య తీవ్రంగా ఉంది. ఇందులో ప్రస్తుతం 1180గ్రామాలకు మాత్రమే కృష్ణా జలాలను అందిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇంకా, 700లకుపైగా ఫ్లోరైడ్ పీడిత గ్రామాలు రక్షిత నీటికోసం ఎదురు చూస్తున్నాయి. సుమారు 400పైచిలుకు గ్రామాల్లో కృష్ణాజలాలను అందించేందుకు పైపులైను పనులు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొడతామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రజలకు రక్షిత జలాలను అందించాలనే లక్ష్యంతో వాటర్‌గ్రిడ్ పథకానికి రూపకల్పన చేశారు.
ఫ్లోరైడ్ పీడిత ప్రాంతంగా ముద్రపడ్డ మునుగోడులోనే వాటర్‌గ్రిడ్ పైలాన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జనవరి మాసంలో పనులు ప్రారంభం కానున్నాయి. తాగుజలాలను కూడా ఫ్లోరైడ్ రహిత నీటినే అందించాలని తలంపుతో ఉన్న ప్రభుత్వం కృష్ణా నది నుంచి పాకాల-జూరాల ప్రాజెక్టును కూడా మునుగోడు నియోజకవర్గం మీది నుంచే వరంగల్‌లోని పాకాల చెరువు వరకు చేపట్టనుంది. నక్కలగండి ఎత్తిపోతల పథకాన్ని కూడా చేపడితే, కృష్ణాజలాలు సాగుజలాలుగా అందనున్నాయి.
మునుగోడు తీరినట్టే!
Published Sun, Nov 16 2014 1:10 AM | Last Updated on Tue, Oct 2 2018 7:51 PM
Advertisement