‘కల్తీ’ ఖరీదు రూ.కోటి
కల్తీ దినుసులు స్వాధీనం చేసుకున్న పోలీసులు
హైదరాబాద్: కల్తీ దినుసుల ముఠా గుట్టురట్టు అయింది. కారం, ధాన్యాలు, పసుపు, ధనియాలు, లవంగాలు, మసాలా పొడులు తయారు చేస్తున్న ముగ్గురిని పోలీసులు పట్టుకున్నారు. ఎల్‌బీనగర్ లోని పోలీసు కమిషనర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొం డ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ వివరాలు వెల్లడించారు. హైదరాబాద్ ఉప్పుగూడ హను మాన్‌నగర్‌కు చెందిన ఈదులకంటి పాండుగౌడ్ (47) ఇబ్రహీంపట్నం మండలం మంగళ్‌పల్లి సాగర్ హైవే సమీపంలో శ్రీ భవాని ఏజెన్సీ పేరుతో గోదామును ఏర్పాటు చేశాడు.
దీనిలో హయత్ నగర్ మండలం యంజాల్‌కు చెందిన తుమ్మిడి నర్సిరెడ్డి (38), బాలాపూర్ మండలం జిల్లెలగూ డకు చెందిన నిమ్మల నారాయణ సూపర్‌వైజర్లుగా పనిచేస్తున్నారు. ముగ్గురు కలసి పాడైపోయిన ఎండు మిర్చి, గడువు ముగిసిన వస్తువులతో కల్తీ కారం తయారు చేస్తున్నారు. కారంతోపాటు కల్తీ పసుపు, ఆవాలపొడి, యాలకులు, ధనియాల పొడి తయారు చేసి శ్రీఓం, చక్రం బ్రాండ్ల పేరిట ఆకర్షణీయమైన ప్యాకింగ్ చేస్తున్నారు. వీటి తయారీలో తక్కువ ధర ఆయిల్‌ను ఉపయోగిస్తు న్నారు.
విశ్వసనీయ సమాచారం మేరకు ఈ గోదాంపై స్పెషల్ ఆపరేషన్ టీం పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారి విజయ్‌కుమార్ దాడి చేశారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. 4 టన్నుల మిర్చి, 3.5 టన్నుల పసుపు, 1,250 కిలోల దనియాలు, 300 కిలోల ఆవాల పొడులు, 2,500 కిలోల పొట్టు, 15 లీటర్ల నాసిరకమైన నూనె, మిర్యాల పొట్టు, లవంగా ఆకు వంటి రూ.కోటి విలువైన దినుసులను స్వాధీనం చేసుకున్నారు.