మరణ మృదంగం | For traces of water janaranyam | Sakshi
Sakshi News home page

మరణ మృదంగం

Published Sun, Apr 17 2016 1:46 AM | Last Updated on Wed, Oct 3 2018 5:26 PM

మరణ మృదంగం - Sakshi

మరణ మృదంగం

భానుడి దెబ్బకు మూగజీవాలు అల్లాడుతున్నాయి. గుక్కెడు నీటి కోసం ‘అరణ్య’రోదన చేస్తున్నాయి.
అడవుల్లో చెలిమలు, వాగులు, వంకలు ఎండిపోవడంతో దాహంతో అలమటిస్తున్నాయి.
నీటి జాడ కోసం జనారణ్యంలోకి వస్తూ ప్రాణాలు విడుస్తున్నాయి.
గోదావరి, కృష్ణా, మంజీర, ప్రాణహిత నదీపరివాహక ప్రాంతాలు ఎడారిని తలపిస్తున్నాయి.
ఇది ఆయా ప్రాంతాల్లోని వన్యప్రాణులకు మరణశాసనంగా మారింది.

 - సాక్షి, హైదరాబాద్

 
 అడవిలో గుక్కెడు నీళ్లు లేక మూగజీవాల విలవిల
* అటవీప్రాంతాల్లో ఎండిపోయిన చెలిమలు, వాగులు, వంకలు
* ఎడారిని తలపిస్తున్న నదీ పరివాహక ప్రాంతాలు
* నీటి చుక్క కోసం తపిస్తున్న అభయారణ్యాల్లోని జంతువులు

 
ఎక్కడ చూసినా దాహం.. దాహం..

రాష్ట్రంలో 7,260.56 చదరపు కిలోమీటర్ల పరిధిలో సంరక్షక అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఇది 365 జాతుల పక్షులు, 103 జాతుల క్షీరదాలు, 28 జాతుల సరీసృపాలు, 21 జాతుల ఉభయచరాలకు ఆలవాలం. పులులు, చిరుతలు, అడవి దున్నలు, నాలుగు కొమ్ముల జింకలతోపాటు నదుల్లో మార్ష్ జాతి మొసళ్లు ప్రత్యేక ఆకర్షణ. ఆదిలాబాద్ జిల్లాలో కవ్వాల్‌తో పాటు మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో అమ్రాబాద్ పులుల సంరక్షణ కేంద్రాలుగా ప్రసిద్ధి గాంచాయి. గోదావరి నదిపై నిర్మించిన కడెం జలాశయం పూర్తిగా ఎండిపోవడంతో కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రం తీవ్ర నీటి కొరత ఎదుర్కొంటోంది.

కృష్ణా నదిలో కొంత భాగం తడారిపోవడంతో అమ్రాబాద్ పులుల సంరక్షణ కేంద్రంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మిగతా అభయారణ్యాలు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల పరిస్థితి సైతం దారుణంగా తయారైంది. ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల పరిధిలోని సివారం, మెదక్  జిల్లాలోని మంజీర వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల్లో నీళ్లు లేక మొసళ్లు విలవిలలాడుతున్నాయి. నీటి కోసం తరచూ గ్రామాల్లోని పంట పొలాల్లోకి చొరబడుతున్నాయి.
 
ఆదుకునే ప్రణాళిక ఏదీ..?
ఎల్‌నినో ప్రభావం భయంకరంగా ఉంటుందన్న విషయాన్ని శాస్త్రవేత్తలు ఎప్పుడో వెల్లడించారు. దాని వల్ల వన్యప్రాణులకు వచ్చే ముప్పును ఎదుర్కొనే విషయంలో ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించలేదు. కరువు దుష్ర్పభావాన్ని పూర్తిగా అడ్డుకోవటం అసాధ్యమే అయినా.. ముందస్తుగా కొన్ని చర్యలు తీసుకోగలిగితే దాన్ని కొంతమేర నివారించే పరిస్థితి ఉంటుంది. కానీ నీటి కొరత తీవ్రంగా ఉండబోతోందన్న విషయం తెలిసీ ముందస్తు చర్యలు తీసుకోలేదు.

అటవీ శాఖ వద్ద నిధులకు కొదవ లేనప్పటికీ ప్రణాళిక లేకుండాపోయింది. నీటి గలగలలు, పచ్చటి పరవళ్లతో సుందరంగా కనిపించే అడవులు ఎండాకాలంలో కళ తప్పటం సహజం. నదులు, వాగులు, వంకలు, చెలమలు, కుంటలు ఎండిపోయి నీటి కొరత ఏర్పడుతోంది. ఇలాంటి సమయంలో జంతువుల దప్పిక తీర్చేందుకు ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేయాలి. సిమెంటుతో పెద్దపెద్ద గుంతలు తీసి వాటిలో నీళ్లు నింపాలి. వీటిని ‘సాసర్’లుగా పేర్కొంటారు.

కొన్నిచోట్ల గుంత తవ్వి దానిపై మందపాటి షీట్ పరిచి నీళ్లు నింపుతారు. ఒక్కోదానిలో దాదాపు 800 లీటర్ల వరకు నీళ్లుంటాయి. ఇలాంటివి అడవి అంచు(ఫ్రింజ్)న ఏర్పాటు చేస్తారు. రాష్ట్రంలో దాదాపు 400 వరకు ఉన్నాయి.

వీటిలో ట్యాంకర్ల ద్వారా నీటిని నింపాలి. ఎండ తీవ్రత నేపథ్యంలో ఈసారి వీటి సంఖ్యను మరింత పెంచి ట్యాంకర్ల ద్వారా నీళ్లు నింపే కార్యాచరణ ప్రణాళిక కొరవడింది. కొత్తవి నిర్మించకపోగా.. ఉన్న వాటిల్లోనూ నీళ్లు నింపడం లేదు. ట్యాంకర్లు వెళ్లగలిగే కొన్ని ప్రాంతాలకే ఈ సేవలు పరిమితమయ్యాయి. గుట్టల ఆవల ఉండేవి నీళ్లు లేక ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దీంతో వన్యప్రాణులు జనారణ్యంలోకి వస్తున్నాయి.
 
మంచి పథకం కూడా శాపమే!
చెరువులకు పునర్‌వైభవం కోసం ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ కూడా మూగజీవాలకు శాపంగా మారింది. పూడిక తీత పనులతో ఆయా చెరువులన్నీ తడి లేకుండా మారిపోయాయి. ఉదాహరణకు ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో నాలుగు ప్రధాన చెరువులున్నాయి. సింగభూపాలం చెరువు 500 ఎకరాలకు నీరందిస్తుంది.

ఇందులో 30 శాతం నీళ్లుండగానే కాకతీయ పనుల కోసం తూముల ద్వారా నీటిని బయటకు పంపారు. ఇదే ప్రాంతంలో పెనగడప, కారుకొండ, అనిశెట్టిపల్లెలోని చెరువులను కూడా ఇలాగే ఖాళీ చేశారు. ఇక్కడ ఒక్కచోటే కాదు చాలాచోట్ల చెరువులను ఇలాగే ఖాళీ చేశారు. ఇది మంచి కార్యక్రమే అయినా.. ప్రత్యామ్నాయంగా చెరువుల పక్కన చిన్నపాటి గుంతలో నీళ్లు నింపేలా కార్యాచరణ చేపట్టాల్సిందని, వాటితో మూగజీవాల దాహార్తి కాస్తయినా తీరేదని జంతుప్రేమికులు అంటున్నారు.
 
బోర్లు ఏమయ్యాయి?
అడవిలో బోర్లు వేసి సమీపంలోని కొంత ఎత్తులో ట్యాంకులు కట్టి గ్రావిటీ ద్వారా నీటిని సమీపంలోని చిన్నచిన్న కుంటల్లోకి పంపుతారు. కానీ వేసవి తీవ్రతను దృష్టిలో ఉం చుకొని ముందుగా కొత్త ప్రాంతాల్లో బోర్లు వేయించలేదు. వ్యక్తులు వెళ్లి ఆపరేట్ చేయాల్సిన అవసరం లేకుండా సౌరశక్తితో నడిచే డెన్మార్క్ యంత్రాలతో బోర్లు ఏర్పాటు చేసే ప్రాజెక్టును అటవీశాఖ 2008లో ప్రారంభించింది.

ఎండ రాగానే మోటార్ దానంతట అదే స్టార్ట్ అయి సమీపంలోని ట్యాంకులోకి నీళ్లు పంపుతుంది. దానికి ఏర్పాటు చేసిన పైపుల ద్వారా నీళ్లు కుంటలకు వెళ్తాయి. ఇలాంటివి అమ్రాబాద్, ఏటూరు నాగారం, హరిణ వనస్థలి, కవ్వాల్, కిన్నెరసాని అభయారణ్యాలు, జంతు సంరక్షణ కేంద్రాల్లో ఉన్నాయి. ఈసారి కవ్వాల్, అమ్రాబాద్‌లో రెండు చొప్పున, పోచారం, కిన్నెరసాని, ఏటూరు నాగారంలలో ఒకటి చొప్పున కొత్తవి ఏర్పాటు చేయాలని ప్రణాళిక సిద్ధం చేశారు. కానీ ఇప్పటివరకు కార్యాచరణే లేదు. వచ్చేనెలలో వీటిని ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ లోపు జంతువుల దాహం ఎవరు తీర్చాలో అధికారులకే తెలియాలి.
 
కేంద్రం నుంచి అందని నిధులు..
కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం కింద రాష్ట్రాలకు వన్యప్రాణుల సంక్షేమ నిధులు రావాల్సి ఉంటుంది. కానీ గత రెండేళ్లుగా తెలంగాణకు రూపాయి కూడా అందటం లేదు. అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ ప్రాజెక్టులకు మాత్రం రూ.4 కోట్లు అందాయి. మిగతా అభయారణ్యాలు, అటవీ రక్షిత ప్రాంతాలకు పైసా రాలేదు.

ఈ విషయంలో కేంద్రంపై  ప్రభుత్వం కూడా పెద్దగా ఒత్తిడి చేయలేదు. ప్రణాళికలు పంపితే రూ.1.82 కోట్లు ఇస్తామని కేంద్రం తాజాగా పేర్కొనటంతో ఇప్పుడు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఆ నిధులు జూన్ నాటికికానీ రావు. అప్పటికి వానాకాలం మొదలవుతుంది. పనులు జరిగే సరికి మళ్లీ వేసవి వస్తుంది. అంటే ఆ నిధులు ఈసారి ఉపయోగపడవన్నమాట!
 
చెక్‌డ్యాంలే పెద్ద అండ
అడవుల్లో వాగులు, వంకలకు కొదువ ఉండదు. వాటిపై పెద్ద సంఖ్యలో చెక్‌డ్యాంలు నిర్మిస్తే వానలు కురిసినప్పుడు భారీగా నీళ్లు నిలువ ఉండి వేసవికి ఉపయోగపడతా యి. ఈసారి వాటి సంఖ్య పెం చితే వచ్చే వానాకాలానికి ఉపయోగపడతాయి. కానీ మే సమీపిస్తున్నా ఆ పనుల జాడే లేదు. కనీసం ప్రణాళికలు కూడా సిద్ధం చేయలేదు. వానలు మొదలయ్యాక పనులు చేయటం కష్టం. వచ్చే సంవత్సరం వేసవిలో పనులు చేపట్టే అవకాశం ఉంది. అంటే కొత్త వాటి ఫలితం అందాలంటే రెండు ఎండాకాలాలు దాటాల్సిందే!
 
కానరాని అధ్యయనాలు
విదేశాల్లో మంచి పద్ధతులు ఉంటే వాటిని అధ్యయనం జరిపి ఇక్కడ అనుసరించటం సహజం. కానీ ఎండల్లో వన్యప్రాణులకు నీళ్లు ఎలా అందించాలనే విషయంలో మన అధికార యంత్రాంగానికి ఎలాంటి అధ్యయన అవకాశాల్లేకుండా పోయాయి. ఇప్పటి వరకు అలాంటి స్డడీ టూర్‌లు ఏర్పాటు చేయలేదు. మనకంటే తక్కువ వర్షపాతం ఉన్న ఇజ్రాయెల్ లాంటి దేశాలు వన్యప్రాణుల దప్పిక తీర్చే విషయంలో ప్రత్యేక పద్ధతులు అవలంభిస్తున్నాయి. వాటిపై మన అధికారులకు అవగాహన లేదు. ఇలా విపత్కర పరిస్థితులు ఏర్పడ్డప్పుడు అప్పటికప్పుడు చర్యలు తీసుకోవటంలో అధికారులు చేతులెత్తేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement