వడ‘కోతే’..!
నీలగిరి : ఆహార భద్రత, పింఛన్ దరఖాస్తులను అధికారులు జల్లెడపడుతున్నారు. షరతులకు లోబడి అర్హులను ఎంపిక చేయాలన్న ప్రభుత్వఆదేశాలకు అనుగుణంగా క్షేత్రస్థాయి సిబ్బంది ఇంటింటికీ వెళ్లి విచారిస్తోంది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారికి మాత్రమే సంక్షేమ పథకాలు అందించాలన్న ప్రభుత్వ ఉద్దేశానికి కట్టుబడి పకడ్బందీగా పరిశీలిస్తున్నారు. ఈ నెల 21 నుంచి దరఖాస్తుల పరిశీలన ప్రారంభంకాగా, మొదట్లో కొంతమంది అధికారులు తప్పటడుగులు వేశారు. ఆహార భద్రత కార్డులు, పింఛన్లకు ఇబ్బడిముబ్బడిగా దరఖాస్తులు రావడంతో ఆందోళన చెందారు. లక్షల్లో వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించకుండా, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఇష్టానుసారంగా వ్యవహరించారు. దీంతో ప్రభుత్వం విధించిన పరిమితులకు అధిగమించి దరఖాస్తులు ఆమోదించారు.
దీంతో అప్రమత్తమైన రాష్ట్రస్థాయి అధికారులు ఇటీవల వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించి అర్హులను ఏవిధంగా ఎంపిక చేయాలనే దానిపై మార్గదర్శకాలు సూచించారు. ఆహారభద్రత, పింఛన్ దరఖాస్తుల్లో రూరల్, అర్బన్ ప్రాంతాలను వేర్వేరుగా చేసి పర్సెంటేజీలు ఖరారు చేశారు. దీంట్లో కూడా జిల్లా జనాభాను ప్రామాణికంగా తీసుకుని, కులాల వారీగా ఎస్సీ, ఎస్టీ ,బీసీ, మైనార్టీ వర్గాలకు ఆహార భద్రత కార్డులు ఎన్ని ఉండాలి..? పింఛన్లకు సంబంధించి వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఎంతమందికి ఇవ్వాలి..? అనే దానిపై పర్సెంటేజీలు ఖరారు చేశారు. మొత్తం వచ్చిన దరఖాస్తుల్లో ఆహార భద్రత కార్డులు 69 శాతం, పింఛన్లు 61 శాతానికి మించడానికి వీల్లేదని ప్రభుత్వం పరిమితి విధించింది. ఈ లెక్కన గతంతో పోలిస్తే పింఛన్లు, రేషన్‌కార్డులు చాలా వరకు తగ్గే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.
కార్డుల వడపోత....
పాతలెక్కల ప్రకారం జిల్లాలో రేషన్ కార్డులు 9,31,525 ఉన్నాయి. ఈ మొత్తం కార్డులకుగాను 32 లక్షల యూనిట్లు ఉన్నాయి. దీంట్లో 29 లక్షల కుటుంబాలు ఆధార్ సీడింగ్ నమోదు చేసుకున్నాయి. ఇంకా 5 లక్షల యూనిట్లకు ఆధార్ సీడింగ్ జరగలేదు. కుటుంబానికి నలుగురు సభ్యుల చొప్పున లెక్కించినా, లక్షా 25 వేల కార్డులు ఆధార్ సీడింగ్ జరగలేదు. వాటిని అధికారులు బోగస్ కార్డులుగా తేల్చారు. కాగా ప్రస్తుతం కొత్తగా ఆహారభద్రత కార్డులకు 10,67, 004 దరఖాస్తులు వచ్చాయి. దీంట్లో 69 శాతం ప్రకారం లెక్కించినట్లయితే 7,36,232 ఆహారభద్రత కార్డులు మాత్రమే లబ్ధిదారులకు దక్కే అవకాశం కనిపిస్తోంది. పాతకార్డులు 9,31,525ల నుంచి కొత్త కార్డులు 7,36,232 తీసివేయగా 1,95,293 కార్డులు రద్దయ్యే అవకాశం ఉంది.
అర్హులకే పింఛన్లు...
వృద్ధాప్య, వికలాంగులు, చేనేత, వితంతువులు, కల్లుగీతకార్మికులు కలిపి మొత్తం జిల్లాలో 3 లక్షల 94 వేల మంది పింఛన్‌దారులు ఉన్నారు. కొత్తగా 5,47,287 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 61 శాతానికి లోబడి పింఛన్‌దారులు ఉండాలి. ఈ లెక్కన 3,33,845 మంది అర్హులుగా ఎంపికయ్యే అవకాశం ఉంది. పాత పింఛన్‌దారులు 3 లక్షల 94 వేల నుంచి అర్హులుగా ఎంపికయ్యే 3,33,845 మందిని తీసేవేస్తే 60,154 మంది అనర్హులుగా తేలనున్నారు. కాగా పింఛన్ దరఖాస్తుల పరిశీలన ఈనెలాఖరుతో ముగియనుంది. కావున మరో రెండు, మూడు రోజుల్లో అర్హుల జాబితా అధికారికంగా వెల్లడి కానుంది. కొత్త పింఛన్‌దారులకు నవంబర్ 8 నుంచి ఫించన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో వీలైనంత త్వరగా పరిశీలన కార్యక్రమాన్ని ముగించేపనిలో యంత్రాంగం పనిచేస్తోంది.
నవంబర్ 3 నుంచి మున్సిపాల్టీల్లో...
గ్రామీణ ప్రాంతాల్లో విచారణ ప్రక్రియ పూర్తయిన తర్వాత నవంబర్ 3 నుంచి మున్సిపాల్టీల్లో ఆహారభద్రత, పింఛన్ దరఖాస్తుల పరిశీలన మొదలవుతుంది. సిబ్బంది కొరత కారణంగా మున్సిపాల్టీల్లో ఇంటింటి విచారణ ఆలస్యంగా చేపట్టారు. మున్సిపల్ వార్డుల్లో దరఖాస్తుల పరిశీలనకు ప్రతి వార్డుకు రెండు ప్రత్యేక బృందాలను నియమించారు.