
యాంకర్ చందన్ – వీణ దంపతులు (ఫైల్) ,తుషార్ (ఫైల్)
దొడ్డబళ్లాపురం: భర్త మృతిని తట్టుకోలేని భార్య జీవితం మీద విరక్తి చెంది కొడుకు గొంతుకోసి, తానూ కత్తితో కోసుకుని, యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో తనయుడు మరణించగా, ఆమె తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మే 24న తెల్లవారుజామున దావణగెరె హరిహర తాలూకా హనగవాడి వద్ద నిలిచి ఉన్న లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో ప్రముఖ కన్నడ పురుష యాంకర్ చందన్ దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఇప్పుడీ అకృత్యానికి పాల్పడింది ఆయన సతీమణే.
ఇటీవలే భర్త దుర్మరణం
యాంకర్ చందన్ దొడ్డబళ్లాపురానికి చెందిన వ్యక్తి. పట్టణ పరిధిలోని సోమేశ్వర కాలనీలో నివాసం. వారి అన్యోన్య దాంపత్యంలో రోడ్డు ప్రమాదం విషాదం నింపింది. భర్త మరణంతో భార్య వీణ (35) తీవ్రంగా మనోవేదన చెందింది. ఆనాటి నుంచి ఆమె ఎవరితో మాట్లాడడం లేదు. భర్తను తలచుకుని కుమిలిపోయేది. దీంతో ఆత్మహత్య చేసుకోవాలనినిర్ణయించుకుంది. తాను చనిపోతే కొడుకు అనాథ అవుతాడని భావించి అతన్ని చంపి తానూ లోకం విడిచి వెళ్లాలనుకుంది. గురువారం తెల్లవారుజామున ఇంట్లో ఎవరూలేని సమయంలో తన కుమారుడు తుషార్ (13) గొంతుకోయడంతో బాలుడు మరణించాడు, ఆపై అదే కత్తితో శరీరంపై విచక్షణారహితంగా కోసుకుంది. ఆ తరువాత ఇంట్లో ఉన్న యాసిడ్ తాగింది.
బెంగళూరుకు మహిళ తరలింపు
ఉదయం ఇంటికి వచ్చిన వీణ సోదరుడు చేతన్ విషయాన్ని గ్రహించి స్థానికుల సాయంతో తలుపులు పగలగొట్టి తీవ్ర రక్తస్రావంతో కొట్టుమిట్టాడుతున్న వీణను ఆస్పత్రికి తరలించారు. ఇక బాలుడు తుషార్ మృతిచెందాడు. వీణ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బెంగళూరు నిమ్హాన్స్‌కు తరలించారు. అయితే ఆమె చికిత్సకు సహకరించడం లేదని వైద్యులు తెలిపారు. అంతేకాకుండా ఆమె గొంతు, మెడ, శరీరం ఇతర భాగాలలో కత్తితో కోసుకోవడం వల్ల పరిస్థితి విషమంగా ఉంది. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు బాలుడు తుషార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హత్యానేరం కింద వీణపై కేసు నమోదుచేయడం జరిగింది. ఈ సంఘటనతో దొడ్డ పట్టణంలో తీవ్ర విషాదం నెలకొంది.

మంచంమీద రక్తపుమడుగులో తుషార్
Comments
Please login to add a commentAdd a comment