అన్నీ సంచలనాలే.. ‘టీఎస్‌పీఎస్సీ’ కేసుతో కరీంనగర్‌కు లింకు! | - | Sakshi
Sakshi News home page

అన్నీ సంచలనాలే.. ‘టీఎస్‌పీఎస్సీ’ కేసుతో కరీంనగర్‌కు లింకు!

Published Sat, Dec 30 2023 1:36 AM | Last Updated on Sat, Dec 30 2023 9:04 AM

- - Sakshi

కరీంనగర్‌: 'ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఈ ఏడాది పలు సంచలన సంఘటనలకు వేదికైంది. హత్య, ఆత్మహత్య, మిస్సింగ్, చోరీలు, కాల్పులు, టీఎస్ పీఎస్సీ పేపర్ల లీకేజీ, అవినీతి, అరెస్టు, టీచర్ల బయోమెట్రిక్ డుమ్మా, తిరుపతికి ప్రయాణికుల ఇక్కట్లు.. ఇలా ఏ రకమైన వార్త తీసుకున్నా అది రాష్ట్రవ్యాప్తంగా చర్చ నీయాంశమైంది. వీటన్నింటిపై 'సాక్షి' దినపత్రిక స్పాట్ వార్తలతో పాటు ప్రత్యేక కథనాలు ప్రచురించింది. స్పందించిన ప్రభుత్వ యంత్రాంగం వెంటవెంటనే చర్యలు తీసుకుంది. పలుశాఖల అధికారుల అవినీతి, అక్రమాలపై ఉన్నతాధికారులు కఠినంగా వ్యవహరించారు. బాధ్యులను విధుల నుంచి తప్పించారు.' - సాక్షిప్రతినిధి, కరీంనగర్

జనవరి 1–2023: ఆత్మహత్యలు కావు హత్యలే.. గతేడాది కొత్త సంవత్సరం రోజున గంగాధరలో ఒకే కుటుంబంలో ఇద్దరు పిల్లలు, తల్లి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ మరణాల గుట్టు నూతన సంవత్సరం రోజునే వీడింది. తండ్రే తన పిల్లలకు, భార్యకు ఎన్‌ఏఓహెచ్‌ అనే రసాయనం కలిపి ఇచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. తొలుత ఈ విషయాన్ని ‘సాక్షి’ వెల్లడించింది. ఆ తర్వాత నిందితుడు కూడా ఆత్మహత్య చేసుకోవడంతో కేసు మూసివేశారు.

జనవరి 05: సరసమైన ధరలకే విరాసత్‌.. గంగాధర మండల తహసీల్దార్‌ కార్యాలయంలో వారసత్వ భూములు విరాసత్‌ చేసే విషయంలో ఫోన్‌ పే ద్వారా రూ.లక్షల లంచాలు తీసుకున్నారు. అయినా పని చేయకపోవడంతో బాధితులు ‘సాక్షి’ని ఆశ్రయించారు. ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకురావడంతో విచారణ జరిపిన కలెక్టర్‌ కార్యాలయం తహసీల్దార్‌ను బదిలీ చేసి, వీఆర్‌ఏ, వీఆర్వోలను సస్పెండ్‌ చేసింది.

జనవరి 21: పల్లెల్లో సహారా కలకలం.. అధిక వడ్డీ రేట్ల ఆశచూపి, డిపాజిట్లు సేకరించిన సహారా సంస్థ కస్టమర్లకు డబ్బులు తిరిగి చెల్లించడం లేదు. ఈ విషయం గోప్యంగా ఉంచి వారిని మభ్యపెడుతూ వస్తున్నారు. ఈ కుంభకోణం ‘సాక్షి’ పరిశోధనాత్మక కథనంతో వెలుగుచూసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాతోపాటు రాష్ట్రంలో పలుచోట్ల కేసులు నమోదు చేసి, కీలక దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు.

ఫిబ్రవరి 03–2023: తల్లీపిల్లలను కలిపిన సాక్షి.. కరీంనగర్‌ మంకమ్మతోట నుంచి ఓ మహిళ ఇద్దరు పిల్లలను కిడ్నాప్‌ చేసి, మహారాష్ట్ర తీసుకెళ్లింది. ఈ విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకువచ్చింది. దీంతో పోలీసులు ఆ పిల్లలను తల్లిదండ్రులకు అప్పగించి, నిందితురాలిపై కేసు నమోదు చేశారు.

ఫిబ్రవరి 24: కొండగట్టు ఆలయంలో బీదర్‌ దొంగల చోరీ.. ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆలయంలో బీదర్‌ నుంచి వచ్చిన దొంగలు చోరీ చేశారు. పలు వెండి ఆభరణాలు, తాపడాలను ఎత్తుకెళ్లారు. పోలీసులు 24 గంటల్లోనే కేసును ఛేదించడం గమనార్హం. ఈ విషయాన్ని కూడా ‘సాక్షి’ ముందుగానే ఎక్స్‌క్లూజివ్‌గా పాఠకులకు అందించింది.

మార్చి 15: ‘కట్టా’ను పట్టుకున్న సాక్షి.. నకిలీ అర్హతలతో 34 ఏళ్లుగా పంచాయతీరాజ్‌ శాఖలో కొలువు చేస్తున్న కట్టా విష్ణువర్దన్‌ అనే ఉద్యోగి నిర్వాకంపై ‘సాక్షి’ వరుస పరిశోధన కథనాలు వెలువరించింది. వీటికి ఉన్నతాధికారులు స్పందించి, ఆయన అక్రమాలు నిజమేనని తేల్చారు. అనంతరం సస్పెన్షన్‌ వేటు వేశారు.

మార్చి 16: టీచకుడు.. జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలంలో మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ తోటి మహిళా టీచర్లను వేధిస్తున్న వైనాన్ని ‘సాక్షి’ బయటపెట్టింది. పకడ్బందీగా ఆయన వికృత చేష్టలను లోకానికి చూపించడంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టి, సస్పెన్షన్‌ వేటు వేశారు.

మార్చి 18: టీఎస్‌పీఎస్సీ కలకలం.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాలలీకేజీలో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజశేఖర్‌రెడ్డిది జగిత్యాల జిల్లానే. దీంతో సిట్‌ బృందం పలు మార్లు జిల్లాకు వచ్చి విచారణ చేపట్టింది. కరీంనగర్‌ జిల్లాలోని బొమ్మకల్‌లోనూ లీకేజీకి లింకుందని గుర్తించారు. ఆ తర్వాత ఓ ప్రముఖ కాలేజీలో పనిచేసే సిబ్బందిని కూడా అరెస్టు చేశారు.

ఏప్రిల్‌ 1: పోలీసులకు శాశ్వత ఫోన్‌ నంబర్‌.. పోలీసులందరికీ ఒకే శాశ్వత నంబర్‌ను కేటాయిస్తూ పోలీసు శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ విధానాన్ని కరీంనగర్‌ నుంచే అమలుకు నిర్ణయించింది. డిపార్ట్‌మెంట్‌లో చేరిన వ్యక్తి రిటైరయ్యే వరకు ఒకే నంబర్‌ ఉంటుంది. దాన్నే పీఎఫ్‌, బ్యాంకు ఖాతాలకు అనుసంధానిస్తారు.

ఏప్రిల్‌ 4: బండి సంజయ్‌ అరెస్టు.. పదోతరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో ఎంపీ బండి సంజయ్‌ను కరీంనగర్‌ పోలీసులు అర్ధరాత్రి అరెస్టు చేసి, హనుమకొండకు తరలించారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో ఎంపీ సెల్‌ఫోన్‌ పోయింది. ఇంతవరకూ దొరకలేదు.

ఏప్రిల్‌ 20: మానకొండూర్‌లో కాల్పుల కలకలం.. మానకొండూర్‌ మండల కేంద్రంలో కాల్పులు జరిగాయన్న వార్త కలకలం రేపింది. అరుణ్‌ అనే యువకుడిపై గోదావరిఖనికి చెందిన సాయితేజ్‌, అతని మిత్రులు కలిసి హత్యాయత్నం చేశారు. నాటు తుపాకీతో కాల్చగా అది పేలలేదు. పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకొని, నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

మే 24: నా కోడిని చంపేశారు.. తన టర్కీ కోడిని పొరుగింటి వ్యక్తి చంపాడంటూ ఓ వ్యక్తి కరీంనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం, ఈ వార్త ‘సాక్షి’లో ప్రముఖంగా ప్రచురించడం చర్చనీయాంశమైంది. సోషల్‌ మీడియాలోనూ వైరల్‌గా మారింది.

జూన్‌ 27: ఉగ్రకేసులో తండ్రీకూతుళ్ల అరెస్టు.. ఉగ్రవాదులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో రామగుండంలో తలదాచుకున్న ఓ తండ్రీకూతుళ్ల ను ఏటీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. శ్రీనగర్‌కి చెందిన ఇస్లామిక్‌ స్టేట్‌ సానుభూతిపరులతో చాటింగ్‌ చేసినట్లు గుర్తించి, అదుపులోకి తీసుకున్నా రు. తండ్రి గతంలో హైదరాబాద్‌లో జరిగిన ఓ పే లుళ్ల కేసులో నిందితుడిగా ఉన్నాడని సమాచారం.

జూలై 03: దళితబంధులో మామూళ్ల పర్వం.. దళితబంధు పథకంలో మామూళ్ల పర్వంపై ‘సాక్షి’లో ప్రచురితమైంది. దీనిపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు ఓ ఉద్యోగిని సస్పెండ్‌ చేశారు. మరో ఉద్యోగి సస్పెన్షన్‌ భయంతో లీవు మీద వెళ్లారు.

జూలై 04: డుమ్మా మాస్టార్లు.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టీచర్లు బయోమెట్రిక్‌ ఉన్నా డుమ్మా కొడుతున్న వైనాన్ని ‘సాక్షి’ డుమ్మా మాస్టార్లు పేరిట కథనం ప్రచురించింది. దీనికి కరీంనగర్‌ డీఈవో స్పందించి, ఆలస్యమైతే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

జూలై19: పోలింగ్‌ కేంద్రాల సమస్యలపై జూలైలో ‘సాక్షి’ వరస కథనాలు ప్రచురించింది. స్పందించిన ఉన్నతాధికారులు తప్పులను సరిదిద్దారు. డిసెంబర్‌లో కొత్తపోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు.

ఆగస్టు 14: బాలిక మృతి కేసులో కొత్త ట్విస్ట్‌.. పెద్దపల్లి శివారులో నివసించే మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ బాలిక గాయపడి, అనుమానాస్పద స్థితిలో మరణించడం కలకలం రేపింది. ఆమైపె సామూహిక లైంగిక దాడి జరిగిందన్న ఆరోపణలు వచ్చినా.. దర్యాప్తులో ఆత్మహత్య చేసుకుందని తెలియడంతో కేసు మిస్టరీ వీడింది.

సెప్టెంబర్‌ 08: రైతుబీమా ఐడీలలో జాప్యం.. రైతు బీమా, ఎల్‌ఐసీ ప్రీమియం పొందాలంటే ఐడీలు తప్పనిసరి. కానీ, ఈ–జెనరేట్‌ కాక పలువురు మరణించిన రైతుల కుటుంబాలకు బీమా జాప్యమైంది. విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురావడంతో స్పందించిన వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు సమస్యను పరిష్కరించారు.

సెప్టెంబరు 20: స్పౌజ్‌ కోటా దుర్వినియోగం.. దంపతులిద్దరూ ప్రభుత్వ టీచర్లయితే ఒకేచోట పని చేసేందుకు ఉద్దేశించిన స్పౌజ్‌ కోటాను పలువురు టీచర్లు కేవలం హెచ్‌ఆర్‌ఏ కోసం దుర్వినియోగం చేశారు. ఈ విషయాన్ని ‘సాక్షి’ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా.. స్పందించిన విద్యాశాఖ వారిపై చర్యలు చేపట్టింది.

సెప్టెంబర్‌ 29: తప్పుడు ర్యాంకులతో పదోన్నతులు.. పదోన్నతులు, బదిలీల్లో టీచర్లు ర్యాంకులను తప్పుగా చూపించారు. 317 జీవో సమయంలో ఒకలా, ఇప్పుడు మరోలా చూపించిన వైనాన్ని ‘సాక్షి’ బట్టబయలు చేసింది. దీంతో స్పందించిన విద్యాశాఖ తప్పుడు ర్యాంకులతో పదోన్నతులు, బదిలీ చేయించుకున్న వారిపై చర్యలు చేపట్టింది.

అక్టోబర్‌ 31: కలెక్టర్‌ నివాపంలో చోరీ.. అక్టోబర్‌ 30న రాత్రి కరీంనగర్‌ కలెక్టర్‌ బి.గోపి నివాసంలో ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరుకు చెందిన పగిడిపల్లి ప్రసాద్‌ చొరబడ్డాడు. కలెక్టర్‌కు సంబంధించిన ల్యాప్‌టాప్‌, చార్జర్‌, బ్యాగు, పెన్‌డ్రైవ్‌ను ఎత్తుకెళ్లాడు. పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. నవంబర్‌ 7న అతన్ని అరెస్టు చేసి, కోర్టుకు తరలించారు.

డిసెంబర్‌ 22: తిరుపతికి ఇక వారానికి నాలుగు రైళ్లు.. కరీంనగర్‌ నుంచి తిరుపతికి వారానికి రెండుసార్లు ఉన్న బైవీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను ఇకపై నాలుగుసార్లు నడపాలని కేంద్రం నిర్ణయించింది. ప్రయాణికుల ఇక్కట్లపై ‘సాక్షి’ వరుస కథనాలకు స్పందించిన ఎంపీ బండి సంజయ్‌ సర్వీసుల సంఖ్య పెంచుతానని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు.

డిసెంబర్‌ 27: ఎల్‌పీసీ సమర్పించాలి.. లాస్ట్‌ పేమెంట్‌ సర్టిఫికెట్‌ (ఎల్‌పీసీ) సమర్పించకుండానే పలువురు ఇంజినీర్లు కరీంనగర్‌లో ఉద్యోగం చేస్తున్న వైనంపై ‘సాక్షి’ ప్రచురించిన కథనానికి నగరపాలక కమిషనర్‌ స్పందించారు. అధికారులందరూ వెంటనే ఎల్‌పీసీ సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు.

ఇవి చ‌ద‌వండి: అర్ధరాత్రి స్వాతి వద్దకు వచ్చిన వ్యక్తి ఎవరు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement