
‘అటవీ శాఖ’ సమస్యలు పరిష్కారం
► త్వరలో రిక్రూట్‌మెంట్ చేపడుతాం
► హరితహారానికి గ్రామ స్థాయి ఇబ్బందులపై ఆరా
► ప్రతి జీపీకి 40 వేల మొక్కలు నాటడమే లక్ష్యం
► అటవీ అధికారులు, సిబ్బంది సమస్యలు పరిష్కరిస్తాం
► అటవీశాఖ మంత్రి జోగు రామన్న సమీక్ష
ఆదిలాబాద్‌అర్బన్ : అటవీ శాఖలో అంతర సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి జోగు రామన్న అన్నారు. క్షేత్ర స్థాయిలో ఇబ్బందులను తొలగించి పథకాల అమలును పటిష్టం చేస్తామని వివరించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న హరితహారాన్ని మరో విడత చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. అధికారులు, సిబ్బంది సమస్యల పరిష్కారంతో పాటు శాఖలో దీర్ఘకాలికంగా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ చేపడుతామని పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అటవీ శాఖపై రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి రామన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మొదట అటవీ శాఖ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను పథకాల అమలు పరంగా ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. డీఎఫ్‌వో గోపాల్‌రావు అటవీ శాఖ పరిస్థితులు, చేపడుతున్న కార్యక్రమాలు, వివిధ అంశాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. జిల్లా వ్యాప్తంగా ఐదు ఫారెస్ట్ రేంజ్‌ల పరిధిలో 145 మంది అధికారులు సిబ్బంది పని చేయాల్సి ఉండగా, 119 మంది విధులు నిర్వర్తిస్తున్నారని, మిగతా 26 పోస్టులుగా ఖాళీగా ఉన్నాయని మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం మానస పుత్రిక అయినా హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది ప్రతి గ్రామ పంచాయతీకి 40 వేల మొక్కలు నాటడం టార్గెట్ ఉందని, ప్రతి నియోజకవర్గానికి 40 లక్షలు మొక్కలు నాటడం లక్ష్యంగా విధించినట్లు చెప్పారు.
జిల్లా వ్యాప్తంగా నాలుగు కోట్ల మొక్కలు నాటేందుకు సిద్దంగా ఉండాలన్నారు. అటవీ శాఖలో త్వరలో రిక్రూట్‌మెంట్ ఉంటుందన్నారు. సమావేశంలో భాగంగా తునికి ఆకు సేకరణ పథకం పోస్టర్లను అవిష్కరించారు. ఇందులో ప్రభుత్వ భూమిలో నుంచి సేకరించిన యాభై ఆకుల కట్టకు రూ.1.25, పట్టా భూముల నుంచి సేకరించిన ఒక కట్టకు రూ.1.33 ధర ఉంది. కార్యక్రమంలో నిజామాబాద్ సోషల్ ఫారెస్ట్ కన్జర్వేటర్ ఆనంద్ మోహన్, ఆదిలాబాద్ డీఎఫ్‌వో గోపాల్‌రావు, ఫారెస్ట్ రేంజ్ అధికారులు, బీట్, అసిస్టెంట్ బీట్ అధికారులు, సెక్షన్ అధికారులు పాల్గొన్నారు.