ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం ఒడ్డుగూడెంలో గిరిజనులు సాగుచేసిన పంటను ట్రాక్టర్‌తో ధ్వంసం చేస్తున్న దృశ్యం
• ఖమ్మం జిల్లాలో వేల ఎకరాల అటవీ భూములను సాగు చేస్తున్న అధికార పార్టీ నేతలు
• చూసీ చూడనట్లు వదిలేస్తున్న అటవీశాఖ
బొల్లం శ్రీనివాస్ :
ఖమ్మం జిల్లావ్యాప్తంగా వేల ఎకరాల్లో పోడు సాగవుతోంది. పోడు సాగవడమంటే గిరిజనులు సాగు చేసుకుంటున్నారనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఈ పోడు భూములన్నింటినీ అధికార పార్టీ నాయకులు, వారి అండతో బడా రైతులు సాగుచేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన రైతులకు కౌలుకు ఇచ్చుకుంటూ లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. మరోవైపు గిరిజనులూ పోడు వ్యవసాయం చేస్తున్నా.. అటవీ శాఖ అధికారులు వారి పంటలను నిర్దాక్షిణ్యంగా ధ్వంసం చేసి, భూములను స్వాధీనం చేసుకుంటున్నారు. రాజకీయ నాయకుల ఆధీనంలోని పోడు భూములు, కౌలు వ్యవహారాలను మాత్రం చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు.
గిరిజనుల బతుకులు ఆగమాగం..
ఖమ్మం జిల్లాలో 5,55,994 హెక్టార్ల మేర అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. స్థానిక గిరిజనులతోపాటు ఛత్తీస్‌గఢ్, ఒడిశా నుంచి వచ్చిన ఆదివాసీలు అడవిలో పోడు వ్యవసాయం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న ఆ భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలంటూ గతంలో ఉద్యమాలు కూడా జరిగాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో దాదాపు 30 వేల మంది గిరిజనులకు 2.05 లక్షల ఎకరాలకు సంబంధించి హక్కుపత్రాలు ఇచ్చారు. మరో లక్ష ఎకరాలకు పైగా హక్కు పత్రాలు ఇవ్వాల్సి ఉండగా.. తర్వాత వచ్చిన ప్రభుత్వాల నిర్లక్ష్యంతో అది ఆగిపోయింది. కానీ ఇటీవల హరితహారం పేరుతో అధికారులు వ్యవహరించిన తీరుతో గిరిజనుల పచ్చని బతుకులు చిన్నాభిన్నమైపోతున్నాయి.
పోడు భూముల్లో వాణిజ్య పంటలు
మరోవైపు అశ్వారావుపేట, ములకలపల్లి, దమ్మపేట, దుమ్ముగూడెం, ఇల్లెందు, టేకులపల్లి, పాల్వంచ, కొత్తగూడెం, చర్ల, వాజేడు, చండ్రుగొండ, వెంకటాపురం మండలాల్లోని దట్టమైన అటవీ ప్రాంతాల్లో పోడు భూములను అధికార పార్టీ నాయకులు యథేచ్ఛగా సాగు చేయిస్తున్నారు. ఆ భూముల్లో జామాయిల్, పత్తి, మొక్కజొన్న వంటి పంటలను వారు సాగు చేయడంతోపాటు కౌలుకు కూడా ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పెద్ద రైతులు ఈ భూముల్ని కౌలుకు తీసుకుని.. ట్రాక్టర్లు, టిల్లర్లతో 10 నుంచి 50 ఎకరాల వరకు సాగు చేస్తుండటం గమనార్హం. ఆక్రమించుకున్న భూముల వైపు వెళ్లిన అటవీ అధికారులను అధికార పార్టీ నేతలు బెదిరిస్తున్నారని ఆరోపణలున్నాయి.
గిరిజనుల పంటలు ధ్వంసం
అధికార పార్టీ నేతలు ఆక్రమించుకున్న భూములను చూసీ చూడనట్లు వదిలేస్తున్న అటవీ శాఖ అధికారులు... కుటుంబమంతా కాయకష్టం చేసి సాగు చేస్తున్న పోడు భూముల్లోని పంటలను మాత్రం ధ్వంసం చేయిస్తున్నారు. ఇటీవల టేకులపల్లి, చండ్రుగొండ, ఇల్లెందు, కొత్తగూడెం, కొణిజర్ల, గార్ల, బయ్యారం, వెంకటాపురం, చర్ల మండలాల్లో ఆదివాసీలు సాగు చేసిన పంటలను హరితహారం పేరుతో నాశనం చేయించారు. పంట చేతికి అందే దశలో నాశనం చేయవద్దంటూ కాళ్లా వేళ్లా పడినా కనికరించలేదు. ఈ ఒక్క పంట వదిలేయాలని, తర్వాత పంట సాగుచేయబోమంటూ ప్రాధేయపడినా వినలేదు. ఇలా స్వాధీనం చేసుకున్న భూముల్లో హరితహారం కింద మొక్కలు నాటుతున్నామని హడావుడి చేసి వదిలేశారు. అయితే గిరిజనుల పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరించిన అధికారులు.. నేతల కనుసన్నల్లో సాగవుతున్న భూములు, కౌలు దందాలను మాత్రం ఎందుకు వదిలేస్తున్నారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రికార్డుల్లో పేర్లుండవు.. సాగవుతాయి
ఆదివాసీలు సాగు చేసుకుంటున్న అన్ని భూముల వివరాలు రెవెన్యూ రికార్డుల్లో నమోదు కావు. కేవలం హక్కుపత్రాలు పంపిణీ చేసిన భూములే నమోదవుతున్నాయి. అధికార పార్టీ నేతల అధీనంలో ఉన్న పోడు భూములు కూడా రికార్డుల్లో ఉండవు. కానీ ఏళ్లుగా వారి అధీనంలోనే సాగవుతుంటాయి. నేతలు ఆంధ్రప్రదేశ్ రైతులకు కౌలుకు ఇచ్చిన సమయంలో.. వారితో ప్రామిసరీ నోట్లు రాయించుకోవడం, భూమిని కౌలుకు ఇస్తున్నట్లు కాగితాలు రాసుకోవడం చేస్తుంటారు. దీంతో రెవెన్యూ రికార్డుల్లో వారి పేరు లేకున్నా.. భూమి మాత్రం వారిదిగానే చలామణీ అవుతుంటుంది. పత్తి అయితే ఎకరానికి రూ.10 వేలు, జామాయిల్ అయితే రూ.5 వేల చొప్పున సీజన్ వారీగా కౌలు వసూలు చేస్తారు. ఈ కౌలు ఒప్పందాల్లో అధికార పార్టీ నేతలకు కిందిస్థాయి అటవీ సిబ్బంది మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.