111.03 ఎకరాల అటవీభూమికి టీడీపీ పెద్దల ఎసరు | TDP Leader Plants To Occupy Land At Vijayawada Highway | Sakshi
Sakshi News home page

111.03 ఎకరాల అటవీభూమికి టీడీపీ పెద్దల ఎసరు

Published Mon, Dec 23 2019 5:26 AM | Last Updated on Mon, Dec 23 2019 9:34 AM

TDP Leader Plants To Occupy Land At Vijayawada Highway - Sakshi

విజయవాడ: ఓ కొండ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూమి అది. దానిని ఓ జమీందారు పలువురికి విక్రయించారు. ప్రభుత్వం ఆ భూమిని స్వాధీనం చేసుకుని అటవీ శాఖకు అప్పగించింది. ఆ మేరకు గెజిట్‌ కూడా ప్రచురించింది. అంతవరకు సవ్యంగానే ఉంది. ఆ తర్వాతే కథ ప్రారంభమైంది. ఎందుకంటే... అది విజయవాడ–హైదరాబాద్‌ జాతీయ రహదారికి కేవలం కిలోమీటరు దూరంలో ఉన్న వందల కోట్ల రూపాయల విలువైన భూమి. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం నవీపోతవరం గ్రామ ఆర్‌.ఎస్‌.నంబర్‌ 86లో ఉన్న ఈ 111.03 ఎకరాల భూమికి విజయవాడ 24 కి.మీ. దూరం మాత్రమే. ఇక్కడి ఎకరం బహిరంగ మార్కెట్లో రూ. 3 కోట్ల వరకు ఉంది. ఈ లెక్కన భూమి విలువ రూ. 300 కోట్లు, అందులో నిక్షిప్తమైన కంకర విలువ సుమారు రూ. 200 కోట్లు. మొత్తం రూ. 500 కోట్లు ఉంటుందని ఓ అంచనా.

దీనికి పక్కనే ఉన్న రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌లో చదరపు గజం రూ. 5 వేల నుంచి రూ. 6 వేల వరకు ధర పలకడం గమనార్హం. దీంతో అటవీశాఖకు చెందిన ఆ భూమిని చేజిక్కించుకునే పన్నాగాలు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ముమ్మరం చేశారు. మొదట 2000 సంవత్సరంలో మొదలు పెట్టి,  2014లో వేగవంతం చేశారు. దీనికి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సూత్రధారి కాగా, అప్పటి సీఎంవోలో పనిచేసిన ఓ ఐఏఎస్‌ చక్రం తిప్పారు. ఆ 111.03 ఎకరాల భూమిని కొనుగోలు చేసినందున తనకు రిజిస్ట్రేషన్‌ చేయాలని విజయవాడ నగర వాసి, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి (ఈడీబీ) మాజీ సీఈవో జాస్తి కృష్ణ కిశోర్‌కు మామ అయిన ముక్కామల రామచంద్రరావు రిజిస్ట్రేషన్‌ శాఖను 2009లో సంప్రదించారు. వీలుకాదని చెప్పడంతో కోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

అటవీశాఖ భూమి అని రికార్డులు చెబుతున్నా...
►నవీపోతవరంలోని ఈ భూమిని సౌత్‌ వల్లూరు ఎస్టేట్‌ జమీందారు–1 తమదిగా పేర్కొంటూ వి.వీరేశలింగం, తదితరులకు విక్రయించారు. అయితే, ‘ది ఆంధ్రప్రదేశ్‌ ఎస్టేట్‌ యాక్ట్‌ 1948’లో భాగంగా ఈ భూమిని 1949 సంవత్సరంలో ప్రభుత్వం స్వాధీనం చేసుకుని 1951లో అటవీశాఖకు బదలాయించింది.
►ప్రభుత్వ బదలాయింపును పునఃపరిశీలించాలని జమీందారు 1962లో ప్రభుత్వాన్ని కోరినా, ఆయనదేనని నిర్ధారించే రికార్డులు చూపలేకపోయారు.
►111.03 ఎకరాలను జమీందారు నుంచి కొనుగోలు చేశామని, ఆ భూమిని తమకు చూపాలని వి.వీరేశలింగం, మరో అయిదుగురు సర్వే విభాగం ద్వారా 2000లో పట్టా పొందారు.

ముక్కామల రంగప్రవేశం..
►వి.వీరేశలింగం, తదితరుల నుంచి 2006లో భూమి కొనుగోలు చేశానని, తన పేరిట రిజిస్ట్రేషన్‌ చేయాలంటూ ఇబ్రహీంపట్నం రిజిస్ట్రేషన్‌ కార్యాలయాన్ని ముక్కామల రామచంద్రరావు సంప్రదించారు. ఇందుకు సర్వే విభాగం ఇచ్చిన పట్టాలను ఆధారంగా  చూపారు. దీనిపై రిజిస్ట్రేషన్‌ విభాగం రెవెన్యూ శాఖను స్పష్టత కోరగా రిజిస్ట్రేషన్‌ చేయడానికి వీల్లేదని తేల్చేసింది. దీంతో సర్వే చేసి తనకు స్వాధీనం చేయాలని కోరుతూ రామచంద్రరావు ఎమ్మార్వో, సబ్‌ రిజిస్ట్రార్‌లను రెస్పాండెంట్లుగా చేర్చుతూ హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేశారు. అయితే, ఆ భూమి అటవీశాఖకు చెందినదేనని ఇబ్రహీంపట్నం తహశీల్దార్‌ కౌంటర్‌ పిటిషన్‌లో స్పష్టం చేశారు.

అది ప్రభుత్వానికి చెందిన భూమే..
►నవీపోతవరం సర్వే నెంబరు 86లోని భూమి అటవీశాఖకు చెందినదని తమ పరిశీలనలో స్పష్టమైందని కృష్ణా జిల్లా కలెక్టరు ఎ.ఎం.డి.ఇంతియాజ్, జాయింట్‌ కలెక్టర్‌ ఎం.మాధవీలత ‘సాక్షి’కి చెప్పారు. రికార్డులన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలింపజేశామని, న్యాయస్థానం దృష్టికి వాస్తవాలను తీసుకెళతామన్నారు. 20320/2009 రిట్‌ పిటిషన్‌లో జిల్లా ఉన్నతాధికారులను రెస్పాడెంట్లుగా వ్యూహాత్మకంగా చేర్చలేదని స్పష్టమవుతోందన్నారు. చిన్న ఉద్యోగుల వరకే పరిమితం చేశారన్నారు. ప్రభుత్వ భూమిని పరిరక్షించేందుకు న్యాయస్థానంలో వాదన వినిపించడానికి తమను కూడా అనుమతించాలని ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేశామని కలెక్టరు, జేసీలు వివరించారు.

గత ప్రభుత్వ హయాంలో వేగంగా పావులు...
►2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వేగంగా పావులు కదిలాయి. డీఎఫ్‌ఓగా బెనర్జీని నియమించి సర్వే ద్వారా 111.03 ఎకరాల సంగతి తేల్చాలని ప్రభుత్వం ఆదేశించింది. రెవెన్యూ, అటవీ, సర్వే శాఖలు ఉమ్మడి సర్వే నిర్వహించి సరిహద్దులు తేల్చాలని 2016 డిసెంబరు 13న డీఎఫ్‌ఓ ఉత్తర్వులిచ్చారు. కేవలం వారంలో అంటే అదే నెల 21లోగా పూర్తి చేయించి చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ రవికుమార్‌కు పంపారు. అక్కడి కొండలు, గుట్టల్లోని 858 ఎకరాల భూమిని కేవలం వారం వ్యవధిలో సర్వే ముగించడం పరిశీలనాంశం. ఆ సర్వేకి మూడు నెలలకు పైగా పడుతుందని సర్వే విభాగానికి చెందిన రిటైర్డు అధికారి ఒకరు సాక్షికి చెప్పారు. త్వరితగతిన సర్వేకి అప్పటి జిల్లా కలెక్టరు ఎ.బాబు తమపై ఒత్తిడి తెచ్చారని అటవీశాఖ అధికారి ఒకరు వివరించారు.

►తనకు అందిన రెవెన్యూ, అటవీ, సర్వే శాఖల ఉమ్మడి సర్వే నివేదికను ‘డిజిటల్‌  గ్లోబల్‌ పొజిషినింగ్‌ సిస్టం’ ద్వారా నిర్ధారించాలని ఎ.బాబు తర్వాత వచ్చిన కలెక్టరు బి.లక్ష్మీకాంతంకు సీసీఎఫ్‌ పంపారు. రెవెన్యూ రికార్డుల పరంగా ‘ఓకే’ అంటూ స్వల్ప వ్యవధిలోనే... అంటే 2017 ఫిబ్రవరి పదో తేదీకల్లా సీసీఎఫ్‌కు కలెక్టరు తిప్పి పంపారు.

►ఈ సర్వేలోనూ స్పష్టత లేదంటూ సర్వే నిర్వహించాలని ‘ఆంధ్రప్రదేశ్‌ స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌’ను అటవీశాఖ 2018 అక్టోబరులో కోరగా రెండున్నర నెలల్లోనే సీసీఎఫ్‌కు నివేదిక అందింది. సాధారణంగా ఏపీఎస్‌ఎసీ నుంచి అంత త్వరగా నివేదిక అందదని, దాని కోసం అప్పటి సీఎంవోలోని సీని యర్‌ ఐఏఎస్‌ తన పరపతి ఉపయోగించారని సమాచారం.

►ఇక్కడ కూడా సర్వే స్పష్టత లేనందున టియోడిలైట్‌ సర్వే లేదా కాంపాస్‌ సర్వే (ఉత్తర దిశ, తూర్పు దిశల ఆధారంగా కో–ఆర్డినేటర్స్‌ టెక్నాలజీతో నిర్వహించే సర్వే)కి నిర్ణయం జరిగింది. 2019 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 9 కల్లా ఈ సర్వే కూడా ముగిసింది. ప్రైవేటు వ్యక్తికి అటవీభూమిని కట్టబెట్టేందుకు అనుకూల నివేదికలివ్వాలని మాజీ మంత్రి దేవినేని ఉమా, ఇతర ప్రభుత్వ పెద్దలు అధికారులకు హుకుం జారీ చేశారనే తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.

►సీఎంవోలో కీలకంగా వ్యవహరించిన ఓ ఐఏఎస్, కృష్ణా జిల్లా కలెక్టర్లు– అటవీ, సర్వే, రెవెన్యూ శాఖల అధికారులను పరుగులు పెట్టించారు. సీఎంఓలోనే ఈ అంశంపై పలు సమావేశాలు నిర్వహించారని ఓ అధికారి తెలిపారు. కాగా, ఈ ఎపిసోడ్‌ను పర్యవేక్షించిన అటవీ శాఖకు చెందిన ఉన్నతాధికారికి పదవీ విరమణ అనంతరం రాజ్యాంగ బద్ధమైన పదవిని గత సర్కారు కట్టబెట్టడం పరిశీలనాంశం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement