Actor Darshan: ‘ఒక్క సిగరెట్‌ ఇవ్వండి ప్లీజ్‌’ | Kannada Actor Darshan Thoogudeepa Arrested In Murder Case, Requesting For Cigarette In Police Station | Sakshi
Sakshi News home page

‘ఒక్క సిగరెట్‌ ఇవ్వండి ప్లీజ్‌’.. దర్శన్‌ సినిమా కష్టాలు!

Published Thu, Jun 13 2024 7:17 AM | Last Updated on Thu, Jun 13 2024 10:37 AM

Kannada Actor Darshan Thoogudeepa Arrested In Murder Case

 అభిమాని హత్య కేసులో  ప్రముఖ నటుడు దర్శన్‌.. 

 వ్యతిరేకంగా చిత్రదుర్గలో నిరసనలు  

 హతుని తల్లిదండ్రుల శాపనార్థాలు  

 హత్యాస్థలిలో విచారణ

లక్షలాది మందికి అభిమాన హీరో, సినిమాలలో దుర్మార్గులను చెండాడే పాత్రల్లో మెప్పించే దర్శన్‌ నిజ జీవితంలో సాధారణ మనిషి కంటే తక్కువగా ఆలోచించి ఇబ్బందుల్లో పడ్డాడు. పోలీస్‌ ఠాణాలో ఖైదీగా మారాడు. దర్శన్‌ ఇలా చేశాడా.. అని ఇప్పటికీ నమ్మలేకపోతున్నట్లు అభిమానులు వాపోతున్నారు.

దొడ్డబళ్లాపురం: చిత్రదుర్గ ప్రముఖ నటుడు దర్శన్‌కు వ్యతిరేకంగా బుధవారంనాడు ప్రజల ధర్నాలతో అట్టుడికింది. అభిమాని రేణుకాస్వామి హత్య కేసు సీబీఐకి అప్పగించాలని కోరుతూ వందలాదిమంది  ర్యాలీలు చేపట్టారు. కలెక్టర్‌ కార్యాలయం ముందు చేరి దర్శన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దర్శన్‌ ఫోటోకు చెప్పుల హారం వేసి ఊరేగించి దగ్ధం చేశారు. ధర్నాలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే తిప్పారెడ్డి మాట్లాడుతూ సినిమాలలో అనేక మంచి పాత్రలు చేసిన దర్శన్‌ నిజ జీవితంలో విలన్‌ గా మారడం విషాదనీయమన్నారు. రేణుకాస్వామితో ఇబ్బందిగా ఉంటే తల్లిదండ్రులకు, పోలీసులకు తెలియజేయాల్సింది అని, ఇలా అమానుషంగా హత్య చేయడం సబబు కాదన్నారు. ఈ హత్యలో ఎవరెవరి పాత్ర ఉందో వారందరినీ కఠినంగా శిక్షించాలన్నారు.   



అతన్నీ ఇలాగే చంపాలి 
తన పుత్రున్ని ఎంత దారుణంగా చంపారో అదేరీతిలో ఆ హీరోని కూడా చంపాలి అంటూ రేణుకాస్వామి తల్లిదండ్రులు విలపించారు. గత శనివారం బెంగళూరులో హత్యకు గురైన చిత్రదుర్గవాసి రేణుకాస్వామి కుటుంబీకులు ఘోరాన్ని తలచుకుని శోకసంద్రంలో మునిగిపోయారు. భర్త మృతదేహాన్ని చూసి అతని భార్య సహన రోదిస్తుంటే ఓదార్చడం ఎవరితరం కాలేదు. చిత్రదుర్గలో బుధవారం కుటుంబ సభ్యులు,బంధువులు అంత్యక్రియలు జరిపారు. సహన ఇప్పుడు మూడో నెల గర్భంతో ఉంది. బిడ్డ పుట్టకముందే తండ్రి చనిపోవడంతో ధారగా విలపిస్తోంది. దర్శన్‌ని కూడా ఇలాగే చంపాలని కుటుంబ సభ్యులు శాపనార్థాలు పెట్టారు.   

సంబంధిత వార్త:  బెల్ట్‌తో కొట్టి.. చితకబాది... పొట్టన పెట్టుకున్నాడు! 

రూ. 30 లక్షలు డీల్‌ 
హత్య కేసులో హీరో దర్శన్‌ని రెండవ నిందితునిగా చేర్చారు. హత్యా నేరాన్ని వారి మీద వేసుకోవడానికి ముగ్గురికి రూ.30 లక్షలు ఇచ్చినట్టు పోలీసుల విచారణలో తేలింది. 8వ తేదీన రేణుకాస్వామిని చిత్రదుర్గ నుంచి బెంగళూరుకు తీసుకువచ్చి కామాక్షిపాళ్యలో షెడ్‌లో బంధించి హింసించి చంపారు. శవాన్ని ఎలా తరలించాలనేది చర్చించారు. ప్లాన్‌ ప్రకారం ఒక గ్యాంగ్‌కు చెందిన ముగ్గురిని పిలిపించి రూ.30 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. 

చిత్రదుర్గ్‌ దర్శన్‌ ఫ్యాన్‌ క్లబ్‌ కన్వీనర్‌ రాఘవేంద్ర(రఘు) ఇందులో ప్రధాన సూత్రధారి వ్యవహరించాడు. రేణుకాస్వామి భార్య వెల్లడించిన వివరాల ప్రకారం.. హత్య జరిగిన రాత్రి రఘు తన ఇంటికి వచ్చి తన భర్తను తీసుకెళ్లాడని చెబుతోంది. మరోవైపు తన భాగస్వామి పవిత్రపై అనుచిత కామెంట్లు చేశాడంటూ దర్శన్‌, రేణుకా స్వామిని బెల్ట్‌, కర్రలతో బాది..గొడకేసి కొట్టాడని పోలీసులు వెల్లడించారు. ఆపై శవాన్ని పారవేసి, ఒకవేళ పోలీసులు కనిపెట్టి విచారణ చేపడితే లొంగిపోయేలా ఒప్పందం చేసుకున్నారు. అనుకున్నట్టుగానే శవం లభించాక పోలీసులు విచారణ చేపట్టారు. వారి ప్రవర్తనలో తేడా ఉండడంతో పోలీసులు వారిని విడివిడిగా విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. దర్శన్‌ అనుచరులతో ముగ్గురు నిందితులూ రాత్రంతా ఫోన్‌లో మాట్లాడిన కాల్‌ రికార్డులు ఆధారంగా మారాయి.  


దొన్నె బిరియాని వద్దని ఇడ్లీలు.. 
దర్శన్‌ మంగళవారం రాత్రి కామాక్షిపాళ్య పోలీస్‌స్టేషన్‌లో నిద్రలేని రాత్రి గడిపాడు.  పండ్ల జ్యూస్, ఇడ్లీలు తిని నిద్రపోకుండా మేలుకునే ఉన్నట్టు సమాచారం. దొన్నె బిరియాని ఇవ్వగా వద్దన్నారు. పవిత్ర, మిగతా నిందితులు బిరియాని ఆరగించారు. పోలీసులు 6 రోజులపాటు కస్టడీకి తీసుకుని స్టేషన్‌కు తీసుకువచ్చి 12 మంది నిందితులతో పాటు నిద్రపోవడానికి అవకాశమిచ్చారు. దర్శన్‌ సెలబ్రిటీ కావడం వల్ల ప్రత్యేకంగా కార్పెట్, దిండు ఇచ్చినా నిద్రపోలేదు.
   
ఒక్క సిగరెట్‌ ఇవ్వండి ప్లీజ్‌ 
సినీ హీరోగా, సంపన్నుడిగా ఎంతో విలాసవంతమైన జీవితం గడిపే దర్శన్‌ ఠాణాలో దిగులుగా కూర్చున్నారు.  ఒక్క సిగరెట్‌ ఇవ్వాలని పోలీసులను వేడుకున్నట్టు సమాచారం. సిగరెట్‌ లేక చేతులు వణుకుతున్నాయని వాపోయాడు. కానీ పోలీసులు సిగరెట్‌ ఇవ్వలేదు. ఈ హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని, హత్య చేయమని తాను చెప్పలేదని పదేపదే చెబుతున్నాడని తెలిసింది.

 
పవిత్ర, దర్శన్‌ కార్లు సీజ్‌ 
దర్శన్, పవిత్రల కార్లను పోలీసులు సీజ్‌ చేయడంతో పాటు వాటిలో ఉన్న మద్యం బాటిళ్లు, ఇతర సాక్ష్యాధారాలను స్వా«దీనం చేసుకున్నారు. రేణుకాస్వామిని బంధించి, హింసించి హత్య చేసిన షెడ్‌లోకి దర్శన్‌కు చెందిన స్కారి్పయో, పవిత్ర వాడే జీప్‌ ర్యాంగ్లర్‌ వెళ్లినట్లు సీసీ కెమెరా చిత్రాల్లో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఆ రెండు వాహనాలను స్వా«దీనం చేసుకున్నారు. జీప్‌లో పవిత్ర వ్యానిటీ బ్యాగ్, ఇతర వస్తువులు లభించాయి.
  
అభిమానుల హంగామా 
హత్య కేసులో అరెస్టైన దర్శన్‌ను విచారిస్తున్న బెంగళూరు అన్నపూర్ణేశ్వరి నగర పోలీస్‌స్టేషన్‌ ముందు దర్శన్‌ ఫ్యాన్స్‌ హల్‌చల్‌ చేసారు. భారీగా చేరి నినాదాలు చేస్తూ స్టేషన్‌ ముందు గందరగోళం సృష్టిస్తుండడంతో పోలీసులు వారిని చెదరగొట్టడానికి లాఠీ చార్జ్‌ చేశారు. దీంతో అందరూ తలోదిక్కుకు పరుగులు తీశారు. ఈ గొడవలతో స్థానికులకు ఇబ్బందులు కలిగాయి.

పవిత్ర వర్సెస్‌ రేణుకాస్వామి  
తన అభిమాన హీరో భార్యా పిల్లలతో సంతోషంగా ఉండాలి, చెడు తిరుగుళ్లు తిరగరాదని భావించిన ఆ అభిమాని రేణుకాస్వామి.. అందుకోసమే ప్రాణత్యాగం చేశాడు. ప్రముఖ నటుడు దర్శన్, నటి, ప్రియురాలు పవిత్రగౌడపై వాట్సాప్, ఇన్‌స్టా తదితర సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టి ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. దర్శన్‌ భార్య విజయలక్షి్మని పట్టించుకోకుండా పవిత్రగౌడతో సహ జీవనంపై రేణుకాస్వామి కోపం తెచ్చుకున్నాడు. ఈ ద్వేషంతో పవిత్రకు అసభ్యంగా మెసేజ్‌లు పెట్టడం ప్రారంభించాడు. ఇది తారాస్థాయికి చేరింది, తన మర్మాంగాన్ని ఫోటో తీసి పవిత్రకు పంపించి.. నేను దర్శన్‌ కంటే తక్కువ కాదు, నా వద్దకు కూడా రా అంటూ హేళనగా మెసేజ్‌ పంపాడు. దీంతో ఆమె దర్శన్‌కు గట్టిగా ఫిర్యాదు చేయడం, ఆయన అగ్గిమీద గుగ్గిలమైనట్లు తెలిసింది. పవిత్ర, రేణుకాస్వామి అకౌంట్‌ని బ్లాక్‌ చేసినా అతడు మరో కొత్త ఖాతాతో మెసేజ్‌లు పంపించేవాడు.

దర్శన్‌ మహజరు  
దర్శన్, ఇతర నిందితులను పోలీసులు బుధవారంనాడు హత్య జరిగిన ఆర్‌ఆర్‌ నగరలోని షెడ్‌ వద్దకు తీసికెళ్లారు. ఎలా బంధించారు? ఎంతమంది ఎన్ని రకాలుగా హింసించారు?  దాడి మీ సమక్షంలోనే జరిగిందా? మీరు అడ్డుకోలేదా? అనే ప్రశ్నలు పోలీసులు వేశారు. అక్కడ పెద్దసంఖ్యలో అభిమానులు, స్థానికులు చేరారు.

ఇన్‌స్టాలో భార్య అన్‌ఫాలో 
గతంలో హీరో దర్శన్‌– భార్య విజయలక్ష్మి మధ్య తరచూ గొడవలు రేగి పోలీస్‌ స్టేషన్‌ వరకూ వెళ్లడం తెలిసిందే. ఆ కేసుల్లోనూ  దర్శన్‌ జైలుపాలయ్యాడు. అయితే దివంగత రెబల్‌స్టార్‌ అంబరీష్, కొందరు సినీ పెద్దల సర్దుబాటుతో ఇద్దరూ కలిసిపోయారు. అయితే ఈసారి హత్య కేసుతో వారి సంసారంలో పెద్ద అగాథమే ఏర్పడిందని చెప్పవచ్చు. ఎక్కువగా పవిత్రగౌడతోనే దర్శన్‌ ఉండిపోవడంతో వారి కాపురం కలహాలమయంగా మారింది. ప్రియురాలు పవిత్ర గౌడ కోసం  ఇటువంటి కేసులో తలదరూర్చడాన్ని భార్య సహించలేకపోతోంది. బహిరంగంగా తన ఆగ్రహాన్ని వ్యక్తపరచకపోయినా ఇన్‌స్టాలో భర్త దర్శన్‌ ను అన్‌ఫాలో చేయడంతో పాటు డీపీని కూడా తొలగించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement