
ఖరీఫ్ ఆశలు గల్లంతు!
• 42 శాతానికి పైగా తగ్గనున్న ఆహార ధాన్యాల దిగుబడులు
• లక్ష్యం 72.64 లక్షల టన్నులు.. దిగుబడి అంచనా 41.88 లక్షల టన్నులే
• వరి ఏకంగా 18.26 లక్షల టన్నులు తగ్గుదల
• సగానికి మించి పడిపోనున్న పప్పుధాన్యాల దిగుబడి
• ఖరీఫ్ మొదటి అంచనాలను విడుదల చేసిన వ్యవసాయ శాఖ
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది ఖరీఫ్ ఆశలు గల్లంతవుతున్నాయి. రాష్ట్రంలో ఏకంగా 42 శాతానికిపైగా ఆహార ధాన్యాల దిగుబడి తగ్గిపోనుంది. లక్ష్యంతో పోల్చుకున్నా.. గత రెండేళ్ల దిగుబడితో పోల్చినా ఈసారి దిగుబడి దారుణంగా పడిపోనుంది. వ్యవసాయ శాఖ తాజాగా విడుదల చేసిన తన తొలి అంచనా నివేదికలోనే ఈ విషయాన్ని స్పష్టం చేసింది. రుతుపవనాలు సకాలంలో వచ్చినా.. పూర్తిస్థాయిలో వర్షాలు లేక, జలాశయాల్లో నీరు చేరక, భూగర్భ జలాలు పెరగకపోవడంతో పరిస్థితి మారిపోయింది. మొక్కజొన్న ఎండిపోగా.. వరి నాట్లు 67 శాతానికే పరిమితమయ్యాయి.
భారీగా పడిపోనున్న దిగుబడి
ఈసారి వర్షాలు బాగా పడతాయని భావిం చిన వ్యవసాయ శాఖ 2016-17 ఖరీఫ్‌లో 72.64 లక్షల టన్నుల ఆహారధాన్యాల దిగుబడి లక్ష్యంగా ప్రకటించింది. కానీ తాజాగా విడుదల చేసిన అంచనా ప్రకారం 41.88 లక్షల టన్నులకు మించి దిగుబడులు రావని పేర్కొంది. అంటే ఏకంగా 30.76 లక్షల టన్నులు తగ్గనుందని స్పష్టం చేసింది. వరి ఉత్పత్తి లక్ష్యం 42.58 లక్షల టన్నులు కాగా.. ఈసారి 24.32 లక్షల టన్నుల దిగుబడే వస్తుం దని అంచనా వేసింది.
మొక్కజొన్న లక్ష్యం 21.62 లక్షల టన్నులు కాగా.. 15.72 లక్షల టన్నులే వస్తుందని నివేదికలో పేర్కొంది. ఇక ఖరీఫ్‌లో పప్పుధాన్యాల ఉత్పత్తి లక్ష్యం 3.7 లక్షల టన్నులు కాగా.. 1.83 లక్షల టన్నులకు తగ్గనుంది. 2014 ఖరీఫ్‌లో 54.14 లక్షల టన్నులు, గతేడాది ఖరీఫ్‌లో 43.58 లక్షల టన్నులు ఆహార ధాన్యాల దిగుబడి వచ్చింది. కానీ ఈసారి అంతకంటే తక్కువగా 41.88 లక్షలకే పరిమితం కానుండటం ఆందోళనకరంగా మారింది.
ఇక వరి ఉత్పత్తి 2014లో 37.97 లక్షల టన్నులు, గతేడాది 29.43 లక్షల టన్నులు కాగా.. ఈసారి 24.32 లక్షల టన్నులే వస్తుందని అంచనా వేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సోయాబీన్ కూడా మూడో వంతుకు పడిపోవడం గమనార్హం. ఈసారి 7.66 లక్షల టన్నుల సోయా పండించాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా... 2.31 లక్షల టన్నులకు మించి పండే అవకాశం లేదని వ్యవసాయశాఖ పేర్కొంది.
నాట్లే పూర్తిగా పడలేదు
రాష్ట్రంలో ఖరీఫ్ సాధారణ వరి సాగు విస్తీర్ణం 24.35 లక్షల ఎకరాలు కాగా.. బుధవారం నాటికి 16.2లక్షల ఎకరాల్లోనే నాట్లు పడ్డాయి. మొక్కజొన్న సాధారణ విస్తీర్ణం 12.12 లక్షల ఎకరాలు కాగా.. కొంత అదనంగా 14.15 లక్షల ఎకరాల్లో సాగైంది. కానీ మొక్కజొన్న పీచు దశకు వచ్చిన జూలై నెలాఖరు, ఆగస్టు మధ్య నాటికి వర్షాలు కురవకపోవడంతో 8 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయింది. పప్పుధాన్యాల సాగు కూడా సాధారణంతో పోల్చితే 157 శాతంగా నమోదైనా... వర్షాలు లేక కంది, పెసర్ల దిగుబడి గణనీయంగా పడిపోయే పరిస్థితి ఏర్పడింది.
ఖరీఫ్‌లో ఆహారధాన్యాల ఉత్పత్తి లక్ష్యం, దిగుబడి అంచనా (టన్నుల్లో)