భార్య, కుమారుడిని చంపిన కిరాతకుడు
ఆపై తానూ ఆత్మహత్యాయత్నం
అదనపు కట్నం కోసం ఘాతుకం
చొప్పదండి: అదనపు కట్నం కోసం కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం చాకుంటలో భార్యను, కుమారుడిని హత్య చేశాడో కిరాతకుడు. ఆపై తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చాకుంటకు చెందిన నీలం రమేశ్-అనిత(28) దంపతులకు కుమారుడు చరణ్‌తేజ్(1) ఉన్నారు. రమేశ్ ఏ పనీ చేయకుండా తిరుగుతున్నాడు. పెళ్లి సమయంలో రూ.10 లక్షలు నగదు, 10 తులాల బంగారం, ఇతర లాంచనాలు ఒప్పుకోగా రూ.5 లక్షలే ఇవ్వడంతో అనితను వేధించడం మొదలెట్టాడు. చరణ్‌తేజ్ పుట్టినప్పుడు గొడవలు కావడంతో అనిత పుట్టింటివారు మిగతా రూ.5 లక్షలు సైతం ఇచ్చారు. మళ్లీ అదనపు కట్నం కావాలని వేధించడంతో 14 గుంటల భూమి కొనిచ్చారు.
రమేశ్ తండ్రి ట్రాన్స్‌కోలో హెల్పర్‌గా పనిచేస్తూ వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకునేందుకు యత్నిస్తుండగా, ఆ ఉద్యోగం తనకే వస్తుందని, మరింత కట్నం తేవాలని వేధించడం మొదలెట్టాడు. ఈ క్రమంలో రమేష్ శనివారం రాత్రి భార్య, కుమారుడిని గొంతు నులిమి, క్రిమిసంహారక మందు తాగించి హత్య చేశారు. ఆపై ఇంటికి తాళం వేసి తానూ క్రిమిసంహారక మందు తాగి గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో దూకాడు. అతడికేమీ కాకపోవడంతో ఆదివారం మధ్యాహ్నం రైతులు గమనించి ఆస్పత్రికి తరలించారు. భార్యా, కుమారుడికి మందు తాగించానని చెప్పగా తాళం పగులగొట్టి చూసేసరికి ఇద్దరూ మంచంపై విగతజీవులై కనిపించారు. నిందితుడు రమేశ్‌తోపాటు అతడి కుటుంబసభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు.